'కల్కి'

చిత్రం: 'కల్కి'

నటీనటులు: రాజశేఖర్ - ఆదాశర్మ - నందిత శ్వేత - రాహుల్ రామకృష్ణ - అశుతోష్ రాణా - శత్రు - సిద్ధు జొన్నలగడ్డ - పూజిత పొన్నాడ - నాజర్ తదితరులు
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర
కథ: సాయితేజ
స్క్రీన్ ప్లే: స్క్రిప్ట్స్ విలీ
నిర్మాత: సి.కళ్యాణ్
దర్శకత్వం: ప్రశాంత్ వర్మ

‘పీఎస్వీ గరుడవేగ’తో మళ్లీ ఫామ్ అందుకున్న సీనియర్ హీరో రాజశేఖర్.. దీని తర్వాత చేసిన ‘కల్కి’ ఆసక్తికర ప్రోమోలతో జనాల దృష్టిని బాగానే ఆకర్షించింది. ‘అ!’ దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఈ రోజే మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం అంచనాల్ని ఏమేరకు అందుకుందో చూద్దాం పదండి.

కథ:

తెలంగాణ ప్రాంతంలోని కొల్లాపూర్ అనే ఊరిలో 80వ దశకంలో శేఖర్ బాబు (సిద్ధు జొన్నలగడ్డ) అనే వ్యక్తి హత్యకు గురవుతాడు. అతను దశాబ్దాలుగా అరాచకాలు సాగిస్తూ ఆ ప్రాంతాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న ఎమ్మెల్యే తమ్ముడు. శేఖర్‌ హత్యతో రగిలిపోతూ ఎమ్మెల్యే ఊరిలో కల్లోలం సృష్టిస్తున్న దశలో ఐపీఎస్ అధికారి అయిన కల్కి (రాజశేఖర్) అక్కడికి వస్తాడు. శేఖర్ బాబు హత్యను విచారించడానికి కల్కిని ప్రభుత్వం ఆ ఊరికి పంపిస్తుంది. మరి కల్కి ఈ కేసును ఎలా పరిష్కరించాడన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు సినిమాలు చేయలేక మధ్యలో పూర్తిగా మార్కెట్ కోల్పోయి జీరో అయిపోయిన హీరో రాజశేఖర్. ఐతే యువ దర్శకుడు ప్రవీణ్ సత్తారు.. వైవిధ్యమైన - ఈ తరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కథతో రాజశేఖర్ హీరోగా ‘పీఎస్వీ గరుడవేగ’ తీశాడు. ఇప్పటి ప్రేక్షకులతో ఆయన్ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ చిత్రంలో రాజశేఖర్‌ లో మునుపటి ఎనర్జీ కనిపించకపోయినా.. ఆయన చాలా నీరసంగా కనిపించినా.. కథాకథనాల్లో ఆసక్తి వల్ల ఆ లోపాలు కొట్టుకుపోయాయి. పైగా గత సినిమాల్లో మాదిరి బిల్డప్పులు - అతి ఏమీ లేకుండా సింపుల్‌ గా సటిల్‌ గా యాక్ట్ చేసి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు రాజశేఖర్. కానీ ‘గరుడవేగ’ సినిమాతో రాజశేఖర్‌ లో వచ్చిన ఆత్మవిశ్వాసం కాస్తా ‘కల్కి’ సమయానికి అతి విశ్వాసంగా మారినట్లుంది. ఇందులో కథాకథనాలెలా ఉన్నాయన్నది తర్వాత మాట్లాడుకుందాం. ముందు రాజశేఖర్ ఎలా కనిపించాడన్నదే చూద్దాం.

