విజయశాంతి బాధేంటో ... మరి !

మన శత్రువును మనం కొట్టలేకపోతున్నాం. ఇంకెవ్వడో వచ్చి చితక్కొడుతుంటే ... బాగా అయ్యింది వీడికి అనుకుంటాం. ఇది ఒక నిస్సహాయ స్థితి. తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి కూడా ప్రస్తుతం అలాగే ఉంది. కాకపోతే శత్రువును కొట్టినవాడే వీరి అసలు శత్రవు. అదే ట్విస్టు ఇక్కడ. కాంగ్రెస్ మహిళా నేత స్టార్ క్యాంపెయిన్ విజయశాంతి బీజేపీ - కేసీఆర్ వార్ పై చేసిన వ్యాఖ్యలు  వైరల్ అయ్యాయి.

ఇంతకీ ఏం జరిగిందటే... ’’ఐదేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజాధనం దుర్వినియోగం అయిందని అక్రమాలు పెరిగాయి. నిరంకుశంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ సర్కారుపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టింది ఇది శుభపరిణామం‘‘ అని అంటూ విజయశాంతి వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆమె ఒక  ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఆ ప్రెస్ నోట్ అంతా గమనిస్తే.. ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. కేసీఆర్ పదఘట్టనల కింద నలిగిపోతున్న కాంగ్రెస్ పార్టీ నానాటికి తెలంగాణలో చిక్కిశల్యమవుతోంది. భవిష్యత్తులో ఏపీలాగే తెలంగాణలో కాంగ్రెస్ ఉండదేమో అన్న స్థాయిలో కాంగ్రెస్ ను సమూలంగా తుడిచిపెడుతున్నారు కేసీఆర్. చివరకు కాంగ్రెస్ నేతలే పార్టీ మారకుండా... బీజేపీతోనే కేసీఆర్ అణచడం సాధ్యమవుతుంది అని వ్యాఖ్యానించడం చూశాం. ఈ నేపథ్యంలో తమను నాశనం చేస్తున్న కేసీఆర్ పై బీజేపీ ప్రభుత్వం పట్టుబిగించడాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ తెగ సంతోష పడుతోంది. మోడీ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ గొంతు నులిమేసిన విషయాన్ని మరిచిపోయి... కేంద్రం కేసీఆర్ పై చర్యలను పీసీసీ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ హోదాలో విజయశాంతి ప్రస్తుతించడం ఒక రాజకీయ వైచిత్రి. తమ చిన్న శత్రువను తమ పెద్ద శత్రువు కొడుతుంటే కాంగ్రెస్ మురిసిపోతోంది. అంతేగాని చాపకింద నీరులా తమ స్థానాన్ని బీజేపీ ఆక్రమిస్తున్న విషయాన్ని వారు గమనించడం లేదు.
ఇంతకీ ఆమె తన ప్రెస్ నోట్లో ఏం చెప్పిందంటే...

’’కేసీఆర్ సర్కార్ పై కేంద్ర సర్కార్ దృష్టి పెట్టింది. ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చేసేందుకు నిఘా పెట్టింది. ప్రతిపక్షాలు ఆధారాలతో సహా కేసీఆర్ సర్కార్ చేసిన అవినీతి భాగోతాలు బయటపెట్టినా కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించి విపక్షాల గొంతు నొక్కింది. అవినీతి ఆరోపణలు చేస్తే పరువు నష్టం కేసులు పెడతామని కేసీఆర్ ప్రభుత్వం బెదిరించింది. ఈ అరాచకాలను కేంద్రం గమనించి కేసీఆర్ పాలనపై నిఘా పెట్టింది. కేసీఆర్ ప్రభుత్వంలోని అవకతవకలపై కేంద్రం సమాచారం సేకరించినట్టు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రప్రజలు  మంచి పరిణామంగా భావిస్తున్నారు. ఏం చేసినా అడిగే నాథుడు లేడన్న బరితెగింపు ఇక చెల్లకపోవచ్చు. కేసీఆర్ ను కట్టడి చేసే రోజు కోసం ప్రజానీకం ఎదురుచూస్తోంది. అది త్వరలోనే వస్తుంది‘‘ అని ఆమె పేర్కొంది. ఏదో బీజేపీ నేతలు రాజకీయం కోసం వదిలిన ఫీలర్ ఆధారంగా విజయశాంతి స్థాయి నేత ఇలా ప్రెస్ నోట్ విడుదల  చేయడం విస్మయమే. అయితే చివర్లో చివర్లో ఒక వ్యాఖ్య చేసి బీజేపీ పై ప్రశంశలను కేసీఆర్ పై అక్కసును ఆమె కవర్ చేసుకున్నారు. కేవలం నిఘాతో సరిపెట్టకుండా టీఆర్ఎస్ పాలనలో అవకతవకలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. పాపం ... కాంగ్రెస్ పరిస్థితి జాతీయ స్థాయిలోనే కాదు ప్రాంతీయ స్థాయిలోనూ దారుణంగా ఉందన్నమాట.
    
    
    

× RELATED Khaidi Movie Success Meet