'మత్తు వదలరా'

చిత్రం : 'మత్తు వదలరా'

నటీనుటులు: శ్రీ సింహా - నరేష్ అగస్త్య - అతుల్య చంద్ర - సత్య - వెన్నెల కిషోర్ - బ్రహ్మాజీ - విద్యుల్లేఖ తదితరులు
సంగీతం: కాలభైరవ
ఛాయాగ్రహణం: సురేష్ సారంగం
నిర్మాతలు: చెర్రీ - హేమలత
రచన - దర్శకత్వం: రితేష్ రాణా

కీరవాణి తనయులు శ్రీ సింహా - కాలభైరవ హీరో - సంగీత దర్శకులుగా పరిచయం అవుతున్న సినిమా ‘మత్తువదలరా’. రితేష్ రాణా అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం ఆసక్తికర ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా కూడా అంతే ఆసక్తికరంగా ఉందో లేదో చూద్దాం పదండి.

కథ:

బాబు మోహన్ (శ్రీ సింహా) పేద కుటుంబానికి చెందిన కుర్రాడు. పల్లెటూరి నుంచి ఉద్యోగం కోసమని సిటీకి వచ్చి ఇక్కడ చాలీ చాలని జీతంతో కొరియర్ బాయ్‌గా పని చేస్తుంటాడు. తన అవసరాలకు తగ్గ సంపాదన లేక తీవ్ర అసంతృప్తిలో ఉన్న బాబుకి అతడి కలీగ్ వక్రమార్గంలో డబ్బులు సంపాదించే మార్గం చెబుతాడు. అతను చెప్పినట్లు చేయబోయి బాబు పెద్ద చిక్కుల్లో పడతాడు. ఒక అపార్ట్ మెంట్ లో జరిగిన హత్య కేసులో అతను చిక్కుకుంటాడు. ఇంతకీ ఆ హత్య ఎవరు చేశారు.. దీని వెనుక నేపథ్యమేంటి.. బాబు దీన్నుంచి బయటపడ్డాడా లేదా అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

ప్రతి సినిమా టైటిల్స్ పడే ముందు మద్యపానం - ధూమపానం హానికరమని.. వాటికి దూరంగా ఉండమని హెచ్చరిక పడటం గమనించే ఉంటారు. మామూలుగా హీరోల వాయిస్ తోనే ఈ హెచ్చరిక వస్తుంటుంది. ఐతే ‘మత్తు వదలరా’ సినిమాలో మాత్రం చిన్న పాత్ర చేసిన పావలా శ్యామలతో ఫన్నీగా చెప్పించారిది. ఐతే ఇంటర్వెల్ తర్వాత మరోసారి ఆ కాషన్ వేయాల్సి ఉంటుంది కదా.. అప్పుడు మాత్రం పావలా శ్యామల కాకుండా సత్య లైన్ లోకి వస్తాడు. సినిమా ప్రథమార్ధంలో పావలా శ్యామల పాత్ర చనిపోయినట్లు చూపిస్తారు. కాబట్టి సత్య అందుకుని.. బామ్మ చచ్చిపోయింది కద పాపం అందుకే నేనొచ్చా అంటూ హెచ్చరిక జారీ చేస్తాడు. ‘మత్తువదలరా’ దర్శకుడు రితేష్ రాణా ఆలోచనలు ఎంత కొత్తగా.. ఫన్నీగా ఉంటాయో చెప్పడానికి ఇది సూచికగా చెప్పొచ్చు. ఈ సినిమా అంతటా కూడా ఇలాంటి సెన్సాఫ్ హ్యూమరే చూపించాడు. ప్రతి సన్నివేశాన్నీ ఎలా కొత్తగా ప్రెజెంట్ చేయాలనే చూశాడు. ‘మత్తు వదలరా’ ప్రోమోలు చూసి ఇందులో ఏదో కొత్తగా ఉంటుందని ఆశించే ప్రేక్షకుల్ని ఈ సినిమా నిరాశ పరచదు. స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగే ఈ చిత్రం ఉత్కంఠభరితంగా.. వినోదాత్మకంగా సాగుతూ ఓ వర్గం ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది.