‘కల్కి’లో హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సన్నివేశాల్లో కళ్లు మూసుకుని బ్యాగ్రౌండ్ స్కోర్ వింటే.. మనం ‘బాహుబలి’ లాంటి పీక్ హీరోయిజం ఉన్న సినిమాలో ప్రభాస్‌ ను చూస్తున్నామా అని సందేహం కలుగుతుంది. కానీ కళ్లు తెరిచి చూస్తే నీరసంగా కదల్లేక కదులుతున్న రాజశేఖర్ కనిపిస్తాడు. ‘కల్కి’లో రాజశేఖర్ ఒక పేషెంట్ లాగా కనిపించాడు అంటే ఆయన అభిమానులు అఫెండ్ కావాల్సిందేమీ లేదు. పోలీస్ ఆఫీసర్ పాత్రకు ఏమాత్రం సూట్ కాని.. పేలవమైన లుక్‌ లో కనిపించిన రాజశేఖర్ సినిమాకే మిస్ ఫిట్ అయ్యాడనడంలో సందేహం లేదు. ఒక యాక్షన్ ఎపిసోడ్ లో అయితే ‘వీర.. సుధీర.. అతి భయంకర’ అంటూ చెవుల తుప్పు వదిలించేసే సౌండ్లో భారీ బిల్డప్‌ తో బ్యాగ్రౌండ్ లో ఒక సాంగ్ నడుస్తుంటుంది. రాజశేఖర్ లాంటి హీరోకు ఈ బిల్డప్ ఏంటో అర్థం కాదు. సన్నివేశ బలంతో సాగాల్సిన ‘కల్కి’ లాంటి సినిమాల్లో ఈ హీరోయిజం ఎలివేషన్ ఏంటో అంతుబట్టదు. సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలే ఈ బిల్డప్పులు వదిలిపెట్టి కథను అనుసరించి సాగిపోతున్నారు. అలాంటిది ‘కల్కి’ లాంటి థ్రిల్లర్ మూవీలో రాజశేఖర్ బిల్డప్పులు.. హీరో ఎలివేషన్లు చూస్తే దిమ్మదిరిగిపోతుంది. ప్రధాన పాత్రధారి చూడటానికి చాలా ఎబ్బెట్టుగా కనిపిస్తూ.. ఇలాంటి అక్కర్లేని బిల్డప్పులు ఇస్తే ఇక ఆ కథతో ఎలా కనెక్ట్ అవుతాం?

సినిమా చూసొచ్చాక మొత్తం కథాక్రమాన్ని ఒక పేపర్లో రాసుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాల్సిన స్థాయిలో అనేక మలుపులున్న కథ ‘కల్కి’ది. కానీ కేవలం ట్విస్టులు ఉన్నంత మాత్రాన ప్రేక్షకులు థ్రిల్ అయిపోతారా? ఆ ట్విస్టుల్ని ప్లేస్ చేసిన విధానం ఎలా ఉంది.. వాటి చుట్టూ స్క్రీన్ ప్లే ఎంత ఆసక్తికరంగా రాసుకున్నారు అన్నది కీలకం. ఈ విషయంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ మెప్పించలేకపోయాడు. కథను బ్రేక్ చేసి ముందుది వెనక్కి.. వెనకది ముందుకు చెబితే.. వేర్వేరు పాత్రలతో కథను నరేట్ చేస్తే స్క్రీన్ ప్లే కొత్తగా ఉంది అనుకునే రోజులు పోయాయి. ‘కల్కి’లో దర్శకుడు ప్రశాంత్ ఈ విషయంలో హద్దులు దాటిపోయాడు. సింపుల్‌ గా ముగిసిపోవాల్సిన సన్నివేశాల్ని కూడా అనవసరంగా బ్రేక్ చేసి అసహనానికి గురి చేశాడు. అసలు ‘కల్కి’లో మొదట్నుంచి చివరిదాకా ఎవరో తరుముతున్నట్లుగా ఆదరాబాదరా కథను చెప్పే ప్రయత్నం జరిగింది. దీని వల్ల కథ సరిగా అర్థం కాక.. ఒక రకమైన అలజడిగా అనిపిస్తుంది సినిమా అంతటా. అలాగని అర్థం చేసుకోలేనంత పజిల్స్ కూడా ఏమీ లేవు ‘కల్కి’లో.

