'ఫలక్ నుమా దాస్'

చిత్రం: 'ఫలక్ నుమా దాస్'

నటీనటులు: విశ్వక్సేన్ - ఉత్తేజ్ - తరుణ్ భాస్కర్ - సలోని మిశ్రా - హర్షిత గౌర్ తదితరులు
సంగీతం: విశ్వక్సేన్
ఛాయాగ్రహణం: విద్యాసాగర్ చింతా
నిర్మాత: కరాటె రాజు
స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: విశ్వక్సేన్

ఈ మధ్య కాలంలో ఆసక్తికర టీజర్ - ట్రైలర్లతో ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించిన చిన్న సినిమా ‘ఫలక్‌ నుమా దాస్’. విడుదలకు ముందు రోజు రాత్రి పదుల సంఖ్యలో థియేటర్లలో పెయిడ్ ప్రివ్యూలు వేసే రేంజిలో ఈ చిత్రం క్రేజ్ తెచ్చుకుంది. ఐతే టీజర్.. ట్రైలర్ స్థాయిలోనే సినిమా కూడా ఉందేమో చూద్దాం పదండి.

కథ:

దాస్ (విశ్వక్సేన్) హైదరాబాద్ లోని ఫలక్ నుమాలో డిగ్రీ చదువుతూ.. తన స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతూ సాగిపోయే కుర్రాడు. అతడికి ఆ ఏరియా రౌడీ షీటర్ అయిన శంకరన్న అంటే అభిమానం. ఆయన లాగే తాను కూడా గ్యాంగ్ పెట్టి దందాలు చేయాలని ఆశపడుతుంటాడు. ఐతే శంకరన్న హత్యకు గురవగా.. తన స్నేహితులతో కలిసి ఆయన పేరు మీద మటన్ షాపు పెడతాడు. ఆ బిజినెస్ బాగానే నడుస్తుండగా.. శంకరన్నను హత్య చేసిన ఇద్దరు రౌడీ షూటర్లతో గొడవ మొదలవుతుంది. ఈ గొడవల్లో దాస్ వల్ల అవతలి వర్గానికి చెందిన ఒక కుర్రాడు చనిపోతాడు. దాస్ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. దీంతో అతడి జీవితం తల్లకిందులవుతుంది. దీన్నుంచి అతను ఎలా బయటపడ్డాడు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

ఒక భాషలో ‘కల్ట్’.. ‘క్లాసిక్’ అనిపించుకున్న మాత్రాన మరో భాషలో ఆ సినిమాను రీమేక్ చేస్తే అలాంటి ఫలితమే వస్తుందన్న గ్యారెంటీ ఏమీ లేదు. తమిళ సినిమాల్లో ఒక మైలురాయిగా నిలిచిన ‘సూదుకవ్వుం’ అనే సినిమా తెలుగులోకి ‘గడ్డం గ్యాంగ్’ పేరుతో రీమేకైతే ఎవ్వరికీ రుచించలేదు. ప్రధానంగా నేటివిటీతో ముడిపడ్డ సినిమాలతో వచ్చే సమస్య ఇది. అక్కడి పరిస్థితులు ఇక్కడ లేనపుడు ప్రేక్షకులు కథతో కనెక్టవడం కష్టం. ‘ఫలక్ నుమా దాస్’ విషయానికి వస్తే ఇది మలయాళంలో కల్ట్ మూవీగా పేరు తెచ్చుకున్న ‘అంగామలై డైరీస్’కు రీమేక్. మామూలుగా ఆ సినిమా చూస్తే.. అది తెలుగు నేటివిటీకి సూట్ కాదనే అనిపిస్తుంది. ఐతే హీరో కమ్ డైరెక్టర్ విశ్వక్సేన్ తెలివిగా పాత బస్తీ నేపథ్యాన్ని ఎంచుకోవడం దీన్ని ఇక్కడి ప్రేక్షకులకు రుచించేలా చేయడానికి మంచి మార్గమే.

