పూరీ తమ్ముడు చేసిన పనికి హేట్సాఫ్ చెప్పాల్సిందే..!!

ప్రజాప్రతినిధులు అంటే అధికారం చెలాయించే వాళ్లే కాదు ప్రజాసేవ చేసేవాళ్లని ఓ ఎమ్మెల్యే నిరూపించాడు.  ఓ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల నిండు గర్భిణీలు ప్రాణాపాయ స్థితిలో ఉంటే వారికి అండగా నిలిచారు. ఆయన కేరింగ్ తీసుకోవడం వల్ల ఆ ఆడపడుచులు ఇబ్బందులు లేకుండా ప్రసవించి పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు. ఇక ఎమ్మెల్యే చేసిన పనికి బాధిత కుటుంబాలు హేట్సాఫ్ చెబుతున్నాయి.

అలా ప్రజలు మెచ్చే పని చేసిన నేత ఎవరో కాదు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తమ్ముడు నర్సిపట్నం వైసీపీ ఎమ్మెల్యే ఉమా శంకర గణేశ్. అసలు ఏమైందంటే విశాఖ జిల్లాలోని నర్సీపట్నం - కోటవురట్ల - వేములపూడి - రోలుగుంట తదితర ప్రాంతాల నుంచి ఆరుగురు గర్భిణులు నెలలు నిండడంతో నాలుగు రోజుల క్రితమే ప్రాంతీయ ఆస్పత్రిలో చేరారు. అయితే వారికి సుఖ ప్రసవం అయ్యే అవకాశం లేకపోవడంతో సర్జరీ ద్వారా ప్రసవం చేయాల్సి వచ్చింది.

అందుకు తగిన విధంగా డాక్టర్ గౌతమి నాయుడు సోమవారం ఉదయం శస్త్రచికిత్సలు చేసేందుకు సిద్ధమయ్యారు. అటు మత్తు డాక్టర్ సుధాకర్ డ్యూటీలో ఉండడంతో ఆపరేషన్ థియేటర్ లో అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఆపరేషన్ థియేటర్ లో ఏమైందో తెలియదు గాని - ఒక్క సారిగా మత్తు డాక్టర్ థియేటర్ లోంచి బయటకు వచ్చేశారు. తనకు ఆరోగ్యం బాగోలేదని సూపరింటెండెంట్ తో చెప్పి సెలవు పెట్టి వెళ్లిపోయారు.

దీంతో గర్భిణులకు సకాలంలో శస్త్ర చికిత్సలు జరగకపోవడంతో నానా ఇబ్బందులు పడ్డారు. అటు వారి బంధువులంతా ఆందోళన చెందారు. ఇక ఈ సమయంలో ఆసుపత్రి సిబ్బంది విశాఖపట్నం కేజీహెచ్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ గర్భిణుల బంధులు ఇలాంటి సమయంలో  వెళ్లిపొమ్మంటే ఎక్కడికి వెళతామని వైద్యులను నిలదీశారు. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో జరిగిన విషయాన్ని కొందరు వైసీపీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే గణేష్ కి సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే గణేశ్ అక్కడికి వచ్చారు. పై వైద్య అధికారులతో మాట్లాడి తక్షణమే మత్తు డాక్టర్ ని ఏర్పాటు చేయాలని కోరారు. అన్నీ సౌకర్యాలు ఉన్న డాక్టర్లు పనితీరు బాగోకపోవడంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ పై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు.

ఆ తర్వాత వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ళ నానితో ఫోన్ లో మాట్లాడారు. ఆస్పత్రిలో జరిగిన ఘటనను వివరించారు. దీంతో అనకాపల్లి ఆస్పత్రి నుంచి గైనకాలజిస్ట్ - మత్తు డాక్టర్ వచ్చి ఆపరేషన్లు పూర్తి చేశారు. హాస్పిటల్లోనే ఉండి సకాలంలో ఆపరేషన్లు పూర్తయ్యేలా చేసిన ఎమ్మెల్యేని గర్భిణుల బంధువులు మెచ్చుకున్నారు. మొత్తానికి ఎమ్మెల్యే గణేశ్ చేసిన పనిని ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు.


× RELATED విజయ్ కి కావాల్సింది పూరి ఇస్తాడేమో