‘మత్తు వదలరా’ కథ విషయానికి వస్తే అందులో పెద్ద విశేషం ఏమీ లేదు. హీరో అనుకోకుండా హత్య కేసులో ఇరుక్కోవడం.. ముందు కంగారు పడి.. ఆ తర్వాత తెలివిగా ఆలోచించి గుట్టు బయటపెట్టి తాను బయటపడం.. ఈ లైన్లో ఇప్పటికే ఎన్నో థ్రిల్లర్లు చూశాం. ఐతే ఈ మామూలు కథనే కొత్తగా స్టైల్ గా నరేట్ చేస్తూ ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేశాడు రితేష్. తెలుగులో ఎప్పుడో కానీ చూడని నియో-నాయిర్ స్క్రీన్ ప్లేతో ఈ కథను చెప్పడం దీన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. రెగ్యులర్ సినిమాలకు అలవాటు పడ్డ వాళ్లకు కొంచెం గందరగోళంగా అనిపించినప్పటికీ.. కొత్తదనం ఆశించే ప్రేక్షకుల్ని మాత్రం థ్రిల్ చేస్తూ సాగుతుంది ఇందులోని స్క్రీన్ ప్లే. పాత్రల్ని మొదలుపెట్టడం.. వాటిని బిల్డ్ చేయడం.. అన్నీ కూడా కొత్తగా అనిపిస్తాయి. ఇక సినిమాకు మేజర్ ప్లస్ అంటే సిచువేషనల్ కామెడీనే. కామెడీ ట్రాకులు.. పంచుల తరహాలో కాకుండా సందర్భోచితంగా పాత్రలు స్పందించే తీరు.. వాళ్లు మాట్లాడుకునే మాటలు భలే ఫన్నీగా అనిపిస్తాయి. ముఖ్యంగా సత్య అయితే తన కామెడీ టైమింగ్ కు తగ్గ పాత్ర పడటంతో చెలరేగిపోయాడు. అతడితో ముడి పడ్డ ప్రతి సన్నివేశం కడుపుబ్బ నవ్విస్తుంది. సినిమాకు మేజర్ ప్లస్ కూడా కామెడీనే. అది యూత్.. మల్టీప్లెక్స్ ఆడియన్స్ బాగా కనెక్టయ్యేలా ఉంటుంది.

‘మత్తు వదలరా’ ఆరంభం కొంచెం నెమ్మదిగా ఉంటుంది. థ్రిల్లర్ కథల తరహాలో సినిమా మొదలవదు. ఒక 20 నిమిషాల పాటు కథ పెద్దగా ముందుకు కదలదు. ఐతే స్నేహితుడి సలహాతో హీరో తప్పు చేయడానికి సిద్ధమై అపార్ట్ మెంట్లోకి ప్రవేశించిన దగ్గర్నుంచి కథనం ఊపందుకుంటుంది. ఇక్కడి నుంచి ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా ఉంటుంది. ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా సన్నివేశాలు నడుస్తూ థ్రిల్ చేస్తాయి. అక్కడక్కడా ఉత్కంఠభరిత మలుపులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగానే పేలింది. ద్వితీయార్ధంలోనూ మలుపులకు లోటు లేదు. కాకపోతే డ్రగ్స్ కుంభకోణానికి సంబంధించిన ఎపిసోడ్ అయితే అంత నమ్మశక్యంగా ఉండేలా తీర్చిదిద్దలేదు. కోట్లతో వ్యవహారాన్ని మరీ సింపుల్ గా చూపించేశారు. హీరో ఫ్రెండు క్యారెక్టర్ లోని ట్విస్ట్.. అతడి వ్యవహారం కూడా బిలీవబుల్ గా అనిపించవు. అలాగే పావలా శ్యామల పాత్రకు సంబంధించిన వ్యవహారం అనేక సందేహాలు రేకెత్తిస్తుంది. క్లైమాక్స్  కూడా అనుకున్న స్థాయిలో లేదు కానీ.. ఓవరాల్ గా అయితే ‘మత్తు వదలరా’ ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడంలో.. కితకితలు పెట్టడంలో విజయవంతమైంది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు కచ్చితంగా ఈ సినిమా చూడొచ్చు. మల్టీప్లెక్స్ ఆడియన్స్ ‘మత్తు వదలరా’తో బాగా కనెక్టయ్యే అవకాశముంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు అలవాటు పడ్డ వాళ్లకు మాత్రం ఈ సినిమా అంతగా రుచించకపోవచ్చు.

