వైసీపీలోకి పెద్ద 'బీద'.. టీడీపీలోనే చిన్న 'బీద'

ఏపీ రాజకీయాల్లో శనివారం చోటుచేసుకున్న ఓ పరిణామం ఆసక్తి రేకెత్తిస్తోంది. రాజకీయ అరంగేట్రం నుంచి కలిసికట్టుగానే సాగిన ఓ కుటుంబం... శనివారం నాటి పరిణామంతో ఒకే ఫ్యామిలీలో వైరి వర్గాలు ఉండేలా చేసింది. ఈ వైరివర్గాల ఫ్యామిలీ మున్ముందు ఇంకెంత ఆసక్తి రేకెత్తిస్తుందో వేచి చూడాలి. సదరు ఫ్యామిలీ వివరాల్లోకి వెళితే... నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న అన్నాదమ్ముళ్లు బీద మస్తాన్ రావు - బీద రవిచంద్రలు ఇప్పుడు వేర్వేరు పార్టీల నేతలుగా మారిపోయారు. మొన్నటిదాకా టీడీపీలోనే కొనసాగిన బీద మస్తాన్ రావు... నిన్న ఆ పార్టీకి రాజీనామా చేసేసి... శనివారం నాడు వైసీపీలో చేరిపోయారు. అయితే ఆయన సోదరుడు బీద రవిచంద్ర మాత్రం టీడీపీలోనే ఉండిపోయారు. వెరసి బీద ఫ్యామిలీలో ఇప్పుడు అన్న అధికార పక్షం అయితే తమ్ముడు మాత్రం ప్రతిపక్షంలో ఉండిపోయారన్న మాట.

ఏళ్ల తరబడి బీద ఫ్యామిలీ టీడీపీలోనే కొనసాగుతోంది. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాకు సంబంధించి పార్టీ కార్యకలాపాలను భుజాని కెత్తుకున్న బీద ఫ్యామిలీ... ఏనాడూ ఖర్చుకు వెనుకాడింది లేదు. అయితే పార్టీ కోసం ఎంత మేర ఖర్చు పెట్టినా కూడా బీద సోదరులకు పార్టీలో పెద్దగా గుర్తింపు రాలేదనే చెప్పాలి. బీద మస్తాన్ రావుకు ఓ దఫా ఎమ్మెల్సీ పదవి దక్కగా - బీద రవిచంద్రకు ఓ టెర్మ్ ఎమ్మెల్యే గిరీ దక్కింది. అయితే ఎప్పటినుంచో బీద మస్తాన్ రావుకు రాజ్యసభ సభ్యత్వంపై ఆశ ఉండిపోయింది. అందుకనుగుణంగా టీడీపీ అధిష్ఠానం చర్యలు తీసుకోలేదనే చెప్పాలి. పార్టీ కోసం ఎంతగా శ్రమించినా కూడా లాభం లేకపోవడంతో ఇప్పుడు బీద మస్తాన్ రావు పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకోవడంతో పాటుగా వైసీపీ నుంచి కూడా ఆఫర్ రావడంతో ఆ పార్టీలో చేరిపోయారు. శనివారం నాడు వైసీపీ అధినేత - ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో బీద మస్తాన్ రావు వైసీపీలో చేరిపోయారు.

ఈ పరిణామం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలకు దారి తీస్తుందన్న దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి. వైసీపీలోకి చేరిపోయిన బీద మస్తాన్ రావు త్వరలోనే ఆ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యత్వాన్ని దక్కించుకునే అవకాశాలు పుష్కలంగానే కనిపిస్తున్నాయి. అయితే టీడీపీ కోసం ఆది నుంచి కష్టపడి పనిచేస్తున్నామన్న నేపథ్యంలో ఎప్పటికైనా ప్రాధాన్యం దక్కకపోతుందా? అన్న కోణంలో ఆలోచించిన బీద రవిచంద్ర మాత్రం ఇంకా టీడీపీలోనే కొనసాగేందుకు నిర్ణయించుకున్నారు. దరిమిలా ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన అన్నాదమ్ముళ్లు రెండు ప్రధాన పార్టీల్లో.. అది కూడా వైరివర్గాలుగా ఉన్న పార్టీల నేతలుగా మారిపోవడం ఆసక్తి రేకెత్తించేదే.


× RELATED వైసీపీలో భగ్గుమన్న విభేదాలు.. చెప్పులతో దాడి
×