సినిమా రిలీజట.. ఇప్పుడైనా స్పందించు విష్ణు

మంచు ఫ్యామిలీలో ఎవరి పరిస్థితీ ఇప్పుడు బాగా లేదు. వరుసగా ఒకరిని మంచి ఒకరు డిజాస్టర్లు ఎదుర్కొని కెరీర్లను అయోమయ స్థిితిలోకి నెట్టుకున్నారు. మంచు విష్ణు సంగతే తీసుకుంటే.. అతను ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయాడు. దాని తర్వాత అతను నటించిన ‘ఓటర్’ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. అసలే దానికి బజ్ లేదు. పైగా హీరోకు దర్శకుడికి మధ్య వివాదం రాజుకుని సినిమా విడుదల ప్రమాదంలో పడింది. రాజకీయాలు ఎన్నికల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కాబట్టి ఎన్నికల సమయంలో రిలీజ్ చేస్తే పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉండేదేమో. కానీ ఆ సమయంలో విడుదల గురించి మానేసి దర్శకుడు కార్తీక్ రెడ్డి.. మంచు విష్ణు మద్దతు దారులు గొడవ పడుతూ ఉన్నారు. విష్ణు మీద కార్తీక్ ఎన్నో ఆరోపణలు చేశాడు కానీ.. విష్ణు మాత్రం ఏమీ మాట్లాడలేదు. అతడి వర్గీయులు మాత్రం ఎదురు దాడి చేశారు. విష్ణు తెర వెనుక ఉండి కథ నడిపించాడన్న ఆరోపణలు వచ్చాయి.

పాపం మధ్యలో నిర్మాత సుధీర్ అన్యాయం అయిపోయాడు. ఆయన సినిమాను ఎలాగైనా విడుదల చేయాలన్న పట్టుదలతో కష్టపడుతున్నాడు. చూసి చూసి చివరికి ఈ నెల 21న సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించాడు. రిలీజ్ డేట్ పోస్టర్లు కూడా వదిలాడు. కానీ దర్శకుడు హీరో సినిమాను పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు. కార్తీక్ ఎవరో జనాలకు తెలియదు కాబట్టి ఓకే. కానీ విష్ణు సంగతలా కాదు. అతడి సినిమా రిలీజవుతుంటే దాని గురించి మాట్లాడకుండా సైలెంటుగా ఉండటం భావ్యం కాదు. గతంలో ఏళ్లకు ఏళ్లు మరుగున పడి.. ఫ్లాప్ అవడం గ్యారెంటీ అనే స్థితిలో రిలీజైన తన సినిమా ‘శంకర’ను నారా రోహిత్ ప్రమోట్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ‘ఓటర్’ విషయంలో గొడవలున్నా.. ఆ సినిమా ఫలితం మీద సందేహాలున్నా సరే.. దాన్ని ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత విష్ణు మీద ఉంది. మరి రాబోయే రోజుల్లో అయినా అతను ఈ సినిమా గురించి మాట్లాడతాడేమో చూడాలి.

    

× RELATED మెగా హీరోకు మంచు విష్ణు ఫన్నీ వార్నింగ్..తేజూ రిప్లె అదిరింది
×