వంశీ పులి - మరి లోకేశ్ ఏంటో?... బాబే చెప్పాలి

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మొన్నటి ఎన్నికల్లో తగిలిన గట్టి దెబ్బ... ఆయనను గుల్ల గుల్ల చేస్తోందనే చెప్పాలి. మొన్నటిదాకా అసలు ఎన్నికల్లో తమ పార్టీ ఎందుకు ఓడిపోయిందో తెలియదంటూ చాలా రోజుల పాటు బహిరంగంగానే వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు... ఇన్ని తక్కువ సీట్లకే పరిమితమయ్యేంత తప్పు తానేం చేశానంటూ కూడా మదనపడిన తీరు నిజంగానే ఆసక్తి రేకెత్తించింది. అయితే అవే మాటలను ఎన్ని రోజులని చెబుతారు? అందుకే కాబోలు... ఆ మాటలను వదిలేసిన చంద్రబాబు... ఇప్పుడు కొత్త మాటలు అందుకుని - వాటితోనూ డంగైపోతున్నారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు.. మంగళవారం చేసిన ఓ కామెంట్ వైరల్ గా మారిపోయింది.

మొన్నటి ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు నిలబడగా... వారిలో కేవలం 23 మంది మాత్రమే విజయం సాధించారు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన చంద్రబాబు... ఎన్నికల్లో విజయం సాధించిన ఆ 23 మందిని పులులుగా అభివర్ణించారు. ఇక్కడే ఓ ప్రశ్న ఆయన ముందుకు చాలా స్పీడుగానే దూసుకువచ్చింది. గెలిచినోళ్లు పులులు అయితే.. మరి ఓడిన వాళ్ల మాటేమిటి? అన్నదే ఆ ప్రశ్న. అంతేకాదండోయ్... ఆ ఓడిన వాళ్లలో తన కుమారుడు - పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా ఉన్నారు కదా. గెలిచినోళ్లు పులులు అయితే... ఓడిన లోకేశ్ ను ఏమంటారు? అంటూ చంద్రబాబును ఆయన రాజకీయ ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు.

అయినా ఈ పులుల గోల చంద్రబాబు నోట నుంచి ఎలా వచ్చిందన్న విషయానికి వస్తే... గన్నవరం నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలిచి నిలిచిన వల్లభనేని వంశీమోహన్ ఇప్పుడు వైసీపీ దరి చేరుతున్నారు కదా. ఈ విషయాన్ని ప్రస్తావించిన చంద్రబాబు... గెలిచిన 23 మంది పులుల నుంచి ఓ పులి వెళ్లిపోయిందని - అయినా పార్టీ నేతలు బెదరాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. పార్టీ కేడర్ లో ధైర్యం నూరిపోసే దాకా అయితే ఓకే గానీ... ఇలా కొత్త కొత్త డౌట్లు క్రియేట్ అయ్యేలా చేసే వ్యాఖ్యలతోనే ఇబ్బంది. ఈ విషయాన్ని చంద్రబాబు ఎప్పుడు గుర్తిస్తారోనన్న దిశగా విశ్లేషణలు అప్పుడే మొదలైపోయాయి.
   

× RELATED కుటుంబ ఆస్తులను ప్రకటించిన నారా లోకేశ్ !
×