నటీనటులు:

కీరవాణి తనయుడు శ్రీ సింహా.. హీరోలా కాకుండా ఒక నటుడిగా తెరంగేట్రం చేయడం మంచి విషయం. సినిమాలో అతడి పాత్ర హీరోలా ఉండదు. మూడు ప్రధాన పాత్రల్లోఒకటిగా ఉంటుంది. మామూలు డెలివరీ బాయ్ గా అతను సులువుగా ఒదిగిపోయాడు. సినిమా చూస్తున్నంతసేపు అతను కీరవాణి కొడుకు అన్న ఫీలింగే ఎక్కడా కలగదు. పాత్ర మాత్రమే కనిపించేలా సహజంగా నటించాడతను. అతడి లుక్ కూడా ఈ క్యారెక్టర్ కు బాగా సెట్ అయింది. సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ పరంగా మేజర్ క్రెడిట్ మాత్రం సత్యకే ఇవ్వాలి. తనదైన కామెడీ టైమింగ్ తో అతను చెలరేగిపోయాడీ సినిమాలో. అతడి కోసమే సినిమా ఒకసారి చూడొచ్చంటే అతిశయోక్తి కాదు. కొత్త కుర్రాడు నరేష్ అగస్త్య కూడా బాగా చేశాడు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను అతను పండించాడు. అతుల్య.. డ్రగ్ డీలర్ పాత్రలో మెరిసింది. వెన్నెల కిషోర్.. బ్రహ్మాజీ.. విద్యుల్లేఖ.. పావలా శ్యామల.. వీళ్లంతా తమ తమ పరిధిలో బాగా చేశారు. కిషోర్ పాత్ర నుంచి ఇంకాస్త వినోదం ఆశిస్తారు ప్రేక్షకులు.

సాంకేతిక వర్గం:

కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవ.. తండ్రికి తగ్గ తనయుడినని చాటుకున్నాడు. నేపథ్య సంగీతంతో సినిమాను అతను మరో స్థాయికి తీసుకెళ్లాడు. సినిమా లాగే అతడి బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా కొత్తగా అనిపిస్తుంది. ఈ విషయంలో తండ్రి అతడికి సాయం చేశాడనే అనుమానం కూడా రాకుండా కీరవాణి స్టయిల్ ను ఫాలో కాకుండా తనదైన పనితనం చూపించాడు కాలభైరవ. చాలా సౌండ్స్ కొత్తగా అనిపిస్తాయి. సురేష్ సారంగం కెమెరా పనితనం కూడా బాగుంది. దర్శకుడి అభిరుచికి తగ్గట్లుగా ఛాయాగ్రహణం సాగినట్లు అనిపిస్తుంది. ఈ కథను సినిమాగా తీయడానికి ఒప్పుకోవడమే కాక.. స్టైల్ గా ప్రెజెంట్ చేయడానికి తగ్గ వనరులు సమకూర్చిన నిర్మాతలు అభినందనీయులు. ఇక రితేష్ రాణా.. తాను ఈ తరానికి చెందిన దర్శకుడినని చాటాడు. అతడిపై హాలీవుడ్ థ్రిల్లర్ల ప్రభావం ఉన్న విషయం అర్థమవుతుంది కానీ.. స్క్రీన్ ప్లే.. నరేషన్ విషయంలో అడుగడుగునా తన ప్రతిభను చూపించి కొత్త సినిమాలు కోరుకునే ప్రేక్షకుల్ని అలరించాడు. కాస్త గందరగోళం తగ్గించి.. డ్రగ్ కుంభకోణానికి సంబంధించి ఎపిసోడ్ ఇంకాస్త ప్రభావవంతంగా తీర్చిదిద్ది ఉంటే రితేష్ కు ఇంకా మంచి మార్కులు పడేవి. పరిమిత వనరుల్లోనే మంచి ఔట్ పుట్ ఇచ్చిన అతను.. మున్ముందు చూడదగ్గ దర్శకుడు అతననడంలో సందేహం లేదు.

చివరగా: మత్తు వదలరా..  ఫన్నీ అండ్ థ్రిల్లింగ్

రేటింగ్- 2.75/5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
× RELATED వి
×