‘అంగ్రేజ్’.. ‘హైదరాబాద్ నవాబ్స్’ లాంటి లోకల్ సినిమాల్ని తప్పిస్తే.. మెయిన్ స్ట్రీమ్ మూవీస్ లో మరే దర్శకుడూ చూపించని విధంగా పాతబస్తీని ఈ సినిమాలో చూపించాడు విశ్వక్. ఏదో అక్కడికెళ్లి కెమెరా పెట్టేయడం.. అక్కడి సందుల్లో గొందుల్లో ిషూటింగ్ చేసేయడం కాదు. అక్కడి మనుషుల్ని, వాతావరణాన్ని బాగానే తెరపైకి తీసుకొచ్చాడు. సన్నివేశాలు.. డైలాగులు రియలిస్టిగ్గా.. నేటివ్ ఫీల్ తో ఉండేలా చూసుకున్నాడు. ఐతే ఇవన్నీ కూడా సినిమాకు అదనపు ఆకర్షణలే. రెండున్నర గంటల సినిమా నడిపించాలంటే ఇవి మాత్రమే సరిపోవు. టేకింగ్ బాగుండి.. కొన్ని డైలాగులు పేలి.. కొన్ని సన్నివేశాలు మెరిసినంత మాత్రాన ప్రేక్షకులు సంతృప్తి పడిపోరు. కథాకథనాలు కనెక్టవడం అన్నిటికంటే ముఖ్యం. ఇక్కడే ‘ఫలక్ నుమా దాస్’ నిరాశ పరుస్తుంది. చెప్పుకోదగ్గ కథేమీ లేని ఈ చిత్రంలో ఎడతెరపి లేని గ్యాంగ్ వార్స్..  కథతో సంబంధం లేకుండా వచ్చిపోయే సన్నివేశాలు.. పేలవమైన రొమాంటిక్ ట్రాక్స్ ప్రేక్షకుల్ని అసహనానికి గురి చేస్తాయి. పాతబస్తీ నేపథ్యం వల్ల.. టేకింగ్ వల్ల డిఫరెంట్ ఫీల్ అయితే కలుగుతుంది కానీ.. ఒక సినిమాగా అయితే ‘ఫలక్ నుమా దాస్’ మెప్పించదు.

‘ఫలక్ నుమా దాస్’ ఆరంభంలో హీరో తన గ్యాంగ్ ను వేసుకుని గొడవలకు వెళ్తుంటే బాగానే అనిపిస్తుంది. ఈ గొడవలతో బాగానే ఫన్ జనరేట్ చేశారు. మన సినిమాల్లో పెద్దగా చూడని లొకేషన్లు, మనుషులతో ఒక కొత్త ఫీల్ కనిపిస్తుంది. ఐతే తెరపై పాత్రలకు.. మొదట్లో వచ్చే కొన్ని సన్నివేశాలకు అలవాటు పడిపోయాక.. ఇంకేదైనా కొత్తగా చూపిస్తారేమో అని చూస్తాం. అక్కడే ‘ఫలక్ నుమా దాస్’ గాడి తప్పుతుంది. హీరో బ్యాచ్ తిప్పి తిప్పి కొడితే మందు కొట్టడం.. లేదంటే ఎవరినైనా కొట్టడం.. ఇది తప్ప ఇంకేమీ చేయదు. దీంతో చూసిన సీన్లే మళ్లీ చూసి ఒక దశ దాటాక బోర్ కొట్టేస్తుంది. ఇంటర్వెల్ ముంగిట వచ్చే మలుపు దగ్గర బిల్డప్ చూసి ద్వితీయార్ధం గురించి ఏదో ఊహించుకుంటాం. కానీ తర్వాత అది సాధారణమైన కథాకథనాలతో తేల్చిపడేశాడు విశ్వక్.

హీరో పెద్ద చిక్కుల్లో పడ్డట్లు కనిపిస్తాడు. అంతలోనే చాలా తేలిగ్గా సమస్య నుంచి బయటపడిపోతాడు. కథ ఒక తీరుగా నడవకుండా ఏవేవో సన్నివేశాలు వచ్చిపోతుండటంతో ద్వితీయార్ధంలో ‘ఫలక్ నుమా దాస్’ విసిగించేస్తుంది. అసలే రొమాంటిక్ ట్రాక్స్ అసలు సినిమాకు అవసరమే లేనట్లుగా అనిపిస్తే.. పైగా హీరోయిన్ల పాత్రలకు ఏమాత్రం ఫేస్ వాల్యూ లేని అమ్మాయిల్ని పెట్టుకోవడం అవి మరింత మైనస్ అయిపోయాయి. సహజత్వం కోసం.. ఒరిజినల్ ను ఫాలో అవుతూ.. హీరో-ప్రత్యర్థి వర్గం మధ్య గొడవలకు కేంద్రంగా ‘మటన్ బిజినెస్’ ఎపిసోడ్ పెట్టారు కానీ.. అది అంతగా కనెక్టవదు. ప్రథమార్ధంలో అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ.. ఓ మోస్తరుగా టైంపాస్ అవుతుంది. కానీ ద్వితీయార్ధంలో డౌన్స్ తప్ప అప్స్ లేకపోవడంతో ‘ఫలక్ నుమా దాస్’ గ్రాఫ్ అంతకంతకూ పడిపోతుంది. కొంచెం కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు.. పాతబస్తీ నేటివ్ హ్యూమర్ కోసం.. నటీనటుల పెర్ఫామెన్స్ కోసం.. సాంకేతిక ఆకర్షణల కోసం ఒకసారి ఈ సినిమా చూడొచ్చేమో కానీ.. అంతకుమించి ‘ఫలక్ నుమా దాస్’లో చెప్పుకోదగ్గ విషయం లేదు.

