నా దారి రహదారే అంటున్న రజిని ?

రజినీకాంత్ .. ఈ పేరుకి ఒక చరిత్ర ఉంది. అయన చూడని విజయం లేదు .. క్రియేట్ చేయని రికార్డ్స్ అంటూ లేవు. రజినీకాంత్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే అప్పటివరకు ఉన్న రికార్డ్స్ మొత్తం తుడిచి పెట్టుకుపోవాల్సిందే. రజిని సినిమా అంటే హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. 68 ఏళ్ల వయస్సులో కూడా .. ఏమాత్రం జోరు తగ్గించకుండా ..యువ హీరోలకి పోటీగా సినిమాలని రిలీజ్ చేస్తూ తన సత్తా చూపిస్తున్నాడు. ఇకపొతే సినిమా వారు రాజకీయాలలోకి రావడం అనేది ఇప్పుడు చాలా సాధారణమైంది. ముఖ్యంగా తమిళనాడు లో ముఖ్యమంత్రిగా సినిమా వారే ఎక్కువ కాలం పాలన చేసారు.

రజిని కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టాలని గతంలోనే అనుకున్నారు. తమ అభిమానులతో కొన్ని సమావేశాలని కూడా నిర్వహించారు. ఆ తరువాత ఆ విషయాన్ని పక్కన పెట్టారు. కానీ గత కొన్ని రోజులుగా రజిని మెల్లిమెల్లిగా కమలం గూటికి చేరువైవుతున్నాడు అనే వార్తలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో స్పందించిన రజినీకాంత్.. బీజేపీ ట్రాప్‌లో తాను పడనంటూ కుండబద్ధలు కొట్టారు.

రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నూతన కార్యాలయ ప్రాంగణంలో ప్రముఖ దర్శకుడు కే.బాలచందర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో రజినీ పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరై తిరుగు ప్రయాణం అయిన రజినీకాంత్‌ను తిరువళ్లవర్ విగ్రహ వివాదంపై స్పందించాలని మీడియా కోరగా ..ఆ విషయం పై మాట్లాడుతూ పరోక్షంగా బీజేపీకి చురకలు అంటించారు. నాకు కాషాయ రంగు పులమాలని బీజేపీ చూస్తోంది. ఈ విధంగానే తిరువళ్లువర్‌కు కూడా కాషాయరంగు వేయాలని చూస్తున్నారు. నేను బీజేపీ వ్యక్తిని కాదు. నాకు కాషాయ రంగు పులమకండి. తిరువళ్లువర్ లాంటి గొప్ప రచయిత చుట్టూ రాజకీయం చేయకండి. అనవసర వివాదానికి తెరలేపకండి అని చెప్పారు.

తంజావూరులో ప్రముఖ తమిళ రచయిత తిరువళ్లువర్ విగ్రహానికి హిందూ మక్కల్ కట్చి నేత అర్జున్ సంపత్ కాషాయవస్త్రం కట్టి మెడలో రుద్రాక్ష మాలను వేసి పూజలు నిర్వహించిన విషయం అందరికి  తెలిసిందే. ఈ ఘటనపై తమిళనాడు లో పెద్ద వివాదం జరిగింది. ఈ సంఘటన బీజేపీ ప్రోద్బలంతోనే జరిగిందన్న రీతిలో రజినీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అక్కడ రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా రజిని చేసిన కామెంట్స్ తో .రజిని బీజేపీ లో చేరతాడు అని వచ్చిన వార్తలు పుకార్లేనని తెలుస్తోంది.
× RELATED ఘోర రోడ్డు ప్రమాదం .. 20 మంది దుర్మరణం !
×