హవ్వా.. ప్రభుత్వ ఫర్నీచర్ ను కొట్టేసిన కోడెల!

అధికారంలో ఉండ‌గా చేసిన త‌ప్పులు ఇప్పుడు తెర‌మీదికి వ‌చ్చే స‌రికి నాయ‌కులు బెంబేలెత్తిపోతున్నా రు. ముఖ్యంగా రాజ్యాంగ బ‌ద్ధంగా సంక్ర‌మించిన ప‌ద‌విని అడ్డు పెట్టుకుని చేసిన ఆగ‌డాలు ఒక్కొక్క‌టిగా పోలీసులు వెలికి తీస్తుంటే.. త‌ట్టుకోలేక పోతున్నారు గౌర‌వ మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు. ప్ర‌స్తుతం ఆయ‌న కేసుల ఉచ్చులో చిక్కుకుని విల‌విల్లాడుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న కుమారుడు శివ‌రామ కృష్ణ‌, కుమార్తె విజ‌య‌ల‌క్ష్మిల బాగోత‌మే బ‌య‌ట‌ప‌డింది. వీరు త‌మ తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని దోచిన వ్య‌వ‌హారం వెలుగు చూసింది. భూక‌బ్జాలు - వ‌సూళ్లు భారీ ఎత్తున సాగించ‌డంతో అప్ప‌ట్లోనే బాధితులు నోరు తెరిచారు.

అయితే, అప్ప‌ట్లో కోడెల అధికారంలో ఉండ‌డంతో పోలీసులు ప్రేక్ష‌క పాత్ర‌పోషించార‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. కానీ, ఇప్పుడు టీడీపీ తుడిచి పెట్టుకుపోయి - జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డంతో ఆయా కేసులు ఒక్కొక్క‌టిగా వెలుగు చూస్తున్నాయి. బాధితులు స్టేష‌న్ల వ‌ద్ద‌కు క్యూ క‌డుతున్నారు. దీనిపై పెద్ద ఎత్తున కేసులు న‌మోదు కావ‌డం - కోడెల వారి కుమార్తె.. కోర్టును ఆశ్ర‌యించి ముంద‌స్తు బెయిల్ కోర‌డం.. అయితే, కోర్టు ఇవ్వ‌బోమ‌ని చెప్ప‌డం తెలిసిందే. అయితే, ఇప్పుడు సీన్‌ లోకి మ‌రో విష‌యం ఎంట్రీ అయింది. అది ఏకంగా అసెంబ్లీలోని కీల‌క‌మైన ఫ‌ర్నిచ‌ర్ మొత్తం కూడా కోడెల వారి నివాసానికి గుండుగుత్తుగా చేరిపోయింద‌ట‌!

నిజానికి అసెంబ్లీ అంటే ప్ర‌జ‌ల‌కు చెందిన పెద్ద రాజ్యాంగ సంస్థ‌. ఇక్క‌డ ఖ‌ర్చు పెట్టే గుండుసూదితో సహా ప్ర‌తిదీ ప్ర‌జ‌ల సొమ్ముతోనే ప్ర‌భుత్వాలు కొనుగోలు చేసి ఏర్పాట్లు చేసుకుంటాయి. వాటిని కూడా కోడెల ఇలా త‌న నివాసాల‌కు త‌ర‌లించ‌డం అనే విష‌యం వెలుగు చూడ‌డం. దీనిని ఔను ఇది నిజ‌మేన‌ని పోలీసులు కూడా చెప్ప‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. అసెంబ్లీ స్పీకర్ గా కోడెల శివ ప్రసాద్ ఉన్న సమయంలో హైదరాబాద్ లో ఉన్న అసెంబ్లీని అమరావతికి తరలించారు. ఆ సమయంలో అసెంబ్లీకి సంబంధించిన ఫర్నీచర్.. ఏసీలు..ఇతర సామాగ్రిని సైతం అమరావతికి తీసుకొచ్చారు. అయితే, ఆ సమయంలో అక్కడి నుండి బయల్దేరిన ఆ ఫర్నీచర్..ఏపీలు పూర్తి స్థాయిలో అమరావతికి చేరలేదు.

