మధులిక.. వెన్నంటే ఉంటూ.. మరణంలోనూ భర్త వెంటే..

Tap to expand
ఆర్మీలో 42 ఏళ్ల సర్వీస్ అంటే మాటలు కాదు. అది కూడా అత్యున్నతస్థాయిలో ఉన్న వ్యక్తికి భార్యగా వ్యవహరించటం అంత సామాన్యమైన విషయం కాదు. తాజాగా జరిగిన ఘోర హెలికాఫ్టర్ ప్రమాదంలో కన్నుమూసిన బిపిన్ రావత్.. ఆయన సతీమణి మధులిక రావత్ కూడా ఉన్నారు.

మొత్తం పద్నాలుగు మంది ఉసురు తీసిన ఈ ఘోర ప్రమాదంలో మధులిక మరణం పలువురిని తీవ్రంగా వేధిస్తోంది. హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన ఆమె శరీరం.. ముద్దలు ముద్దలుగా మారినట్లుగా చెబుతున్నారు. ఆర్మీలో పని చేసే వారి భార్యలకు ఉండే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు.


ఏ భర్త కూడా భార్యకు.. ఇంటికి ఎక్కువ సమయాన్ని ఇవ్వకపోవటం తెలిసిందే. ఉద్యోగ పరంగా భర్తకు ఎదురయ్యే సమస్యల్నిఅర్థం చేసుకొని.. జీవితాన్నే కాదు.. కుటుంబ రథాన్ని నడిపే కీలక బాధ్యత ఆర్మీలో పని చేసే వారి సతీమణులకు ఉంటుంది. ఇందుకు తగ్గట్లే రావత్ సతీమణి మధులిక కూడా ఉండేవారు. భర్త వెన్నంటే ఉండే ఆమె.. చివరకు మరణంలోనూ తోడుగా ఉండటం అనూహ్యంగా చెప్పాలి. రావత్.. మధులిక దంపతులకు ఇద్దరు కుమార్తెలు.

వారు క్రతిక రావత్.. మరొకరు తరణి రావత్. ఉద్యోగ పరంగా భర్త బిజీగా ఉంటే.. మధులిక ఆయనకు సపోర్టింగ్ గా ఉంటూ.. అమర వీరుల సతీమణులకు అండగా నిలిచేవారు. దేశంలోని అతి పెద్ద ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ను ఆమె స్థాపించారు. సైనిక కుటుంబాల సంక్షేమం కోసం ఈ స్వచ్ఛంద సంస్థ పని చేస్తుంది.
ఈ సంస్థ ద్వారా అమరవీరుల భార్యలకు అండగా నిలిచేలా మధులిక ప్రయత్నిస్తుంటారు. ఎంతో మందికి సాయం చేశారు.

టైలరింగ్.. బ్యూటీషియన్ కోర్సులు.. చాక్లెట్లు.. కేకుల తయారీతో పాటు టైలరింగ్.. ఇతర రంగాల్లో వారికి శిక్షణ ఇప్పించి.. వారి కాళ్ల మీద వారు నిలబడేలా వారిని సిద్ధం చేసిన సత్తా ఆమె సొంతం. ఢిల్లీలో సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేసిన మధులిక తర్వాత చాలా కాలం సామాజిక సేవ చేస్తుండేవారు. ఆమె కుటుంబ విషయానికి వస్తే.. ఆమె తండ్రి దివంగత రాజకీయ నేత మ్రగేంద్ర సింగ్. మధ్యప్రదేశ్ లోని షాడోల్ వారి స్వస్థలం.

ఆమె క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచేవారు. వీర్ నారీస్ (ఆర్మీ వితంతువులు).. దివ్యాంగ బాలలకు మెరుగైన జీవితాన్ని అందించేందుకు ఆమె తీవ్రంగా శ్రమిస్తుంటారు. భారతదేశ మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ కు బాధ్యతలు వహిస్తున్న బిపిన్ రావత్ కు సతీమణిగా వ్యవహరిస్తున్న మధులిక.. ఆయన హోదాకు వన్నె తెచ్చేలా ఆమె తీరు ఉండేది.

వీరిద్దరిది అన్యోన్య జీవితంగా పలువురు అభివర్ణిస్తుంటారు. భర్త వెన్నంట ఉండే ఆమె.. చివరకు భర్త మరణంలోనూ తోడుగా నిలవటం పలువురిని కన్నీటి పర్యంతం అయ్యేలా చేస్తోంది. ఇతరులకు సాయం చేయాలనే గొప్పగుణం ఆమె సొంతమని పలువురు అభిప్రాయపడుతుంటారు.
Show comments
More