నటీనటులు:

విశ్వక్సేన్ మంచి నటుడని తన తొలి రెండు సినిమాలతోనే చూపించాడు. ‘వెళ్లిపోమాకే’ తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది’లో పూర్తి భిన్నంగా కనిపించిన విశ్వక్.. ‘ఫలక్ నుమా దాస్’లో మరింతగా ఆశ్చర్యపరుస్తాడు. పాతబస్తీ కుర్రాళ్ల మనస్తత్వాన్ని నరనరాన నింపుకున్న దాస్ పాత్రలో అతను జీవించేశాడు. హీరోయిన్ల గురించి చెప్పడానికి ఏమీ లేదు. పెగ్ పాండు పాత్రలో ఉత్తేజ్ చాన్నాళ్ల తర్వాత తనదైన ముద్ర వేశాడు. అథెంటిక్ తెలంగాణ యాసతో ఆయన ఆ పాత్రను పండించాడు. పోలీస్ పాత్రలో తరుణ్ భాస్కర్ కూడా మెరిశాడు. అతడిని నటుడిగా మరిన్ని పాత్రల్లో చూడొచ్చేమో. హీరో స్నేహితుల బృందంలో ఉన్నవాళ్లు.. విలన్ పాత్రల్లో చేసిన కుర్రాళ్లు.. అందరూ సహజంగా నటించి మెప్పించారు.

సాంకేతికవర్గం:

‘ఫలక్ నుమా దాస్’ సినిమా నుంచి బయటికి వచ్చాక ఎక్కువగా గుర్తుండేది నేపథ్య సంగీతమే. వివేక్ సాగర్ చాలా సన్నివేశాల్ని బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేశాడతను. పాటలు పర్వాలేదు. విద్యాసాగర్ ఛాయాగ్రహణం కూడా బాగుంది. పాతబస్తీ వాతావరణాన్ని చాలా బాగా చూపించాడు. కొన్ని చోట్ల కెమెరా పనితనం కొంత షేకీగా అనిపించినా.. అది సహజత్వం కోసమే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. దర్శకుడు విశ్వక్సేన్ విషయానికి వస్తే.. ‘అంగామలై డైరీస్’ పాత బస్తీ బ్యాక్ డ్రాప్ తో చెప్పాలన్న అతడి ఆలోచన బాగుంది. టేకింగ్ పర్వాలేదు. డైలాగులు బాగానే రాశాడు. పాతబస్తీ భాష, యాస, అక్కడి వాతావరణం, మనుషులపై విశ్వక్సేన్ కు మంచి పట్టే ఉన్నట్లుంది. ఈ సెటప్ వరకు అతను మెప్పించాడు. కానీ దర్శకుడిగా అనుభవం లేకపోవడం వల్ల.. కథను ఒక తీరుగా చెప్పలేకపోయాాడు. సన్నివేశాలు తీసుకొచ్చి పేర్చినట్లుగా అనిపిస్తుంది తప్ప.. కథ ఎక్కడా ఒక తీరుగా నడిచినట్లు అనిపించదు. ముఖ్యంగా ద్వితీయార్ధంలో అతడి తడబాటు స్పష్టంగా కనిపిస్తుంది.

చివరగా: ఫలక్ నుమా దాస్.. గోలెక్కువైపోయింది బాస్

రేటింగ్: 2/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
× RELATED భానుమతి అండ్ రామకృష్ణ
×