నూతన అసెంబ్లీ నిర్మాణ సమయంలోనూ పూర్తి స్థాయి ఫర్నీచర్.. సీలింగ్ ఏసీలు కావటంతో ఇక్కడ వినియోగించాల్సిన అవసరం లేదని కోడెల సంబంధీకులే వారికి వారే నిర్ణయించారని చెబుతున్నారు. దీంతో.. అక్కడ నుండి తరలించిన కీలక వస్తువులు..రికార్డులు మినహా మిగిలిన ఫర్నీచర్ తో పాటుగా ఏసీలను సైతం సత్తెనపల్లి.. నర్సరావుపేటకు తరలించారని వారి మీద అభియోగం. చాలా రోజులుగా అసెంబ్లీ ప్రాంగణంలో దీని మీద ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే కోడెల స్పీకర్ గా ఉన్న సమ యంలో ఏ ఒక్కరూ దీని గురించి ఓపెన్ గా మాట్లాడటానికి ముందుకు రాలేదు. అయితే, ఇప్పుడు ప్రభుత్వం మారటంతో ఈ వ్యవహారాన్ని పోలీసుల కు చేరవేసారు.

నేరుగా అసెంబ్లీ కార్యదర్శి బాలక్రిష్ణమాచార్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు అటు కుమార్తె - కుమారుడు స‌హా ఇప్ప‌టి వ‌ర‌కు తాను సుద్ద‌పూస నంటూ.. నీతులు వ‌ల్లించిన కోడెల చుట్టూ అతి పెద్ద కేసు న‌మోద‌య్యేందుకు ఎదురు చూస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే, ఇవ‌న్నీ ఇలా జ‌రుగుతుంటే.. తాను మాత్రం ఏమీ ఎరుగ‌న‌ని మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చారు కోడెల‌. అసెంబ్లీ ఫర్నిచర్ వ్యవహరంపై స్పందించారు. ఫర్నిచర్ తరలింపుపై కొన్ని మీడియా సంస్థలు తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని అంటూనే..కొంత ఫర్నిచర్‌ ను తన కార్యాలయంలో వినియోగించుకున్నానన్నారు. గతంలో అనేకసార్లు అసెంబ్లీ అధికారులకు లిఖిత పూర్వకంగా లేఖలు రాశానని పేర్కొన్నారు.(ఎవ‌రైనా న‌వ్వి పోతార‌ని కూడా అనుకోకుండా వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.)

ఆయ‌నే అసెంబ్లీకి అన్నీ అయిన‌ప్పుడు.. ఎవ‌రికో చెబితే.. వారు చేయ‌లేద‌ట‌. మ‌రి వారిపై చ‌ర్య‌లు తీసుకుని - తానే స్వ‌యంగా వాటిని త‌ర‌లించే ఏర్పాట్లు చేసుకునే వెసులుబాటు ఉంది క‌దా? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెబితే బాగుండేది. ఫర్నిచర్‌ను తీసుకువెళ్లాలని అసెంబ్లీ అధికారుల‌ను కోరానని... కానీ స్పందించలేదన్నారు. ఇప్పటికైనా అసెంబ్లీ అధికారులు వస్తే ఫర్నిచర్‌ ను అప్పగిస్తానన్నారు. మొత్తానికి దొరికిన త‌ర్వాత‌.. క‌ర‌డు క‌ట్టిన దొంగ కూడా తానే పాపం ఎరుగ‌న‌ని ఇలానే అంటారు. మ‌రి వారిని వ‌దిలేస్తారా? పోలీసులు ఏం చేస్తారో చూడాలి.

 

× RELATED కోడెల తనయుడిపై కేసు నమోదు!