స్క్రీన్ ప్లే రేసీగా ఉండాలనే ఉద్దేశంతో కొంచెం ఆగి చెప్పాల్సిన విషయాల్ని కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినట్లుగా చెప్పడం.. సన్నివేశాలతో ప్రేక్షకులకు కథ - పాత్రలు రిజిస్టర్ అయ్యేలా చేయాల్సిన చోటా బ్యాగ్రౌండ్ లో నరేషన్‌ తో బొమ్మలతో కథను నడిపించడం ‘కల్కి’కి చేటు చేశాయి. ఏ పాత్రకూ సరైన ఎస్టాబ్లిష్ మెంట్ లేకపోవడం వల్ల కొన్ని చోట్ల ఆగి.. ఈ పాత్ర నేపథ్యమేంటి అని.. కథతో దీనికి సంబంధమేంటి అని ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకునే స్థాయిలో కంగాళీ చేసి పెట్టాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లో తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి ప్రధానం. ఈ ఆసక్తిని జనరేట్ చేయడంలో ‘కల్కి’ కొంత వరకు విజయవంతమైంది. ఈ కథలోని మలుపులు మామూలుగా చూస్తే ఆసక్తికరమైనవే.

కానీ వాటిని చెప్పిన విధానం బాగా లేక ‘కల్కి’ శిరోభారంగా మారుతుంది. హడావుడి తగ్గించి ఇంకొంచెం సరళంగా చెబితే ‘కల్కి’ ఆకట్టుకునేదే. వంద‌ల మందిని అకార‌ణంగా చంపేయడం వెనుక కార‌ణం తెలిసి ఈ మాత్రానికే ఇంత చేశారా అనిపిస్తుంది. దాని వ‌ల్ల కూడా క‌ల్కి ఇంపాక్ట్ త‌గ్గిపోయింది.

రెండు మినహా పాటలు లేని ఈ చిత్ర నిడివి 2 గంట‌ల 22 నిమిషాలు. చాలా చోట్ల ఆస‌క్తి స‌న్నగిల్లిపోవ‌డం వ‌ల్ల చాలా పెద్ద సినిమా చూసిన భావ‌న క‌లుగుతుంది. న‌రేష‌న్ వేగంగా అనిపిస్తుంది కానీ.. క‌థ మాత్రం అనుకున్నంత వేగంగా న‌డ‌వ‌దు. ఆస‌క్తి లేని.. అన‌వ‌స‌ర స‌న్నివేశాల‌తో విసుగెత్తించే ప్ర‌థ‌మార్ధంతో పోలిస్తే క‌ల్కి ద్వితీయార్ధం మెరుగ్గా అనిపిస్తుంది. ట్విస్టులు రివీల్ అయిన చోట ప్రేక్ష‌కులు కొంత థ్రిల్ అవుతారు. చివ‌రి 15 నిమిషాల్లో సినిమా ఆస‌క్తిక‌రంగా అనిపిస్తుంది. ముందే చెప్పిన‌ట్లుగా ఈ క‌థ‌కు రాజ‌శేఖ‌ర్ లుక్ - ఆయ‌న స్క్రీన్ ప్రెజెన్స్ ఏమాత్రం కుద‌ర‌క‌పోవ‌డం.. అవ‌స‌రం లేని హీరోయిజం సినిమాకు పెద్ద ప్ర‌తికూల‌త‌లుగా మారాయి. దర్శ‌కుడు ప్రోమోలు క‌ట్ చేయ‌డంలో చూపిన శ్ర‌ద్ధ.. క‌థాక‌థ‌నాల మీద పెట్టి ఉంటే ఔట్ పుట్ మ‌రోలా ఉండేది. క‌ల్కి మెప్పించి ఉండేది.

న‌టీనటులు:

