ఆరాచకం.. వాడేసిన మాస్కులతో పరుపుల తయారీ.. ఈ వ్యాపారిని ఏం చేయాలి?

Tap to expand
ఉగ్రవాదానికి మించిన ముప్పు సమాజానికి మరొకటి ఉండదని అనుకుంటాం. కానీ.. తాజా ఉదంతం వింటే.. ఉగ్రవాదానికి ఏ మాత్రం తీసిపోని ప్రమాదకరమైన వ్యక్తులుగా వీరు కనిపిస్తున్నారు. దేశాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా కిందా మీదా పడుతున్న వేళ.. కక్కుర్తితో చేసే కొన్ని వ్యాపారాల్ని చూస్తే.. వీరు మనుషులేనా? అన్న సందేహం కలుగక మానదు. దేశంలో నమోదయ్యేకేసుల్లోయాబై శాతానికి పైనే కేసులతో వణికిపోతున్న మహారాష్ట్రలోనే ఈ దారుణ వ్యాపారం వెలుగు చూడటం గమనార్హం.

ఆ రాష్ట్రంలోని జలగావ్ జిల్లాలో పోలీసులకు అందిన సమాచారం విని వారు అస్సలు నమ్మలేదు. ఏదో ఆకతాయి చేశారని భావించారు. ఎందుకైనా మంచిదని చెక్ చేయటానికి వెళ్లిన వారు.. అక్కడ సీన్ చూసి.. వణికిపోయారు. వాడి పారేసిన మాస్కులతో పరుపుల్ని తయారు చేస్తున్న వైనం చూసి.. వారి నోట మాట రాలేదు. స్థానిక వ్యాపారులు కొందరు లాభాల కక్కుర్తి కోసం పరుపుల తయారీలో కాటన్.. ఇతర పదార్థాలకు బదులుగా.. వాడిపారేసిన మాస్కుల్ని పరుపులుగా తయారు చేసేస్తున్నారు.

వారి గోదాముల్లో మాస్కుల గుట్టలు చూసి నోట మాట రాలేదు పోలీసులకు. వాడేసిన మాస్కుల్ని తాకాలంటేనే వణుకుతున్న వేళ.. ఏకంగా వాటితో పరుపులుతయారు చేసే తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది. అక్కడి మాస్కుల గుట్టల్ని తగలబెట్టేసిన పోలీసులు.. వ్యాపారుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ మాస్కుల్లో కరోనా పేషెంట్లు వాడినవి ఎన్నో. ఈ ఆలోచన వచ్చినంతనే వెన్నులో చలి పుట్టటం ఖాయం. ఈ ఉదంతం గురించి తెలిసినవారంతా ఈ కక్కుర్తి వ్యాపారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పుడు చెప్పండి.. వీరు ఉగ్రవాదుల కంటే ప్రమాదకారులు కాదంటారా?
Show comments
More