'ఇద్దరి లోకం ఒకటే'

చిత్రం :'ఇద్దరి లోకం ఒకటే'

నటీనుటులు: రాజ్ తరుణ్ - షాలిని పాండే - నాజర్ తదితరులు
సంగీతం: మిక్కీ జే మేయర్
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
మాటలు: అబ్బూరి రవి
నిర్మాత: శిరీష్
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: జీఆర్ కృష్ణ

కెరీర్ ఆరంభంలో వరుస హిట్లతో మంచి ఊపు మీద కనిపించి.. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో ట్రాక్ తప్పిన యువ కథానాయకుడు రాజ్ తరుణ్. కొంచెం గ్యాప్ తర్వాత అతను ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇంతకుముందు రాజ్‌ తో ‘లవర్’ నిర్మించిన దిల్ రాజే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. జీఆర్ కృష్ణ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

వర్ష (షాలిని పాండే) చిన్నప్పట్నుంచి నటన మీద ఎంతో ఆసక్తి ఉన్న అమ్మాయి. హీరోయిన్ కావాలన్నది ఆమె జీవితాశయం. అందుకోసం అనేక ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఏదీ ఫలించదు. ఆమె బాయ్ ఫ్రెండ్ సహా ఎవరికీ తనపై నమ్మకం ఉండదు. అలాంటి సమయంలో వర్షకు మహి (రాజ్ తరుణ్) పరిచయం అవుతాడు. అతను ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్. మహి చేసిన ఒక ఫొటో షూట్ వల్ల వర్షకు కథానాయికగా అవకాశం వస్తుంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. మహి.. వర్షను ప్రేమిస్తాడు. మరి ఆమె అతణ్ని ప్రేమించిందా.. వీళ్లిద్దరి ప్రయాణం చివరికి ఏ మజిలీకి చేరింది అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమాలో హీరోయిన్ ముందు ఓ అబ్బాయితో కమిటై ఉంటుంది. అతడితో మూడేళ్ల పాటు ప్రయాణం చేస్తుంది. కానీ తర్వాత ఆ అమ్మాయికి మరో అబ్బాయి పరిచయం అవుతాడు. నచ్చుతాడు. అతడితోనే జీవితం పంచుకోవాలనుకున్నాక ముందు కమిటైన అబ్బాయితో బ్రేకప్ చెబుతుంది? అందుకతను నేనేం తప్పు చేశాను.. ఎందుకు నన్నొదిలేస్తున్నావు అని అడుగుతాడు? దానికి బదులుగా కథానాయికగా.. ‘‘మనం మూడేళ్ల పాటు కలిసున్నాం. అందులో గుర్తుంచుకోదగ్గ ఒక్క మూమెంట్ చెప్పు.. ఒక్క అందమైన సందర్భమైనా గుర్తు చేసుకో. అలాంటి మూమెంట్స్ ఏమీ లేనపుడు ఇది ప్రేమ ఎలా అవుతుంది’’ అంటుంది. ఈ సినిమా మొత్తం అయ్యాక ప్రేక్షకుడికి కూడా.. ‘‘ఈ సినిమా మొత్తంలో అందమైన ఒక్క మూమెంట్ చెప్పండి. ఎక్కడైనా ఒక్క చోటైనా ఫీల్ ఉందేమో చూడండి. అలా లేనపుడు ఈ ప్రేమకథ ఎలా పండుతుంది’’ అని దర్శక నిర్మాతల్ని ఇలాగే అడగాలనిపిస్తే ఆశ్చర్యం ఏమీ లేదు.

