ఏపీలో కొత్త జరిమానాలు ఇలా..!

కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసిన కొత్త ట్రాఫిక్ జరిమానాలతో దేశం బెంబేలెత్తుతోంది. వేలు - లక్షలు జరిమానాలు కట్టలేక సతమతమవుతూ తిరుగుబాట్లు చేస్తున్నారు. పలు రాష్ట్రాలు ఇప్పటికే కేంద్రం సూచించిన జరిమానాలు తగ్గించగా తాజాగా ఏపీ కూడా జరిమానాలు తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది.

ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కేంద్రం సిఫార్సు చేసిన భారీ జరిమానాలను ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయవద్దని రవాణా అధికారుల కమిటీ నుంచి ప్రభుత్వానికి సిఫార్సులు అందాయి. ఇంత భారీ జరిమానాలను విధించే ముందు ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సివుందని ప్రస్తుతానికి మధ్యస్తంగా జరిమానాలను ఉంచుదామని అధికారులు సిఫార్సు చేశారు. పలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఈ జరిమానాలు అమలు కావడం లేదని గుర్తు చేశారు. ఏపీలో అన్ని కేటగిరీలకూ చెందిన దాదాపు 90 లక్షల వాహనాలు ఉండగా - వాటిని నడుపుతున్న వారిలో 45 శాతం మందికి లైసెన్స్ లు లేవని తాము గతంలో నిర్వహించిన సర్వేలో తేలినట్టు అధికారులు తెలిపారు.

ఏపీలో అమలు చేయాలనుకుంటున్న జరిమానాలు పరిశీలిస్తే... రోడ్డు నిబంధనల అతిక్రమణకు రూ. 250 (కేంద్రం నిర్దేశించినది రూ. 500) - లైసెన్స్ లేకుండా అనధికార వాహనం నడిపితే రూ. 2 వేలు (కేంద్రం నిర్దేశించినది రూ. 5 వేలు) - లైసెన్స్ లేకుండా పట్టుబడితే రూ. 2500 (కేంద్రం నిర్దేశించినది రూ. 5 వేలు) విధిస్తే చాలని అధికారులు సిఫార్సు చేశారు. ఇక అర్హత లేకుండా వాహనం నడిపితే రూ. 4 వేలు (కేంద్రం నిర్దేశించినది రూ. 10 వేలు) - ఓవర్ లోడింగ్ తో వెళితే రూ. 750 (కేంద్రం నిర్దేశించినది రూ. వెయ్యి నుంచి రూ. 2 వేలు) - డ్రంకెన్ డ్రైవ్ రూ. 5 వేలు (కేంద్రం నిర్దేశించినది రూ. 10 వేలు) - పర్మిట్ లేకుంటే రూ. 6500 (కేంద్రం నిర్దేశించినది రూ. 10 వేల వరకూ) - ఇన్స్యూరెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ. 1250 (కేంద్రం నిర్దేశించినది రూ. 2 వేలు) - సీట్ బెల్ట్ లేకుంటే రూ. 500 (కేంద్రం నిర్దేశించినది రూ. 1000) విధించాలని తన నివేదికలో పేర్కొంది.
× RELATED సీఎం జగన్ అరెస్టు పై ఉండవల్లి షాకింగ్ కామెంట్స్ | Undavalli Controversial Comments On AP CM Jagan
×