'కోడ్ నేమ్: తిరంగ' ట్రైలర్: ఏజెంట్ గా స్టైలిష్ యాక్షన్ తో అదరగొట్టిన చోప్రా గర్ల్..!

Tap to expand

బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా కెరీర్ ప్రారంభం నుంచీ కథల ఎంపికలో వైవిధ్యాన్ని చూపిస్తూ వస్తోంది. 'లేడీస్ వెర్సెస్ రిక్కీ బాల్' దగ్గర నుంచి.. 'సైనా'బయోపిక్ వరకూ ఎన్నో విలక్షణమైన చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు ''కోడ్ నేమ్: తిరంగా'' అనే సినిమాతో రాబోతోంది.


పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో రిభు దాస్‌ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'కోడ్ నేమ్: తిరంగా'. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ ఆవిష్కరించారు. హై ఇంటెన్స్ యాక్షన్‌ మరియు ఎమోషన్స్ కలయికలో ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.


ట్రైలర్ లోకి వెళ్తే.. 2001 పార్లమెంట్ దాడికి ప్రధాన సూత్రధారి టెర్రరిస్ట్ ఖలీద్ ఒమర్‌ (శరద్ కేల్కర్) కోసం ఇండియన్ RAW చాలా ఏళ్లుగా గాలిస్తోంది. అతన్ని కనిపెట్టడానికి పని చేసే ఆల్ఫా వన్ అనే స్పై ఏజెంట్‌ గా పరిణీతి కనిపించింది.

చివరగా ఒమర్‌ టర్కీలో దాక్కున్నాడని భారత నిఘా వర్గాలు తెలుసుకున్నాయి. అతన్ని పట్టుకోవడానికి ప్రభుత్వం ఆల్ఫా వన్ ను పంపిస్తుంది. RAW ఏజెంట్‌ గా దేశం కోసం ఫియర్ లెస్ మిషన్‌ లో ఉన్న పరిణీతి.. ఈ క్రమంలో ఎలాంటి ఛాలెంజెస్ ను ఫేస్ చేసింది.. ప్రేమా? దేశమా? అనేది తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుందనేది ఆసక్తికరం.

పరిణితి తన ఫస్ట్ ఫుల్ లెన్త్ యాక్షన్ డ్రామాలో తన యాక్షన్ అవతార్‌ ను ప్రదర్శిస్తుంది. భారీ ఛేజింగులు - గన్ ఫైరింగ్ మరియు స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలలో చోప్రా గర్ల్ అదరగొట్టింది. దీని కోసం ఆమె ఫిజికల్ గా ఎంతో శ్రమించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఎమోషనల్ పార్ట్ లోనూ పరిణితి మెప్పించింది.

సింగర్ హార్డీ సంధు ఈ సినిమాతో నటుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. ఇందులో అతనికి పరిణీతికి మధ్య రొమాంటిక్ ఎపిసోడ్ ఉంది. అది కథాంశంలో చాలా కీలకమని తెలుస్తోంది. సీక్రెట్ మిషన్ లో భాగంగా పని చేస్తున్న క్రమంలో డాక్టర్ సంధుతో ఆమె ప్రేమలో పడినట్లు ట్రైలర్ లో కనిపిస్తోంది.

ఇందులో రజిత్ కపూర్ - దిబ్యేందు భట్టాచార్య - శిశిర్ శర్మ - సబ్యసాచి చక్రవర్తి మరియు దీష్ మారివాలా తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. యాక్షన్ ఘట్టాలు - విజువల్స్ మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ దీనికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మొత్తం మీద యాక్షన్‌ & ఎమోషన్స్ తో కూడిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది.

‘కోడ్ నేమ్: తిరంగ’ చిత్రాన్ని టి-సిరీస్ ఫిల్మ్ గుల్షన్ కుమార్ మరియు రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ తో పాటు ఫిల్మ్ హ్యాంగర్ సంస్థ సమర్పిస్తోంది. భూషణ్ కుమార్ - రిభు దాస్‌ గుప్తా - వివేక్ బి అగర్వాల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2022 అక్టోబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

 
 
Show comments
More