మన వాళ్లు ఎక్కువగా ఇంగ్లిష్..కొరియన్.. ఫ్రెంచ్ సినిమాలు చూసి స్ఫూర్తి పొంది కథలు అల్లుతుంటారు. ఐతే ‘ఇద్దరి లోకం ఒకటే’ దర్శకుడు జీఆర్ కృష్ణ టర్కీ నుంచి పట్టుకొచ్చాడు ఈ  కథను. దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత దీన్ని ఓకే చేసి.. ‘లవర్’ లాంటి డిజాస్టర్ అనుభవం ఉన్నా కూడా రాజ్ తరుణ్ తో ఈ సినిమా తీశాడు. మరి వీళ్లెంచుకున్న కథలో ఎంత విశేషం లేకపోతే.. ఇంత సాహసం చేసి ఉంటారు అని సినిమా చూసే సాహసం చేసిన ప్రేక్షకులకు ‘ఇద్దరి లోకం ఒకటే’ రెండు గంటల పాటు పరీక్ష పెడుతుంది. ఏ విశేషం లేకపోవడమే ఈ సినిమాలో ఉన్న విశేషం అని.. ఎండ్ కార్డ్ పడే వరకు అర్థం కాదు. తర్వాత ఏదో ఉంటుందిలే.. ఉంటుందిలే అని చూస్తూ చూస్తూనే పుణ్యకాలం మొత్తం గడిచిపోతుంది.

టర్కీ వాళ్లు ఏం తీశారో.. వీళ్లు అందులోంచి ఏం తీసుకున్నారో కానీ.. ప్రేమకథకు అత్యంత కీలకమైన ‘ఫీల్’ ఫ్యాక్టర్ ‘ఇద్దరి లోకం ఒకటే’లో ఎక్కడా కనిపించదు. ప్రేమకథల్లో ప్రధాన పాత్రలతో ఆడియన్స్ రిలేటవడం.. వాటిలో తమను చూసుకోవడం.. వారి మధ్య రొమాంటిక్ మూమెంట్స్ చూసి పులకింతకు లోనుకావడం జరిగితే ఈ కథ మనసు లోతుల్లోకి వెళ్తుంది. కానీ ఈ సినిమాలో కథ ఆరంభమైన కాసేపటికే ప్రధాన పాత్రలతో డిస్కనెక్ట్ అయిపోతాం. పుట్టుకతోనే ఇద్దరి మధ్య బంధం మొదలైనట్లు ‘ఖుషి’ రేంజిలో సీన్ ఓపెన్ చేశారు కానీ.. ఆ వ్యవహారం చాలా కృత్రిమంగా ఉండటంతో ఫీల్ రాదు. హీరో హీరోయిన్ల మధ్య ఒక యాదృచ్ఛికమైన బంధం ఉందని.. ఎవరి దారులు ఎటు ఉన్నా వాళ్లిద్దరి లోకం ఒకటే అని ఎస్టాబ్లిష్ చేయడానికి పెట్టిన సీన్లేవీ కూడా పండలేదు. ‘మళ్ళీ రావా’ స్ఫూర్తితో కొన్ని సీన్లు అల్లుకున్నట్లు అనిపిస్తుంది కానీ.. దాని లాగా ఈ సినిమా ఎక్కడా హృదయాల్ని తాకదు.

హీరోయిన్ కావాలన్న లక్ష్యంతో  ఇందులో కథానాయిక చేసే ప్రయత్నాలతో ముడిపడ్డ ఆరంభ సన్నివేశాలే సినిమాను పక్కదారి పట్టించేశాయి. చాలా రొటీన్‌ గా బోరింగ్ గా సాగే ఆ సన్నివేశాలతో కాసేపటికే ప్రేక్షకుల్లో ఆసక్తి సన్నగిల్లిపోతుంది. హీరో పాత్ర రంగప్రవేశంతో అయినా పరిస్థితి మారుతుందేమో అనుకుంటే.. అది వచ్చాక మరింత నీరసం వచ్చేస్తుంది. పాత్రే చాలా డల్లుగా అనిపిస్తే.. రాజ్ తరుణ్ ఏమాత్రం ఆసక్తి లేనట్లుగా అయిష్టంగా నటించినట్లుగా ఉండటంతో హుషారే పుట్టదు. ఇంటర్వెల్ దగ్గర హీరో అనారోగ్యం గురించి వెల్లడించే సన్నివేశం మలుపులాగే అనిపించదు. తన ప్రాణాల మీదికి వచ్చినా హీరో అదేమీ పట్టనట్లు తాపీగా హీరోయిన్ వెంట తిరగడంలో లాజిక్ ఏంటో అర్థం కాదు. హీరో వైపు నుంచి ఈ అనారోగ్యం.. హీరోయిన్ వైపు నుంచి మరో వ్యక్తితో పెళ్లి ఫిక్సవడం కాన్ ఫ్లిక్ట్ పాయింట్స్ గా పెట్టుకున్నారు కానీ.. వాటిని చాలా పేలవంగా డీల్ చేయడంతో ఏ దశలోనూ ఉత్కంఠకు అవకాశం లేకపోయింది. హీరో హీరోయిన్ల మధ్య కూడా ప్రేమ సన్నివేశాల్లో ఎక్కడా ఫీల్ లేకపోవడంతో చాలా మొక్కుబడిగా ఈ ప్రేమకథ సాగుతుంది. పతాక సన్నివేశంలో అయినా ఏమైనా సర్ ప్రైజ్ చేస్తారనుకుంటే.. అది కూడా సాదాసీదాగా తయారైంది. మొత్తంగా ఒక ప్రేమకథ పండటానికి అవసరమైన ఏ లక్షణాలూ లేని ‘ఇద్దరి లోకం ఒకటే’ దిల్ రాజు అభిరుచిని ప్రశ్నార్థకం చేస్తుందనడంలో సందేహం లేదు.

