వైసీపీ నోట అమరావతి మాట...మార్చిందెవరు...?

Tap to expand
అమరావతి గురించి మాట్లాడమంటే సీఎం జగన్ నుంచి చాలా మంది వైసీపీ నాయకులు మూడు రాజధానులు అనే ఎక్కువగా గట్టిగా చెబుతారు. ఇక ముఖ్యమంత్రి జగన్ తాను పాల్గొన్న సభలలో మాట్లాడినపుడు కూడా తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి వారు చెబుతున్న రాజధాని అని సెటైర్లు వేస్తారు తప్ప అమరావతి రాజధాని అని తానుగా చెప్పరని ఇప్పటికే విమర్శలు చేసేవారున్నారు.

ఇక మూడు రాజధానులు అంటూ వైసీపీ చెబుతున్నా అందులో ఎక్కువగా విశాఖను ఫోకస్ చేస్తున్నారు. అదే విధంగా కర్నూల్ గురించి కూడా పదే పదే శ్రీ భాగ్ డీల్ ని గుర్తు చేస్తూ  చెబుతారు. మరి మూడవ రాజధానిగా అయినా చూస్తే  అమరావతి ఉంది కదా.  ఉనికిలో ఉన్న దాన్ని ముందు హైలెట్ చేసి మిగిలినవి కొత్తగా పెట్టాలనుకున్నవి ప్రతిపాదన స్థాయిలో కాగితాల మీద కూడా లేని వాటి గురించి తరువాత చెప్పినా ఎవరూ పెద్దగా బాధపడేవారు కారు.


కానీ వైసీపీ మొదటే దూకుడుగా మూడు రాజధానుల  విషయంలో వ్యవహరించింది. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిందే. అందుకే మూడు రాజధానులు అంటున్నాం అయితే ప్రిన్సిపుల్ రాజధానిగా అమరావతి ఉంటుంది అని చెప్పి ఉంటే కొంతలో కొంత ఉద్యమం తగ్గేది రైతులకు కూడా భరోసా వచ్చేది. ఇక అమరావతి రాజధాని అంటూ ఎంతో కొంత అభివృద్ధి టీడీపీ టైం లో చేశారు కాబట్టి మిగిలినది పూర్తి దశల వారీగా మూడేళ్ల కాలంలో పూర్తి చేసి ఉంటే రైతులను ఎవరు ఎంతగా రెచ్చగొట్టిగా ఉద్యమాలకు దిగేవారు కాదు అన్న మాట ఉంది.

అయితే పూర్తిగా బిర్ర  బిగుసుకుని పోయి అమరావతి మాట అసలు  వినకూడదు అన్నట్లుగానే వైసీపీ పెద్దలు వ్యవహరించారు అన్నది విమర్శగా నేటికీ ఉంది. ఇక అమరావతిని  అభివృద్ధి  చేసే  విషయంలో కోర్టులు చెప్పినా కూడా నిధులు లేవు అంటూ సాకులు చెబుతూ వచ్చారని అంటున్నారు. మరి అమరావతి కోసం వేలాది ఎకరాల భూములు ఇచ్చిన రైతులకు ఎంతైనా బాధ కలగదా. వారి నమ్మకాలు సడలిపోవా. అందుకే వారు రోడ్లు ఎక్కారు.

ఇక అమరావతి రైతులు ముందు ఆందోళన చేస్తున్నపుడు వారిని పిలిచి ప్రభుత్వం చర్చలు జరిపి ఉన్నా ఎంతో కొంత అలజడి తగ్గేది. అవేమీ జరగకపోవడం వల్లనే పాదయాత్ర బాట పట్టారు. న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ మొదటి సారి చేసిన యాత్రకు రాయలసీమలో కూడా బాగానే  మద్దతు దక్కింది. ఇపుడు అమరావతి నుంచి అరసవెల్లి దాకా అంటూ చేస్తున్న రెండవ పాదయాత్రకు కూడా ఇప్పటిదాకా అపూర్వ స్పందన దక్కుతోంది.

దీంతో వైసీపీ పెద్దలకు రైతుల ఉద్యమం వెనక ఉన్న అసలైన  నిజాలు ఎంతో కొంత బోధపడి ఉంటాయని అంటున్నారు. అందుకే మంత్రులు ధర్మాన ప్రసాదరావు లాంటి వారు అమరావతి రైతుల ఆవేదనను మేము అర్ధం చేసుకుంటామని అంటున్నారు. వారు కూడా మూడు రాజధానుల విషయంలో సూచనలు ఇవ్వవచ్చు అని కూడా కొత్త మాట చెబుతున్నారు.

ఇక ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి అయితే తాజాగా పార్టీ జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో అధికార వికేంద్రీకరణ మన మంత్రం అదే నినాదం అని చెబుతూనే అమరావతి పేరుని ప్రస్థావించారు.  ఏపీలో  మూడు రాజధానులు ఉంటాయి అందులో అమరావతి కూడా ఒకటి ఉంటుంది అని జనాలకు చెప్పాలని అదే ప్రచారం చేయాలని ఆయన పార్టీ శ్రేణులను  గట్టిగా కోరారు. అంటే ఇంతదాకా అమరావతి పేరుని సైతం పెద్దగా ప్రస్థావించడానికి ఇష్టపడని వైసీపీ పెద్దలు ఇపుడు అమరావతి కూడా ఒక రాజధాని అని అంటున్నారు.

దీని మీదనే ఇపుడు  విపక్షాలు కూడా రియాక్ట్ అవుతున్నాయి. ఇవాళ అమరావతి ఒక రాజధాని అని  అంటున్నారు. రేపటి రోజున అదే అమరావతి ఏకైక రాజధాని అని కూడా ఇదే వైసీపీ నేతలు  అంటారని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రైతుల పాదయాత్ర ద్వారా వైసీపీ పెద్దలకు బాగానే  వేడి పుడుతోందని అంటున్నారు. దాని ఫలితంగా అమరావతి జపం మొదలైంది అని కూడా చెబుతున్నారు. చూడాలి ముందు ముందు అమరావతి అన్న మాట అధికార పక్షం నోట ఒక మంత్రంగా వస్తుందా లేక నినాదంగా మారుతుందా అన్నది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Show comments
More