అమరావతిలో వైసీపీ పంచాయితీ..జగన్ ఇలా వార్నింగ్ ఇచ్చారా..!

ఏపీలో వైసీపీ అధికారం లోకి వచ్చి నాలుగు నెలలు అయిందో లేదో చాలా జిల్లాల్లో ఆ పార్టీ నేతల మధ్య విభేదాలు ఒక్కొక్కటిగా వీథికెక్కుతున్నాయి. పార్టీ కోసం నాలుగైదు సంవత్సరాలుగా కష్టపడిన పాత నేతలు.. ఎన్నికల ముందు పార్టీ లోకి వచ్చిన కొత్త నేతల మధ్య గొడవ ఒకటి అయితే... పార్టీలో సీనియర్లు వర్సెస్ సీనియర్ల మధ్య కూడా అంతర్గత యుద్ధం నడుస్తోంది. జగన్ ఎవరూ ఊహించని విధంగా చాలా మంది సీనియర్లు సైతం పక్కనపెట్టి కేబినెట్ లో పలువురు జూనియర్లకు చోటు ఇవ్వడం కొందరికి రుచించడం లేదు.

అయితే రెండున్నర సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న మంత్రుల్లో 90 శాతం మందిని తప్పించి కొత్త మంత్రులను తీసుకుంటానని చెప్పడంతో చాలామంది ఆశల పల్లకిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆ ఛాన్స్ కోసం ఇప్పటి నుంచే ఎవరికివారు ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ తమకు మంత్రి పదవికి పోటీకి వస్తాడని భావిస్తున్న వారిని రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేల మధ్య జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. చివరకు ఈ జిల్లా వైసీపీ నేతల పంచాయితీ అమరావతికి చేరింది.

వైసీపీ ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్ రెడ్డి - కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మధ్య గ్రూపు తగాదాలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. మరోవైపు ఎంపీడీవో సరళపై శ్రీధర్ రెడ్డి దౌర్జన్యం వ్యవహారంపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో నేతల మధ్య సయోధ్య కుదిరిచ్చే బాధ్యతను వైవీ సుబ్బారెడ్డి - సజ్జలకు జగన్ అప్పగించారు. నెల్లూరు జిల్లా నేతలతో వైవీ సుబ్బారెడ్డి - సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. మంత్రి అనిల్ - ఎంపీలు ఆదాల ప్రభాకర్ రెడ్డి - వేమిరెడ్డి - ఎమ్మెల్యేలు భేటీలో పాల్గొన్నారు.

ఈ భేటీ ముగిసిన అనంతరం బయటకు వచ్చిన జిల్లా పార్టీ అధ్యక్షుడు - సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 15న జరిగే రైతు భరోసా పై ప్రధానంగా చర్చించామని... నెల్లూరు జిల్లాలో రాజకీయ వివాదాలపై ఎలాంటి చర్చ జరగలేదని చెప్పారు. అయితే వాస్తవంగా జగన్ సూచనల మేరకు జరిగిన ఈ పంచాయితీలో వైవి.సుబ్బారెడ్డి... సజ్జల రామకృష్ణారెడ్డి ఈ గొడవ రాజీ చేశారని తెలుస్తోంది.

భవిష్యత్తులో ఈ ఇద్దరు నేతలు సమన్వయంతో వెళ్లాలని... ఇకపై ఎలాంటి విభేదాలు రాకుండా చూసుకుంటూ... పార్టీ పరువు బజారు కీడ్చకుండా ఉండాలని జగన్ వార్నింగ్ ఇచ్చినట్టు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు చెప్పినట్టు సమాచారం. ఇక కాకాణి మాత్రం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ తామిద్దరం బాల్యమిత్రులం అని... తమ మధ్య మూడో వ్యక్తి వచ్చి మధ్యవర్తిత్వం చేయాల్సిన అవసరం లేదని.... శ్రీధర్ రెడ్డి తనకు బావమరిది అని... ఆయనతో వ్యక్తిగతంగా కుటుంబ సంబంధాలు ఉన్నాయని చెప్పడం విశేషం.


× RELATED సీఎం జగన్ అరెస్టు పై ఉండవల్లి షాకింగ్ కామెంట్స్ | Undavalli Controversial Comments On AP CM Jagan
×