ఒక‌ప్పుడు పోలీస్ పాత్ర అంటే రాజ‌శేఖ‌రే చేయాలి అన్న‌ట్లుండేది. కానీ క‌ల్కి చూశాక ఆయ‌న ఇంకెప్పుడూ ఈ పాత్ర‌లు చేయ‌కుంటే బాగుండు అనిపిస్తుంది. ఈ సినిమాకు అతి పెద్ద మైన‌స్ ఆయ‌నే. బాగా స‌న్న‌బ‌డి.. క‌ళ్లు కూడ ఆలోప‌లికి వెళ్లి ముఖంలో క‌ళ పూర్తిగా పోయిన రాజ‌శేఖ‌ర్‌ ను చూడ‌టం ఆయ‌న అభిమానుల్ని కూడా బాధిస్తుంది. రాజ‌శేఖ‌ర్‌ లో మునుప‌టి ఎన‌ర్జీ ఏమాత్రం ఇందులో క‌నిపించ‌లేదు. క‌నీసం బిల్డ‌ప్పులేమీ లేకుండా ఆయ‌న పాత్ర సింపుల్‌ గా ఉన్నా బాగుండేది. కానీ అవ‌స‌రం లేని ఎలివేష‌న్ల‌తో పాత్ర‌ను మ‌రింత దెబ్బ తీశారు. హీరోయిన్ ఆదా శ‌ర్మ గురించి చెప్ప‌డానికేమీ లేదు. ఆమె సినిమాలో ఉందంటే ఉంది అన్న‌ట్లుగా క‌నిపించింది. ఆమెతో పోలిస్తే నందిత శ్వేత పాత్ర బెట‌ర్. ఆమె న‌ట‌న కూడా ఓకే. అశుతోష్ రాణా బాగా చేశాడు కానీ.. అత‌డి పాత్ర‌లోని అతిని భ‌రించ‌లేం. శ‌త్రు బాగా చేశాడు. సిద్ధు జొన్న‌లగ‌డ్డ ఓకే. నాజ‌ర్ స్థాయికి త‌గ్గ పాత్ర ఆయ‌న‌కు ద‌క్క‌లేదు. జ‌య‌ప్ర‌కాష్ ఓకే.

సాంకేతిక‌వ‌ర్గం:

ఈ సినిమాను ప‌క్క‌కు తీసి పెట్టి చూస్తే శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్ నేప‌థ్య సంగీతం స్టాండ్ ఔట్‌ గా నిలుస్తుంది. గూస్ బంప్స్ ఇచ్చే సౌండ్ల‌తో అత‌ను అద‌ర‌గొట్టాడు. కానీ సినిమాలో చాలా చోట్ల‌ అత‌డి నేప‌థ్య సంగీతం ఆడ్‌ గానే అనిపిస్తుంది. మ‌రీ ఎక్కువ సౌండ్లు - అవ‌స‌రానికి మించిన హైప్‌ లో చాలా చోట్ల బ్యాగ్రౌండ్ స్కోర్ అతిగా అనిపిస్తుంది. సినిమాలో ఉన్న రెండు పాట‌ల్లో ఒక‌టి.. హార్న్ ఓకే ప్లీజ్ పాట బాగుంది. కానీ దాని ప్లేస్ మెంట్ - చిత్రీక‌ర‌ణ అంత‌గా ఆక‌ట్టుకోవు. దాశ‌ర‌థి శివేంద్ర ఛాయాగ్ర‌ణం బాగుంది. నిర్మాణ విలువలు ఆక‌ట్టుకుంటాయి. 80వ ద‌శ‌కం నాటి వాతావ‌ర‌ణాన్ని తెర‌పైకి తీసుకురావ‌డంలో క‌ష్ట‌ప‌డ్డారు. ఖ‌ర్చు పెట్టారు. ఇక ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మలో మంచి ఆలోచ‌నలు.. కొత్త‌గా ఏదో చేయాలన్న ఉత్సాహం కనిపించాయి కానీ.. అత‌ను క‌థ‌ను ఒక తీరుగా - ఆస‌క్తిక‌రంగా చెప్ప‌లేక‌పోయాడు. స్క్రీన్ ప్లే మ‌రీ కంగాళీగా త‌యారైంది. క‌థలో విష‌యం ఉన్న‌ప్ప‌టికీ దాన్ని స‌రిగ్గా ప్రెజెంట్ చేయ‌డంలో ప్ర‌శాంత్ విఫ‌ల‌మ‌య్యాడు. పాత్ర‌ల చిత్ర‌ణ‌.. స‌న్నివేశాల రూప‌క‌ల్ప‌న‌లో ద‌ర్శ‌కుడి వైఫ‌ల్యం స్ప‌ష్టంగా క‌నిపించింది.

చివ‌ర‌గా: క‌ల్కి.. కంగాళీ

రేటింగ్: 2.25/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre× RELATED ఆజ్ఞాతం వీడిన కల్కి భగవాన్.. వీడియో విడుదల