బీజేపీతో టీడీపీ - వైసీపీ దొందూదొందే!

భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఈ స్థాయిలో అధికారం సాధించుకుంటుందని ఎవ్వరూ ఊహించలేరు. బీజేపీ దేశ వ్యాప్తంగా ఓడిపోయి - అధికారం కోల్పోతుందని చంద్రబాబు నాయుడు అంచనా వేస్తే - బోటాబోటీతో బీజేపీకే అవకాశం ఉంటుంది - తమ బోటి వాళ్ల సహకారంతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుందని జగన్ అనుకున్నారు.  అయితే ఇద్దరి అంచనాలూ తప్పాయి.

తిరుగులేని బలంతో బీజేపీ కేంద్రంలో అధికారం సాధించుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఎలాంటి సహకారం ఇవ్వకుండా మొహం చాటేస్తూ ఉంది. విభజనకు మద్దతు పలికింది భారతీయ జనతా పార్టీ. అయితే ఏపీ అవస్థలను ఏ మాత్రం పట్టించుకోవడం  లేదు ఆ పార్టీ. తన ఎన్నికల హామీలను కూడా తుంగలో తొక్కింది. ఇలా ఏపీకి నిలువునా మోసం చేసింది. విడ్డూరం ఏమిటంటే..ఏపీలో బలోపేతం కావాలని భారతీయ జనతా పార్టీ వాళ్లు కలలుకంటున్నారు.

ఇక గత ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు పూర్తిగా సాగిలా పడ్డారు. కేంద్రం ఏం పాట పాడితే అదే పాడారు. ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు నాయుడు రకరకాలుగా మాటలు మార్చారు. ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడారు. హోదా కావాలని ఒకసారి - వద్దని ఒకసారి - మళ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ మోసం చేసిందంటూ మరోసారి మాట్లాడారు చంద్రబాబు నాయుడు. అలా రకరకాలుగా మాట్లాడి చంద్రబాబు నాయుడు చిత్తైపోయారు.

జగనేమో మాటలు మార్చడం లేదు కానీ - భారతీయ జనతా పార్టీ పై గట్టిగా పోరాడే అవకాశాలు కనిపించడం లేదు. కేంద్రంలో బీజేపీకి ఏ పార్టీ సహకారమూ అవసరం లేకుండా పోయింది. సొంతంగా పరిపూర్ణమైన మెజారిటీని సంపాదించుకుంది కమలం పార్టీ. ఇక ఎవరితోనూ తమకు అవసరం లేనట్టుగా వ్యవహరిస్తూ ఉంది.

ఈ నేపథ్యంలో తాము ఇచ్చిన హామీలను కూడా వారు  పట్టించుకోవడం మానేశారు. అసలు దక్షిణాది రాష్ట్రాల గురించి పట్టించుకునే అవకాశాలు కూడా కనిపించడం లేదు. గతంలో బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్టుగా వ్యవహరించారు. జగనేమీ ప్రభుత్వంలో భాగస్వామి కాకపోయినా.. అప్పుడే కేంద్రంతో వైరం పెట్టుకుని - రాష్ట్రానికి పూర్తిగా సహకారం ఆగిపోతుందనే భావనతో కామ్ గా కనిపిస్తున్నాడు. అయితే జగన్ టర్మ్ ఇంకా ఆరంభంలో మాత్రమే ఉంది!

 
× RELATED పులివెందుల టీడీపీ ఖాళీ అయినట్టే.. త్వరలోనే సతీశ్ జంప్
×