చిరుకు అప్సర లాడ్జ్.. నాకేమో వంటపాక

``ప్రతిదీ కమర్షియల్ అయిపోతున్న ఈరోజుల్లో కమర్షియాలిటీ అన్నది లేకుండా తనదైన కమిటిమెంట్ తో ముందుకు సాగుతున్నారు ఆర్.నారాయణమూర్తి.  ఆయన నికార్సయిన మనిషి. ఆయన సినిమాలే అందుకు నిదర్శనం`` అని ప్రశంసలు కురిపించారు మెగాస్టార్ చిరంజీవి. పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి నటించిన తాజా చిత్రం `మార్కెట్లో ప్రజాస్వామ్యం` ఆడియో వేడుకలో ముఖ్య అతిధి మెగాస్టార్ పైవిధంగా స్పందించారు.

చిరంజీవి మాట్లాడుతూ -``నా మిత్రుడికి ఆనందాన్ని కలిగించేందుకు నేను ఆడియోకి వచ్చాను. నారాయణమూర్తితో నాలుగున్నర దశాబ్దాల పరిచయం ఉంది. తన ఆడియో వేడుకకు రావడం మనస్సుకు ఎంతో సంతోషంగా ఉంది. అప్పటి నారాయణమూర్తి ఇప్పటి నారాయణమూర్తి ఒక్కడే. అతడిలో ఏ మార్పూ లేదు.  ఆస్తులు.. అంతస్థులు కాదు సినిమానే జీవితం అనుకున్నాడు. సినిమానే ప్రేమించాడు.. సినిమానే పెళ్లి చేసుకున్నాడు.. సినిమాతోనే నారాయణమూర్తి సంసారం చేస్తున్నాడు`` అంటూ ప్రశంసలు కురిపించారు. అసలు నారాయణమూర్తి కమర్షియల్ సినిమా వైపు ఆలోచన చేయకపోవడానికి టెంపర్ సినిమానే ఒక పెద్ద ఉదాహారణ అని అన్నారు. సినిమా అంటే మూర్తికి పిచ్చి అని పొగిడేశారు. `మార్కెట్లో ప్రజాస్వామ్యం` అంటూ కమర్షియల్ పంథాని ప్రశ్నించే సినిమానే తీశారని అన్నారు.
 
పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ-``ఆడియో ఫంక్షన్ కి మీరు వస్తే ప్రమోషన్ కి సాయం అవుతుందని చెప్పగానే మెగాస్టార్ ఏ మాత్రం ఆలోచించకుండా వచ్చారు. మంచి మనసున్న వ్యక్తి . వచ్చినందుకు కృతజ్ఞతలు. ప్రాణం ఖరీదు సినిమా షూటింగ్ లో మెగాస్టార్ హీరోగా చేసినప్పుడు నేను జూనియర్ ఆర్టిస్టును. అప్పుడు చిరంజీవి .. నూతన ప్రసాద్ .. చంద్రమోహన్ ని రాజమండ్రి అప్సర లాడ్జిలో ఉంచారు. నన్ను కూడా అక్కడే ఉంచి మంచి భోజనం పెడతారని అనుకున్నా. కానీ ఒక వంటపాకలో నన్ను ఉంచారు. అప్పుడు దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి నాకు కంపెనీ ఇచ్చారు`` అంటూ పాత జ్ఞాపకాల్లోకి వెళ్లారు. చిరంజీవి ఇండస్ట్రీని ఏలేస్తాడని ఆ రోజుల్లోనే చెప్పానని అందుకు మెగాస్టార్ తనకు కృతజ్ఞతలు చెప్పారని మూర్తి గారు గుర్తు చేసుకున్నారు. బడుగు బలహీన వర్గాల వైపు నిలిచి కార్పొరెట్ ని.. బూర్జువా సమాజాన్ని.. దుష్ట రాజకీయ నాయకుల్ని ప్రశ్నించిన ఏకైక దర్శకనిర్మాత- నటుడు ఆర్.నారాయణ మూర్తి అన్న సంగతి తెలిసిందే.
× RELATED తాప్సీ చెంప చెల్లుమనిపించిందెవరు?
×