ఎన్టీఆర్ కోసం అనుకుంటే గోపీచంద్ రెడీ అవుతున్నాడే!

Tap to expand
స్టార్ డైరెక్టర్లు అందరూ కూడా స్టార్ హీరోల చుట్టూనే కథలు పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఇక స్టార్ హీరోలంతా కూడా తాజాగా ఏ డైరెక్టర్ పెద్ద హిట్ ఇచ్చాడా అనేది చూసుకుని చర్చలకు దిగుతుంటారు. దాదాపు ఇక్కడ ఎవరూ ఎవరి సమయాన్ని వృథా చేసుకుని ఒకరి కోసం వెయిట్ చేయడం జరగదు. దర్శకుల విషయానికి వస్తే తాము అనుకున్న హీరో ఫ్రీ అయ్యేలోగా మరో హీరోతో మరో ప్రాజెక్టును సెట్ చేసుకుంటారు. లేదంటే అదే కథను మరో హీరో దగ్గరికి తీసుకుని వెళ్లి బాడీ లాంగ్వేజ్ లో మార్పులు చేసుకుంటారు.

కోలీవుడ్ డైరెక్టర్ హరి కూడా ఇప్పుడు ఇదే పనిలో ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇక్కడ మన బోయపాటి మాదిరిగా  తమిళంలో మాస్ యాక్షన్ సినిమాలు చేయాలంటే 'హరి' పేరే చెబుతారు. ఆయన సినిమాల్లో మాస్ మసాలా ఎలా ఉంటుందనేది తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు.


ఎందుకంటే ఆయన దర్శకత్వంలో తమిళంలో విక్రమ్ హీరోగా రూపొందిన 'సామి' .. సూర్య హీరోగా ఆయన తెరకెక్కించిన 'సింగం' సిరీస్ తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చాయి. అందువలన హరి మార్క్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు.

అలాంటి హరి ఆ మధ్య ఎన్టీఆర్ కి కథను వినిపించినట్టుగా ఒక వార్త షికారు చేసింది. అప్పటికి ఆయన 'ఆర్ ఆర్ ఆర్' పనులతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత ఆయన అనుకున్న దర్శకుల జాబితా వేరే ఉంది. అందువలన ఎన్టీఆర్ ఇప్పట్లో అందుబాటులోకి రావడం కష్టమే అనే విషయం హరికి అర్థమైంది.

దాంతో ఆయన ఆ కథను గోపీచంద్ కి వినిపించాడట. ఆ కథ నచ్చడంతో వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టుగా సమాచారం. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్ర .. తన  ఇమేజ్ కి తగిన కథ కావడంతో ఆయన ఓకే అన్నాడట.

గోపీచంద్ కి ఇక్కడ మాస్ యాక్షన్ ఇమేజ్ ఉంది. ఇక హరి సినిమాలన్నీ కూడా దాని చుట్టూనే తిరుగుతాయి. అందువలన అలాంటి కథతోనే ఆయనను ఒప్పించేసి ఉంటాడు. హరి దర్శకత్వంలో రూపొందిన 'ఏనుగు' తమిళంతో పాటు తెలుగులోను నిన్న విడుదలైంది. తమిళంలో ఎలా ఆడుతుందో తెలియదుగానీ .. ఇక్కడ మాత్రం థియేటర్స్ వచ్చిన సంగతి కూడా చాలామందికి తెలియదు. హరి కంటే ముందు శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ ఒక సినిమాను చేయవలసి ఉంది మరి.
Show comments
More