కశ్మీర్ పై మోదీ వైఖరి కరెక్టే..సుప్రీం సర్టిఫికెట్ ఇచ్చేసినట్టే!

జమ్మూ కశ్మీర్ కు ఏళ్లుగా కొనసాగుతున్న స్వయం ప్రతిపత్తిని తొలగించడమే కాకుండా ఏకంగా ఆ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తూ నరేంద్ర మోదీ సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయంపై పెద్దగా వ్యతిరేకత వ్యక్తమైన పరిస్థితి కనిపించలేదు. అయితే కశ్మీర్ బిల్లుకు ఆమోదం లభించిన తర్వాత ఆ రాష్ట్రంలో కల్లోల పరిస్థితులు తలెత్తే అవకాశాన్ని ఇవ్వకుండా అక్కడ కర్ఫ్యూ - నిషేధాజ్ఞలను సవాల్ చేస్తూ ఓ వ్యక్తి సర్వోన్నత న్యాయస్థానం గడప తొక్కి.. మోదీ సర్కారుకు దెబ్బ తప్పదా? అన్న భావన కలిగించారు. అయితే కశ్మీర్ విషయంలో మోదీ సర్కారు అవలంభిస్తున్న వైఖరిని తప్పుబట్టలేమని ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలతో కశ్మీర్ విషయంలో మోదీ సర్కారు తీసుకున్న చర్యలు కరెక్టేనని సుప్రీంకోర్టే తేల్చేసిందన్న కోణంలో ఇప్పుడు ఆసక్తికర విశ్లేషణలు మొదలయ్యాయి.

కశ్మీర్ విషయంలో మోదీ సర్కారు అనుసరిస్తున్న వైఖరి దానిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దానిపై సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే... ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకశ్మీర్లో ప్రజల రాకపోకలు కమ్యూనికేషన్స్పై ప్రభుత్వం విధించిన ఆంక్షలు నిషేధాజ్ఞలను సవాల్ చేస్తూ తహసీన్ పూనావాల సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. కశ్మీర్ లో కర్ఫ్యూ నిషేధాజ్ఞలు విధించారని ఫోన్ ఇంటర్నెట్ సేవలు న్యూస్ చానెళ్ల ప్రసారాలను నిలిపివేశారని తనదైన శైలి ఆందోళన వ్యక్తం చేసిన తహసీన్ తక్షణమే వాటిని తొలగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్ పై ఇటు పిటిషనర్ వాదనలతో పాటు ప్రభుత్వం వాదనలను కూడా ధర్మాసనం మంగళవారం విన్నది. ఆ తర్వాత ధర్మాసనం స్పందిస్తూ ఇది తీవ్రమైన అంశమని కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించడం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత అని పేర్కొంది.

కశ్మీర్ లో  ప్రభుత్వ యంత్రాంగం విధించిన ఆంక్షల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ విషయంలో ఇప్పుడే జోక్యం చేసుకోవడం తొందరపాటే అవుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. అంతేకాకుండా కశ్మీర్ విషయంలో రోజువారీ అడ్మినిస్ట్రేటర్ పాత్రను పోషించడానికి తాను వ్యతిరేకమంటూ.. ఈ కేసులో తదుపరి వాదనలను రెండు వారాలకు వాయిదా వేసింది. అంతేకాకుండా ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి ముందు కొంతకాలం పాటు వేచి చూడాలని భావిస్తున్నట్టు తెలిపింది. కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించడానికి ప్రభుత్వానికి కొంత సహేతుకమైన సమయం ఇవ్వాల్సిన అవసరముందని పరిస్థితుల్లో మార్పు రాకపోతే అప్పుడు తాము నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. మొత్తంగా పునావాల పిటిషన్ తోసిపుచ్చినంత పనిచేసిన సుప్రీంకోర్టు... కశ్మీర్ విషయంలో మోదీ సర్కారుకు బూస్ట్ ఇచ్చినట్టేనన్న వాదన వినిపిస్తోంది.

× RELATED మోడీ సర్కారుకు.. స్వదేశీ వద్దు - విదేశీ ముద్దు!