విజయసాయిరెడ్డికి మళ్లీ సేమ్ పోస్ట్... కాకపోతే !

ఏపీలో అత్యంత ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామం.. ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్‌ లో రాష్ట్ర‌ ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధిగా విజ‌య‌సాయిరెడ్డి నియాక‌మం.. ఆ త‌ర్వాత ర‌ద్దు.. మ‌ళ్లీ ప్ర‌త్యేక ప్ర‌తినిధిగా నియామ‌కం.. ఇలా అత్యంత వేగంగా ఈ ప‌రిణామం ఎందుకు జ‌రిగింది..? ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి.. ఏకంగా చ‌ట్ట‌స‌వ‌ర‌ణ‌కు ఎందుకు పూనుకున్నారు..? అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. అయితే.. ఈ ప్ర‌శ్న‌ల‌కు బ‌ల‌మైన‌ స‌మాధానాలే వినిపిస్తున్నాయి. జ‌గ‌న్‌ - విజ‌య‌సాయిరెడ్డి.. వీరిద్ద‌రి మ‌ధ్య అనుబంధం అంద‌రికీ తెలిసిందే. జ‌గ‌న్ అనేక క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు వెన్నుద‌న్నుగా నిలిచిన నాయ‌కుడు - ఆప్తుడు - అన్నింటికీ మించి న‌మ్మ‌క‌స్తుడు విజ‌య‌సాయిరెడ్డి.

ఐదేళ్ల పాటు జ‌గ‌న్ ఎన్నోక‌ష్ట‌న‌ష్టాలు ఎదుర్కొన్నారు. వీట‌న్నింటిలోనూ విజ‌య‌సాయి రెడ్డి జ‌గ‌న్‌ కు అండ‌గా నిలిచారు. ఇక ఈ ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీకి కౌంట‌ర్లు ఇవ్వ‌డంలో కాని.. అభ్య‌ర్థుల ఎంపిక‌... పార్టీ ఆర్థిక వ్య‌వ‌హారాల్లో విజ‌యసాయి రెడ్డి కీల‌కంగా ఉండి జ‌గన్‌ కు చాలా త‌ల‌నొప్పి త‌గ్గించారు. ఈ నేప‌థ్యంలోనే రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కొన‌సాగుతున్న విజ‌య‌సాయిరెడ్డి ని జ‌గ‌న్ ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్‌ లో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధిగా నియ‌మించారు. కానీ.. అయితే రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ మరో లాభదాయక పదవి (ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాఫిట్‌) చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని తేలడంతో విజయసాయిరెడ్డి నియామక ఉత్తర్వులను ఈనెల 4న ర‌ద్దు చేశారు.

అయితే.. విజ‌య‌సాయిరెడ్డి స్థానంలో కొత్త‌వారిని నియ‌మిస్తార‌ని వైసీపీ వ‌ర్గాల‌తోపాటు ఇత‌ర పార్టీల నేత‌లూ అనుకున్నారు. కానీ.. జ‌గ‌న్ అనూహ్యంగా మ‌ళ్లీ విజ‌య‌సాయిరెడ్డి నే నిమ‌మించారు. ఇందుకోసం.. ఏకంగా చ‌ట్ట‌స‌వ‌ర‌ణ‌లు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు. ఈ మేర‌కు.. ఎటువంటి జీత భత్యాలు - కేబినెట్‌ తదితర హోదా లేకుండా ఢిల్లీలోని ఏపీ భవన్‌ లో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విజ‌య‌సాయిరెడ్డి ని నియ‌మించేందుకు వీలుగా ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాఫిట్‌ నిబంధనల్లో సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది.

ఈ మేర‌కు ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ అయ్యో అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇక్క‌డ‌ - ప్ర‌ధానంగా జ‌గ‌న్ నిర్ణ‌యంపై పార్టీ వ‌ర్గాల‌తో ప్ర‌జ‌ల నుంచి కూడా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. న‌మ్మిన నేత కోసం.. జ‌గ‌న్ ఎంత‌వ‌ర‌కైనా వెళ్తార‌నడానికి ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. ఢిల్లీలో పార్టీ కార్య‌క‌లాపాల‌ను చ‌క్క‌దిద్ద‌గ‌ల‌ - రాష్ట్ర ప్ర‌భుత్వం - ఏపీకి కావాల్సిన ప‌నుల‌ను చేయించ‌గ‌ల సామ‌ర్థ్యం - నిబ‌ద్ధ‌త విజ‌య‌సాయిరెడ్డిలో ఉన్నందునే జ‌గ‌న్ ఇలా సాహ‌సిక నిర్ణ‌యం తీసుకున్నార‌ని చెబుతున్నారు.

× RELATED క‌ర‌క‌ట్ట భ‌వనాన్ని కూల్చొద్దు.. హైకోర్టు ఆదేశం
×