వైవీ సుబ్బారెడ్డి డేరింగ్..తిరుమలలో ఆ దమ్మెవడికీ లేదట!

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల కొండపై అన్యమత ప్రచారం నిజంగానే హిందువుల మనోభావాలను దెబ్బ తీసేదే. అంతేనా ఏపీలో పెను చిచ్చు పెట్టేదే. రెండు ప్రధాన మతాల మధ్య గొడవలు పెట్టేదే. రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చే ప్రమాదమున్న అంశమే. మరి ఇంతటి ప్రభావం చూపే విషయంలో ప్రభుత్వాలు అంతగా పట్టించుకోవడం లేదా? అన్న మాట కూడా ఆసక్తి రేకెత్తించేదే. అయితే ఈ తరహా ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలమ మండలి చైర్మన్ హోదాలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి వైవీ సుబ్బారెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటిదాకా టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వారెవరూ వ్యాఖ్యానించని రీతిలో సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అంతేకాకుండా సుబ్బారెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో ఇకపై తిరుమలలో అన్యమత ప్రచారం అన్న మాట దానిపై కొనసాగే దుష్ప్రచారానికి అడ్డుకట్ట పడినట్టేనన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

సరే మరి... తిరుమల కొండపై అన్యమత ప్రచారానికి అడ్డుకట్టే పడేలా వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలేమిటన్న విషయానికి వస్తే... ‘తిరుమలలో ఉన్నది కలియుగ దైవం.. శ్రీ వేంకటేశ్వర స్వామి. ఆయన ముందు అన్యమత ప్రచారం చేసే దమ్ము ధైర్యం ఎవడికీ లేదు’ అంటూ సుబ్బారెడ్డి కాస్తంత ఘాటు కామెంట్లే చేశారు. అంతటితో ఆగని ఆయన తిరుమలలో ప్రస్తుతం ఎలాంటి అన్యమత ప్రచారం జరగడం లేదని దాన్ని ఎవరూ ప్రోత్సహించడమూ లేదని సుబ్బారెడ్డి మరింత క్లారిటీ ఇచ్చారు. తిరుమలలో అన్యమత ప్రచారం అన్నది కేవలం కొందరి దుష్ప్రచారం మాత్రమేనని... జగన్ ప్రభుత్వాన్ని - టీటీడీ పాలక మండలిని అప్రతిష్టపాలు చేయడానికి కొందరు చేస్తున్న ప్రయత్నమేనని కూడా సుబ్బారెడ్డి తనదైన శైలి కామెంట్లు చేశారు.

అయినా తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతుంటే... టీటీడీ పాలకమండలి చూస్తూ ఊరుకుంటుందా? అని కూడా వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. టీటీడీ చైర్మన్ గా ఉన్న తాను గానీ - పాలక మండలి సభ్యులు - అధికారులు... ఇలా ఎవరు కూడా తిరుమలలో అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించరని - అసలా దమ్మూ - ధైర్యం తమలో ఎవరికీ లేదని కూడా సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. కలియుగ దైవంతో చెలగాటమాడే సాహసం తమ బోర్డు సభ్యులెవరు చేయరని ఆయన కాస్తంత డేరింగ్ వ్యాఖ్యలే చేశారు. ఏపీలో జగన్ అధికారం చేపట్టిన తర్వాత తరచూ తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలోనే వైవీ సుబ్బారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఇకపై తిరుమలలో అన్యమత ప్రచారం అన్న మాట వినబడదన్న వాదనలు వినిపిస్తున్నాయి.


× RELATED కరోనా ఎపిసోడ్ లో భారత్ లో తొలిసారి అలాంటి సీన్
×