కోమటిరెడ్డి... రెంటికీ చెడ్డ రేవడి

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... సంచలన ప్రకటనలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సోదరుడిగానే తెలుసు. అయితే అన్నను మించిన సంచనాలకు కేంద్ర బిందువుగా మారే క్రమంలో రాజగోపాల్ రెడ్డి తనను తాను ఒంటరి చేసుకున్న నేతగా ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కి అత్యంత సన్నిహితులుగా ముద్రపడ్డ కోమటిరెడ్డి బ్రదర్స్... వైఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగారు. వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా కొనసాగితే... తమ్ముడు రాజగోపాల్ రెడ్డి నేరుగా లోక్ సభలోనే అడుగుపెట్టారు. ఆ తర్వాత తమదైన శైలి దూకుడును ప్రదర్శించిన కోమటిరెడ్డి బ్రదర్స్... రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ప్రత్యేకించి నల్లగొండ జిల్లాలో తిరుగు లేని నేతలుగానే ఎదిగారు. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటరెడ్డి ఓటమిపాలు కాగా... రాజగోపాల్ రెడ్డి మాత్రం విజయం సాధించారు.

సరే... ఆ తర్వాత వెంకటరెడ్డి ఎంపీగా విజయం సాధించినా... పెద్దగా వార్తల్లోకి ఎక్కడం లేదు. అందుకు భిన్నంగా వ్యవహరించిన రాజగోపాల్ రెడ్డి... తనకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిచేందుకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపైనే తిరుగుబావుటా ఎగురవేశారు. టీ పీసీపీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని నేరుగానే టార్గెట్ చేసిన రాజగోపాల్... పీసీసీ చీఫ్ పదవి నుంచి ఉత్తమ్ ను దించేయాల్సిందేనని డిమాండ్ చేసి... ఆ డిమాండ్ కు కాంగ్రెస్ హైకమాండ్ ససేమిరా అనడంతో తానే పార్టీ మారతానంటూ పెను కలకలమే రేపారు. తాను బీజేపీలో చేరతానని తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే... తానే సీఎంనని కూడా ఆయన సంచలన ప్రకటనలు గుప్పించారు. అంతేకాదండోయ్... ఏకంగా ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కూడా కలిసి వచ్చారు. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో తెలంగాణలో నిత్యం వార్తల్లో ఉండే వ్యక్తిగా రాజగోపాల్ రెడ్డి మారిపోయారు.

అయితే... ఏమైందో తెలియదు గానీ... గడచిన వారం పది రోజుల నుంచి అసలు రాజగోపాల్ రెడ్డి పేరే వినిపించడం లేదు. ఇటు ప్రింట్ మీడియాతో పాటు అటు ఎలక్ట్రానిక్ మీడియాలోనూ రాజగోపాల్ రెడ్డి కనిపించడం లేదు. ఏం జరిగిందా? అని ఆరా తీస్తే... తనను గెలిపించిన కాంగ్రెస్ ను వదిలేసి వస్తానన్న రాజగోపాల్ రెడ్డికి బీజేపీ అదిష్ఠానం నుంచి భారీ షాకే తగిలిందట. బీజేపీలోకి ఎంట్రీకి ఆ పార్టీ అధిష్ఠానం రాజగోపాల్ రెడ్డికి నో ఎంట్రీ బోర్డు పెట్టేసిందట. అయినా తనకు తానుగా వచ్చి చేరుతున్న నేతల తరతమ స్థాయిలను ఏమాత్రం చూడకుండా కండువాలు కప్పేస్తున్న బీజేపీ... రాజగోపాల్ రెడ్డికి ఎందుకు నో చెప్పిందన్నదే ఇప్పుడు అసలు సిసలు టాపిక్ గా మారిపోయింది. ఈ దిశగా కాస్తంత లోతుగానే ఆరా తీస్తే... తెలంగాణ బీజేపీకి చెందిన సీనియర్ నేతలు కె.లక్ష్మణ్ కిషన్ రెడ్డిల కారణంగానే రాజగోపాల్ రెడ్డికి నో ఎంట్రీ కార్డు దర్శనమిచ్చిందని తేలింది.

పార్టీలోకి చేరకముందే... తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే... తానే సీఎంను అంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డితో పాటు లక్ష్మణ్ కూడా తీవ్ర ఆగ్రహం మీద ఉన్నారట. ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తమను కాదని కూడా రాజగోపాల్ రెడ్డి ఇలాంటి ప్రకటనలు చేస్తారా? అన్న దిశగా ఆలోచించిన కిషన్ లక్ష్మణ్ లు పార్టీ అధిష్ఠానం వద్ద రాజగోపాల్ రెడ్డిపై తమ వాదనలు వినిపించారట. ఇటీవలే కేంద్ర మంత్రివర్గంలోకి అడుగుపెట్టిన కిషన్ రెడ్డి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ లే స్వయంగా రాజగోపాల్ రెడ్డి విషయంపై పెదవి విరవడంతో పార్టీ అధిష్ఠానం కూడా వారి మాటకే విలువ ఇస్తూ... రాజగోపాల్ రెడ్డి ఎంట్రీకి నో చెప్పేసిందట. ఈ క్రమంలో అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటి... అన్న కోణాన పునరాలోచనలో పడిపోయిన రాజగోపాల్ రెడ్డి మీడియా కంటబడేందుకే వెనుకాడుతున్నారట. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే... కోమటిరెడ్డి తనను తాను ఒంటరి చేసుకున్నారని మాత్రం చెప్పక తప్పదు.
    
    
    

× RELATED సమ్మె అప్ డేట్...దొర - రెడ్డి ఇద్దరూ తగ్గేలా లేరు!