బీజేపీకి చంద్రబాబు నాయుడు ఇలా వల వేస్తున్నారా!

చంద్రబాబు నాయుడుకు ఇవన్నీ కొత్త ఏమీ కాదు. తనకు అవసరం అయినప్పుడు స్నేహాలు చేయడం అవసరం  లేదనుకున్నప్పుడు వారిని శత్రువులుగా చూస్తూ ఉంటారు. అయితే చంద్రబాబు నాయుడు తన అవసరార్థం  వేసే అంచనాలు తలకిందుల అవుతూ ఉంటాయి. అందులో ఒకటి ఎన్నికలకు ఏడాది ముందు నుంచి బీజేపీతో శత్రుత్వం నెరపడం.

అంత వరకూ బీజేపీతో సన్నిహితంగా మెలిగిన తెలుగు దేశం అధినేత అధికారాన్ని పంచుకుని ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ పార్టీపై గయ్యిమన్నారు. కాంగ్రెస్ తో చేతులు కలిపారు. మోడీ పని అయి పోయిందనుకునే  రాంగ్ క్యాలుక్లేషన్స్ తో చంద్రబాబు నాయుడు అలా వ్యవహరించారనేది బహిరంగ సత్యం. బీజేపీతో కలిసి ఉన్నంత సేపూ చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టలేదు. అయితే ఒక్కసారి ఎన్నికలు దగ్గరపడగానే చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్నారు. బీజేపీ రాష్ట్రానికి ద్రోహం చేసిందంటూ ప్రచారం మొదలుపెట్టారు.

అయితే అది వికటించింది. చంద్రబాబునాయుడును ఒక అవకాశవాదిగా నిలబెట్టింది. అయితే ఇప్పుడు  కూడా చంద్రబాబు మారలేదు. తిరిగి బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం లో ఉన్నారాయన. అందులో భాగంగా బీజేపీ వాళ్లను ఆకట్టుకోవడానికి ఆయన రకరకాల ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారని స్పష్టం అవుతోంది.

తాజాగా బీజేపీ సీనియర్ నేత అద్వానీ కి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు  శుభాకాంక్షలు తెలిపారు. ఇదంతా చంద్రబాబు మార్కు స్ట్రాటజీ. గత ఏడాది కూడా అద్వానీ పుట్టిన రోజు వచ్చింది. అప్పుడు ఈయన శుభాకాంక్షలు తెలపలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీ వ్యతిరేకిగా కాంగ్రెస్ సన్నిహితుడిగా రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బీజేపీ తో సత్సంబంధాలు కావాలి కాబట్టి.. అద్వానీ పుట్టిన రోజు చంద్రబాబు నాయుడుకు గుర్తుకు వచ్చినట్టుంది. మొత్తానికి తెలుగుదేశం అధినేత తన అవకాశవాద ఎత్తుగడలకు బాగానే పదును పెడుతున్నట్టుగా ఉన్నారు. వీటితో ప్రయోజనం ఉంటుందా? మరింత పలుచన కావడం తప్ప?
× RELATED Chandrababu Naidu Tongue Slip in Public Meeting about English Medium Education || Political Bench