ఈసారి తోపులాటలో కింద పడిపోయారు.. షర్మిలకు ఇంకెన్ని కష్టాలో?

Tap to expand
కొందరికి అంతే. ఎంత కష్టపడినా ఫలితం దక్కదు. రెక్కలు ముక్కలు చేసుకుంటారు. కిందా మీదా పడతారు. అవసరానికి మించిన అవమానాలకు రెఢీ అవుతారు. అయినప్పటికీ.. ఫలితం మాత్రం సున్నా అన్నట్లు ఉంటుంది. ఇప్పుడు వైఎస్ షర్మిల పరిస్థితి ఇలానే ఉంది. దివంగత మహానేత గారాల పట్టిగా.. యువనేత జగన్ తో పోలిస్తే.. షర్మిలకే వైఎస్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారిని.. ఆమెను అల్లారుముద్దుగా పెంచారని చెబుతారు.

అలాంటి షర్మిల.. తన తండ్రి మాదిరి దూసుకెళ్లే తత్త్వం ఉన్నా.. ఆమెకు కాలం కలిసిరావటం లేదు. తన సోదరుడు జగన్ కు బాణంగా మారి.. సంచలనాల్ని క్రియేట్ చేసిన ఆమె.. తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టి.. ఎంతగా ప్రయత్నిస్తున్నా ఫలితం లేని పరిస్థితి. సొంతంగా పార్టీ పెట్టిన ఆమె ఇప్పటికేతెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. అయినప్పటికీ తెలంగాణ సమాజాన్ని కించిత్ కూడా కదలించలేకపోయారు. ఆమె ఎంతగా కష్టపడుతున్నా.. ఫలితం మాత్రం రాని దుస్థితి.


నిరుద్యోగుల కోసం ప్రతి వారం దీక్ష చేయటం.. వివిధ సమస్యలపై అనూహ్యంగా అమరణనిరాహా దీక్షతో పాటు.. ఇప్పటికే పలు దీక్షలు చేసినప్పటికీ ఆమెకు రావాల్సిన మైలేజీ రాకపోవటం తర్వాత.. రవ్వంత సానుభూతి కూడా లేకపోవటం గమనార్హం. అయినప్పటికీ.. ఎడారిలో నీళ్ల కోసం వెతికిన చందంగా.. తెలంగాణలో తన రాజకీయ అవకాశాల కోసం ఆమె ఎంతలా ఫైట్ చేస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడు.

ఇదిలా ఉండగా.. తాజాగా ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లి.. అక్కడి పరిస్థితుల్ని స్వయంగా చూడాలని షర్మిల డిసైడ్ అయ్యారు. అయితే.. ఆమె కార్యక్రమం గురించి తెలిసిన పోలీసులు ఆమెను ఇంటి నుంచి అడుగు బయటపెట్టేందుకు అనుమతించలేదు. ఎంతలా ప్రయత్నించినా.. ఆమెను ఇల్లు కదలనిచ్చేది లేదని తేల్చేశారు. ఆమె బయటకు వస్తే శాంతిభద్రత సమస్య అంటూ ఆపేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై ఒంటికాలి మీద విరుచుకుపడ్డారు షర్మిల.

కేసీఆర్ నియంత అని మరోసారి నిరూపితమైందన్న ఆమె.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొదలు ప్రధాని మోడీతో పాటు గవర్నర్ కు ఆమె.. కేసీఆర్ సర్కారు మీద ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్న ఆమె.. కోట్లాది రూపాయిలతో ఉస్మానియా ఆసుపత్రి రూపురేఖల్ని మారుస్తానని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ.. ఇప్పటి వాస్తవ పరిస్థితిని చూడాలన్న పట్టుదలను ప్రదర్శించారు. అయినప్పటికీ పోలీసులు అంగీకరించలేదు.

ఈ నేపథ్యంలో ఆమె బలవంతంగా ఉస్మానియా ఆసుపత్రికి వెళతానని పట్టుదలను ప్రదర్శించారు. దీంతో.. ఆమెను బయటకు అడుగు పెట్టకుండా ఉండేందుకు చేసిన పోలీసుల ప్రయత్నాలతో షర్మిల నివాసం వద్ద గంగదరగోళం చోటు చేసుకుంది. ఈ సమయంలో పోలీసులు.. షర్మిల కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న తోపులాటలో ఆమె కింద పడిపోయారు. ఈ పరిణామంపై షర్మిల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదంతా చూసినప్పుడు.. రానున్న రోజుల్లో మరెన్ని కష్టాలకు షర్మిల సిద్ధమయ్యారన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా.. ఇన్ని ప్రతికూలతల్ని.. అవమానాల్ని ఎదుర్కొంటూ షర్మిల చేస్తున్న ప్రయత్నాలు చూస్తే.. ఆమెకు కాలం కూడా కలిసి రాకపోవటాన్ని పలువురు చర్చించుకోవటం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Show comments
More