హీ మాన్ : పంజాబ్ సీఎం పెళ్ళి కొడుకాయెనే...

Tap to expand
ఆయన జీవితంలో ఇది మరో కీలక ఘట్టం. ఆరేళ్ళుగా ఒంటరిగా ఉన్న ఆయన ఇపుడు జంటగా కనిపించబోతున్నారు. ఆయనే ఈ మధ్య జరిగిన పంజాబ్ ఎన్నికల్లో ఆప్ పార్టీ తరఫున గెలిచి సీఎం పీఠమెక్కిన భగవంత్ సింగ్ మాన్.

ఆయన గురువారం ఉదయం డాక్టర్ గురుప్రీత్ సింగ్ అనే మహిళతో కలసి జీవితాన్ని పంచుకోనున్నారు. నిరాడంబరంగా అతి కొద్ది మంది మిత్రులు సన్నిహితుల సమక్షంలో జరగనున్న ఈ వేడుక భగవంత్ సింగ్ మాన్ జీవితాన్ని మలుపు తిప్పే కీలక ఘట్టంగా మారుతోంది.


ఇంతకు ముందు మాన్ కి ఇంద్రప్రీత్ సింగ్ తో  పెళ్ళి అయింది. అయితే ఆరేళ్ళ క్రితం ఇద్దరూ విడిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఆమె ప్రస్తుతం తన పిల్లలతో కలసి అమెరికాలో స్థిరపడ్డారు. ఇక చాన్నాళ్ళుగా ఒంటరిగా ఉంటున్న భగవంత్ సింగ్ మాన్ తన తల్లి సోదరిల వత్తిడి మేరకు ఇంటివాడు కాబోతున్నాడు. ఈ పెళ్ళికి ముఖ్య అతిధిగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా హాజరుకానుండండం విశేషం.

ఇక మాన్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆయన 1973 అక్టోబర్ 17న పంజాబ్ లోని సంగ్రూర్ జిల్లాలో జన్మించారు. చిన్ననాటి నుంచి కళలు హాస్యం పట్ల మక్కువ కనబరచే మాన్ అనతికాలంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన రాజకీయాల్లోకి రాక ముందు జుగ్నూ కెహెందా హై జుగ్నూ మస్త్ మస్త్ వంటి టీవీ షోల ద్వారా బాగా పాపులర్ అయ్యారు.

ఇలా మంచి కమెడియన్ గా గుర్తింపు పొందిన ఆయన 2011లో రాజకీయాల్లోకి వచ్చారు. మొదట ఆయన చేరిన పార్టీ పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్. ఆ పార్టీ తరఫున 2012లో లెహ్రా అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఇక ఆ తరువాత ఆప్ లో చేరి 2014లో ఏకంగా ఎంపీ సీటుకే గురి పెట్టి గెలిచారు.

ఇక ఈ ఏడాది మార్చిలో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాన్ తన చరిష్మాను రుజువు చేసుకున్నారు. బ్రహ్మాండమైన  మెజారిటీతో ఆప్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టింది. అలా కొన్ని నెలల క్రితం రాజ్యలక్ష్మిని వరించిన మాన్ ఇపుడు తన ఇంటికి గృహ లక్ష్మిని తెచ్చుకుంటున్నారు. మొత్తానికి ఏ రంగమైనా వీరంగమే అంటూ ఆయన హీ మాన్  అనిపించేసుకుంటున్నారు.
Show comments
More