హాట్ డీబేట్.... జగన్ తో వల్లభనేని వంశీ భేటీ!

ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత రాజకీయం చాలా చప్పగా సాగుతున్నట్లుగా కనిపిస్తున్నా... అప్పుడప్పుడు ఆ చప్పడి రాజకీయాలు అప్పటికప్పుడే హాట్ హాట్ గా మారుతున్నాయి. పాలిటిక్స్ ను అప్పటికప్పుడు హీట్ ఎక్కిస్తున్న ఆయా విషయాలు ఆ వెంటనే చప్పున చల్లారిపోయేలా చేస్తున్నాయి. ఇలాంటి ఘటనే ఇప్పుడు మరొకటి చోటుచేసుకుంది. టీడీపీ తరఫున కృష్ణా జిల్లా గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ మోహన్... కరడుగట్టిన టీడీపీ వాది కిందే లెక్క. అయితే తన రాజకీయాన్ని పక్కన పెట్టేసిన వంశీ... గురువారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కాస్తంత వీలు చూసుకుని వైసీపీ అధినేత - ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు.

ఎన్నికల సందర్భంగా వైసీపీ అభ్యర్థిపై తనదైన శైలి వ్యాఖ్యలు చేసిన వంశీ... సన్మానం చేస్తానంటూ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే వంశీ భావించినట్టుగా టీడీపీ అధికారంలోకి రాకపోగా... తాను మాత్రం ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో సన్మానం మాటను పక్కనపెట్టేసిన వంశీ... తన నియోజకవర్గ ప్రజల సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇప్పటికే ఈ దిశగా ఓ కీలక అడుగు వేసిన వంశీ... పోలవరం కుడి కాల్వ నుంచి రైతులకు నీరందించే విషయంపై జగన్ కు ఓ లేఖ రాశారు. ఆ లేఖకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చిందన్న విషయం తేలకుండానే... వంశీ నేరుగా జగన్ తోనే భేటీ అయ్యి మరోమారు సంచలనం రేకెత్తించారు. ఈ సందర్భంగానూ తన నియోజకవర్గ ప్రజలకు తాగు - సాగు నీటిపై ఆయన జగన్ తో చర్చించారు.

పోలవరం కుడి కాల్వ ద్వారా తన నియోజకవర్గ రైతులకు సాగు నీరందించేందుకు ఏర్పాటు చేసిన 500 మోటార్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని జగన్ ను అభ్యర్థించిన వంశీ... ఆ దిశగా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే... తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన సదరు 500 మోటార్లను ప్రభుత్వానికి అప్పగించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు జగన్ కు చెప్పారట. తన నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం వచ్చిన వంశీ చెప్పిన వాదనను సాంతంగానే విన్న జగన్... వంశీ అభ్యర్థనకు సానుకూలంగానే స్పందించారట. అంటే... వంశీ ఏర్పాటు చేసిన 500 మోటార్లకు జగన్ ఉచిత కరెంట్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న మాట. ఏదేమైనా... నియోజకవర్గ సమస్యల కోసం వంశీ పార్టీలను పక్కనపెట్టేసి నేరుగా జగన్ వద్దకు వెళ్లి మాట్లాడటం మాత్రం ఆహ్వానించదగ్గ పరిణామమేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
× RELATED వల్లభనేని వంశీ.. జగన్ తో పాతికేళ్ల పరిచయమట!