శర్వా భుజానికి 11 గంటల శస్త్ర చికిత్స

వెర్సటైల్ స్టార్ శర్వానంద్ డెడికేషన్ .. హార్డ్ వర్క్ గురించి తెలిసిందే. ఒకేసారి రెండు మూడు సినిమాలకు సంతకాలు చేస్తూ సినిమాల పరంగా స్పీడ్ పెంచాడు. వరుసగా షూటింగుల్లో పాల్గొంటున్నాడు. ఇప్పటికే అతడు నటించిన `రణరంగం` ఆగస్టు 2న రిలీజ్ కి రెడీ అవుతోంది. అలాగే సైమల్టేనియస్ గా 96 రీమేక్ చిత్రీకరణలోనూ శర్వా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అయితే ట్రైనింగ్ లో ఓ చిన్నపాటి అపశ్రుతి శర్వా సినిమాకి బ్రేక్ పడేందుకు కారణమైంది.

96లో శర్వానంద్ పై స్కై డైవింగ్ సీన్స్ ని తెరకెక్కించాల్సి ఉండగా.. ఇటీవలే థాయ్ ల్యాండ్ వెళ్లి ఆ క్రీడలో శిక్షణ తీసుకున్నాడు. ఆ సమయంలో అతడు పై నుంచి కింద పడడంతో భుజానికి కాస్తంత పెద్ద దెబ్బే తగిలిందని నిన్నటి రోజున వార్తలొచ్చాయి. వెంటనే  విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చి సన్ షైన్ ఆస్పత్రిలో చేరారు శర్వానంద్. అతడి భుజానికి సంబంధించిన ఎముకలు కదిలాయని దానిని సరిదిద్దేందుకు చిన్నపాటి శస్త్ర చికిత్స అవసరం పడుతుందని డాక్టర్లు చెప్పారు.

తాజా సమాచారం ప్రకారం.. నేడు సన్ షైన్ డాక్టర్లు సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. దాదాపు 11 గంటల పాటు ఎంతో ఓపిగ్గా శ్రమించి సర్జరీని పూర్తి చేశారట. శర్వా ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాడు. అయితే కొన్ని వారాల పాటు అతడు పూర్తిగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పారట. దీంతో కొద్దిరోజులు 96 చిత్రీకరణ పెండింగులో పడినట్టేనని తెలుస్తోంది. ఈ చిత్రంలో శర్వానంద్ సరసన సమంత కథానాయికగా నటిస్తున్నారు. తమిళ వెర్షన్ టైటిల్ 96 నే యథాతథంగా తెలుగు వెర్షన్ టైటిల్ గా ఎంపిక చేసుకున్నారా... లేదా అన్నదానికి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు శర్వా నటించిన రణరంగం రిలీజ్ కి రెడీ అవుతోంది. ఒకట్రెండు వారాల్లో సర్జరీ పెయిన్స్ నుంచి రిలీఫ్ రాగానే ప్రచారానికి రెడీ అవుతారని తెలుస్తోంది.
× RELATED జగన్ - ఆయన కుడి భుజాన్ని పవన్ బెదిరించాడా?