కేసీఆర్ కు జగన్ 10 పైసల దెబ్బ తప్పదా?

రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఇద్దరి చంద్రుళ్లలో.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దే పైచేయిగా ఉండేది. నిర్ణయాలు తీసుకోవటం.. పథకాల్ని అమలు చేయటంలో చంద్రబాబు తేలిపోతూ కనిపించేవారు. దీంతో.. తరచూ ఆయన ఇరుకున పడుతుండేవారు. వ్యూహ లోపం కొట్టొచ్చినట్లు కనిపించేది. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నమైన సీన్ కనిపిస్తోంది.

ఒక స్పష్టమైన అవగాహనతో ప్రభుత్వ రథాన్ని నడుపుతున్న జగన్ నిర్ణయాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని తరచూ ఇరుకున పెట్టేస్తున్నాయి. ఆ మధ్యన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం తెలంగాణ సీఎంకు ఎంత తలనొప్పిగా మారిందో చూస్తున్నదే. ఇటీవల ప్రతి కిలోమీటర్ కు 20 పైసలు చొప్పున ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

గడిచిన కొన్నేళ్లుగా బస్సు ఛార్జీల్ని పెంచకపోవటం.. డీజిల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో లోటు భారాన్ని తగ్గించుకునేందుకు వీలుగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ కసరత్తు చేశారు. తాజాగా బస్సు ఛార్జీల పెంపులో ఆయన తన చతురతను ప్రదర్శించారని చెప్పాలి. సామాన్యులు మరి ముఖ్యంగా గ్రామీణులు ప్రయాణించే పల్లె వెలుగు.. సాధారణ సిటీ బస్సుల్లో కిలోమీటరుకు పది పైసలు చొప్పున ఛార్జీలు పెంచగా.. ఎక్స్ ప్రెస్.. మెట్రో డీలక్స్.. సూపర్ లగ్జరీ.. ఏసీ బస్సుల్లో కిలోమీటర్ కు ఇరవై పైసలు చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

తాజా పెంపుతో ఆర్టీసీకి రోజు రూ.1.5 కోట్ల అదనపు ఆదాయం రానుంది. అయితే.. ఇప్పుడున్న లోటుతో పోలిస్తే వచ్చే ఆదాయం తక్కువనే చెబుతున్నారు. కాకుంటే.. సామాన్యులకు ఛార్జీల పెంపు చురుకు పుట్టకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్న జగన్ నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు. ఏపీలో ఛార్జీలు వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఉంటే.. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నం.

అన్ని బస్సు సర్వీసులకు ఇరవై పైసలు చొప్పున ఛార్జీలు పెంచుతూ తీసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయంతో పోలిస్తే.. ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం పెంచిన చార్జీల పెంపు బాగుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇరువరికి మధ్య పది పైసలే తేడా అయినా.. మైలేజీ విషయంలో మాత్రం భారీగా తేడా రావటం ఖాయమని చెప్పక తప్పదు.
× RELATED Adah sharma gorgeous Pics
×