షాక్.. ఆ లిస్టులో వీహెచ్.. పొన్నాల పేర్లు గల్లంతు?

కనుచూపు మేర ఎన్నికలు లేవు. ఆ మాటకు వస్తే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ పదవి తీసుకున్నా ఇప్పుడు ఒక్కటే. ఒకప్పుడు తిరుగులేని అధికారాన్ని చెలాయించిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు చేష్టలుడిగిపోవటమే కాదు.. జరుగుతున్న పరిణామాలకు ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాక కిందామీదా పడుతున్నారు. పోరాట స్ఫూర్తి తమలో ఎంత తక్కువన్న విషయాన్ని తమ చేతలతో చేసి చూపిస్తున్నారు.

కాగితం పులల మాదిరి పేర్లు చూసినంతనే తోపు లీడర్లుగా కనిపించినా.. ఎన్నికల్లో ప్రజా మద్దతు వీరికెంత ఉందన్న విషయాన్ని ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. అయినప్పటికీ వారిలో మార్పు రాని పరిస్థితి. రాజకీయాల్లో ఆటుపోట్లు సహజం. కానీ.. ప్రజల కోసం.. ప్రజలు ఎదుర్కొనే సమస్యల మీద సీరియస్ గా పని చేసే వారికి.. ప్రజలతో మమేకం అయ్యే వారికి అవకాశాలు తలుపు తడుతూ ఉంటాయి.

ఆ విషయాన్ని కొందరు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు మిస్ అవుతూ ఉంటారు. సాంకేతిక సమస్యో.. నిజంగానే పొరపాటో.. పరిమితుల కారణంగా చోటు చేసుకుందో అన్న విషయాల్ని వదిలేసి.. రచ్చ చేసుకోవటం.. తమ పరువు తామే తీసుకోవటం లాంటివి వీహెచ్ హనుమంతరావు.. పొన్నాల లక్ష్మయ్య లాంటి వారికి తెలిసినంత బాగా మరెవరికీ తెలీదేమో?

తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు పలువురు గవర్నర్ ను రాజ్ భవన్ లో కలిశారు. ఇటీవల కాలంలో మహిళలపై జరుగుతున్న దాడులు.. మద్య నియంత్రణ.. బెల్టుషాపులపై చర్యలు తీసుకోవాలన్న వినతి చేశారు. తాము ఇవ్వాల్సిన వినతిపత్రాన్ని తీసుకొని.. కొందరు కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ కు చేరుకున్నారు. వీరికి వీహెచ్.. పొన్నాల యాడ్ అయ్యారు. అయితే.. గవర్నర్ ను కలిసే కాంగ్రెస్ నేతల జాబితాలో వీరిద్దరి పేర్లు గల్లంతయ్యాయి.

దీంతో.. వీరిద్దరూ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుందన్న ఆవేదన వ్యక్తం చేసి వెనక్కి వెళ్లిపోయారు. ఎంత జరిగినా వీహెచ్.. పొన్నాల లాంటి వారికి విషయాలు ఎందుకు అర్థం కావో తెలీని పరిస్థితి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ రాజకీయ ప్రత్యర్థులపై ఫైర్ కావాల్సింది పోయి.. తమ మధ్య ఉన్న లోటుపాట్ల మీద మీడియాలో మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఒకవేళ.. జాబితాలో పేర్లు లేని వైనం మనసుకు వేదన కలిగించినట్లైయితే.. పార్టీ అంతర్గత వ్యవహారాలతో లెక్క తేల్చుకోవాలే తప్పించి.. ఇలా మైకుల ముందు ఉన్న కాసింత పరువు కూడా తీర్చుకోవాలా? అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి విషయాలు కూడా పొన్నాలకు.. వీహెచ్ లాంటోళ్లకు చెప్పాల్సిన రావటం ఏమిటి చెప్మా?


× RELATED మోడీకి షాక్ ఇచ్చిన బీజేపీ ఎంపీ .. జీఎస్టీ మోడీ పిచ్చి చర్య !
×