మినీ రివ్యూ: 'బ్రో డాడీ'

Tap to expand
మలయాళ స్టార్ హీరోలు మోహన్ లాల్ - పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ''బ్రో డాడీ''. 'లూసిఫర్' తర్వాత పృథ్వీరాజ్ స్వీయ దర్శకత్వంలో వీరిద్దరూ కలిసి నటించిన సినిమా ఇది. ఇందులో మోహన్ లాల్ సరసన మీనా.. పృథ్వీరాజ్ కు జోడీగా కల్యాణీ ప్రియదర్శిన్ హీరోయిన్లుగా నటించారు. లాలూ అలెక్స్ - కనిక - సౌబిన్ షాహిర్ - ఉన్ని ముకుందన్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఆంటోనీ పెరుంబవూరు ఈ చిత్రాన్ని నిర్మించారు.

కరోనా నేపథ్యంలో ''బ్రో డాడీ'' చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ విధానంలో డిస్నీ + హాట్ స్టార్ లో విడుదల చేసారు. 'దృశ్యం 2' తర్వాత మోహన్ లాల్ నుంచి నేరుగా డిజిటల్ వేదికపై రిలీజైన సినిమా ఇది. ప్రమోషన్ కంటెంట్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ముఖ్యంగా ప్రధాన పాత్రలు పోషించిన మోహన్ లాల్ - పృథ్వీరాజ్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి.


'బ్రో డాడీ' కథ విషయానికొస్తే.. జాన్ కట్టడి (మోహన్లాల్) మరియు అన్నమ్మ (మీనా సాగర్) దంపతుల ఏకైక కొడుకు ఈషో (పృథ్వీరాజ్ సుకుమారన్). బెంగళూరులో జాబ్ చేస్తూ సీక్రెట్ గా తమ ఫ్యామిలీ ఫ్రెండ్ కుమార్తె (కల్యాణీ ప్రియదర్శన్)తో లివ్-ఇన్-రిలేషన్ షిప్ కొనసాగిస్తూ ఉంటారు. అయితే పెళ్లీడుకు వచ్చిన కోరుకున్న జాన్ మళ్ళీ తండ్రి కాబోతున్నాడని తెలిసిన తర్వాత తండ్రీకొడుకులు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని బయటకు తెలియనీయకుండా తనయుడి పెళ్లికి తండ్రి ఎలా సహకరించడానేదే మిగతా కథ.

ఎప్పటిలాగే మోహన్ లాల్ ఈ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచారు. ఈ సినిమా కథంతా ఆయన పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఒక తండ్రి తన కొడుకుకు సోదరుడుగా మరియు స్నేహితుడిగా మారి అతని సమస్యను ఎలా పరిష్కరిస్తాడనే ఈ కథ. హ్యూమర్ మరియు ఎనర్జీతో కూడిన తండ్రి పాత్రను కంప్లీట్ యాక్టర్ చాలా సులువుగా డీసెంట్ గా పోషించారు. అయోమయమైన పరిస్థితుల్లో ఉన్న కొడుకుగా పృథ్వీరాజ్ కూడా చాలా బాగా నటించారు. పృథ్వీరాజ్ తో మోహన్ లాల్ పంచుకున్న కెమిస్ట్రీ ఈ కామిక్ డ్రామాకి ప్రధాన బలంగా నిలిచింది. కళ్యాణి ప్రియదర్శన్ క్యూట్ గా కనిపించడమే కాదు.. తన అత్యుత్తమ నటన కనబరిచింది. మీనా - కనికా - లాలూ అలెక్స్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

మంచి స్టోరీ లైన్ ఎంచుకొని ఒక తీవ్రమైన సమస్యను ఫన్నీగా డీల్ చేస్తూ.. కామెడీ మరియు ఎమోషన్ రెండింటిని హ్యాండిల్ చేయడంతో దర్శకుడిగా పృథ్వీరాజ్ కు మంచి మార్కులు పడుతున్నాయి. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో రసవత్తరమైన స్క్రీన్ ప్లేతో కథ నడిపించినా.. సెకండాఫ్ లో సాగతీత సన్నివేశాలతో ల్యాగ్ అవడం ఈ సినిమాకు మైనస్ గా మారింది. అలానే కథనానికి అడ్డు తగిలే అనవసరపు కామెడీ సీన్స్ - ఓల్డ్ స్టైల్ క్లైమాక్స్ పై ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.  

ఆంటోని పెరుంబావూర్ నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి. అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ.. దీపక్ దేవ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అభినందనీయం. మొత్తం మీద సెకండాఫ్ లో కొన్ని సీన్స్ మినహాయిస్తే.. మోహన్ లాల్ మరియు పృథ్వీరాజ్ వంటి ప్రధాన పాత్రల అత్యుత్తమ ప్రదర్శనలతో వచ్చిన 'బ్రో డాడీ' చిత్రాన్ని సౌకర్యవంతంగా హోమ్ స్క్రీన్ మీద ఆస్వాదించవచ్చు.
Show comments
More