నటీనటులు:

సినిమా మొదలైన కొన్ని రోజులకే కాన్ఫిడెన్స్ కోల్పోయాడో ఏమో కానీ.. రాజ్ తరుణ్ అయిష్టంగా ఈ పాత్ర చేసినట్లు అనిపిస్తుంది. అనారోగ్యంతో బాధ పడే పాత్ర కావచ్చు.. అంత మాత్రాన ఇంత నీరసం తెప్పించేలా నటించాల్సిన అవసరం అయితే లేదు. వరుస ఫ్లాపులు కూడా రాజ్ లో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసేశాయని ఈ సినిమా చూస్తున్నపుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక సినిమా మొత్తంలో మంచి పెర్ఫామర్ ఎవరైనా ఉన్నారంటే అది షాలిని పాండేనే. తన పాత్ర ఎంత పేలవంగా అయినా ఉండనీ.. ఆమె మాత్రం చక్కటి హావభావాలతో ఆకట్టుకుంది. షాలిని మంచి నటి అనే విషయం కొన్ని సన్నివేశాల్లో కనిపిస్తుంది. కానీ ఆమె టాలెంటుని దర్శకుడు ఉపయోగించుకోలేకపోయాడు. గత సినిమాలతో పోలిస్తే షాలిని ఇందులో అందంగా కూడా కనిపించింది. నాజర్ తన స్థాయికి తగ్గ పాత్ర చేయలేదిందులో. సిజ్జు - రోహిణి - భరత్.. వీళ్లంతా ఉన్నామంటే ఉన్నారంతే.

సాంకేతిక వర్గం:

పిండి కొద్దీ రొట్టె అన్నట్లుగా ప్రేమకథలకు మంచి సంగీతం అందించే మిక్కీ జే మేయర్.. ఈ సినిమా కోసం గుర్తుంచుకోదగ్గ పాటలేవీ ఇవ్వలేదు. అతను అందించిన మెలోడీలు సోసోగా అనిపిస్తాయి. థియేటర్ నుంచి బయటికి వచ్చాక ఏ పాటా గుర్తుండదు. నేపథ్య సంగీతంలో ప్రత్యేకత చూపించే అవకాశాన్ని ఏ సన్నివేశాలూ ఇవ్వలేదు. సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లున్నాయి. దర్శకుడు జీఆర్ కృష్ణకు టర్కీ సినిమాలో అంతగా ఆకట్టుకున్న పాయింట్ ఏంటో అర్థం కాదు. మన దగ్గర ఇలాంటి కథలు బోలెడొచ్చాయి. కథలోనే ఏ విశేషం లేకపోగా.. కథనం కూడా తేలిపోయింది. ఒక ప్రేమకథను డీల్ చేసే నైపుణ్యం ఈ దర్శకుడికి ఉంది అనిపించే సన్నివేశాలేమీ సినిమాలో కనిపించవు. కథను.. పాత్రల్ని ప్రేక్షకులు రిలేట్ చేసుకునేలా చేయడంలో అతను పూర్తిగా విఫలమయ్యాడు.

చివరగా:  ఇద్దరి లోకం ఒకటే.. లవ్ లెస్ స్టోరీ

రేటింగ్-1/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
× RELATED పెద్ద సాములోరు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు
×