తెలంగాణాలో టీడీపీ రీ ఎంట్రీ ... అక్కడ నుంచేనట...

Tap to expand
తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణా గడ్డ మీద. ఆ మాటకు వస్తే తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు భావి వారసుడు లోకేష్ ఈ రోజుకీ  ఉంటున్నది కూడా తెలంగాణాలోనే. టీడీపీకి బ్రహ్మాండమైన  పార్టీ ఆఫీస్ హైదరాబాద్ లో ఉంది. నాయకులు అయితే లేకపోవచ్చు కానీ ఈ రోజుకు కూడా పార్టీ అంటే ఇష్టపడే క్యాడర్ ఉంది. విభజన తరువాత టీడీపీని కేవలం ఏపీకి మాత్రమే పరిమితం చేయడం వల్ల వచ్చిన ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఫలితంగా టీడీపీ తెలంగాణాలో చిక్కి శల్యమైంది.

దానికి తెలంగాణా వాదం టీయారెస్ చేసిందే ఎక్కువ అని ఎవరైనా అనుకుంటే అంతకంటే ఎక్కువగా సొంత పార్టీ అధినాయకత్వం కూడా చేటు చేసింది అని చెప్పుకోవాలి. తెలంగాణాలో పార్టీని లేదనుకుని కాదనుకుని చంద్రబాబు ఇప్పటికి ఏడేళ్ళ క్రితం చలో బెజవాడ అంటూ పరుగులు తీయడం వ్యూహాత్మకమైన తప్పిదంగానే చూస్తారు. ఆ తరువాత అయినా పరిస్థితిని సర్దుకున్నారా అంటే అదీ లేదు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలసి పోటీ చేసి బొక్క బోర్లా పడ్డారు. అసలు టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా. దాంతో ఈ ఎత్తుగడలు ఏవీ పారలేదు.


మొత్తానికి నాలుగేళ్ళుగా టీడీపీ తెలంగాణాలో ఇంకా బక్కచిక్కింది. ఈ నేపధ్యంలో సడెన్ గా అక్కడ కూడా పార్టీని డెవలప్ చేస్తాను అని అధినాయకత్వం అనడమే కాస్తా ఆసక్తిని రేపే విషయం. బాబు ఆ మధ్యన తెలంగాణా టూర్లో టీడీపీని పటిష్టం చేస్తామని చెప్పారు. ఇపుడు ఆ దిశగా అడుగులు పడుతున్నాయనుకోవాలి.

లేటెస్త్ గా కరీం నగర్ పార్లమెంట్ అధ్యక్షుడిగా వంచె శ్రీనివాస్ రెడ్డిని నియమించారు. అదే విధంగా పలు శాసనసభ నియోజకవర్గాల ఇంచార్జీలను నియమించారు. అలా  కనుక చూస్తే కంటోన్మెంట్ కి  గడ్డి పద్మావతి అంబర్పేటకు  రాగిపణి ప్రవీణ్ కుమార్ అలియాస్ బిల్డర్ ప్రవీణ్ జనగాంకి రామిని హరీశ్ ను. ఇక సిరిసిల్లకు  అవునురి దయాకర్ రావులను నియమిస్తూ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.

మరో వైపు టీడీపీకి చూస్తే ఖమ్మం హైదరాబాద్ వరంగల్ నిజమబాద్ కరీం నగర్ వంటి చోట్ల ఒక మోస్తరుగా బలం ఉంది. దాన్ని పెంచుకోవడానికి క్యాడర్ ని యాక్టివ్ చేయడానికి ఈ నియామకాలు చేపట్టారు అంటున్నారు. రానున్న రోజుల్లో బలమున్న చోట ఇంచార్జిలను నియమించడం ద్వారా 2023లో జరిగే ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా తమ పాత్ర ఉండేలా తెలంగాణా కొత్త అసెంబ్లీలో టీడీపీ మెరిసేలా బాబు చర్యలు తీసుకుంటున్నారు అని అంటున్నారు.
Show comments
More