పాన్ ఇండియా స్టార్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా...?

Tap to expand
'డార్లింగ్' ప్రభాస్ ప్రస్తుతం 'రాధే శ్యామ్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కెరీర్లో 20వ చిత్రంగా రానున్న ఈ మూవీకి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకుణే హీరోయిన్ నటించనుంది. వీటితో పాటు ప్రభాస్ ''ఆదిపురుష్'' అనే స్ట్రెయిట్ హిందీ మూవీని అనౌన్స్ చేశాడు. ఓం రౌత్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని టీ-సిరీస్ భూషణ్ కుమార్ - క్రిషన్ కుమార్ నిర్మించనున్నారు. అయితే ఇప్పుడు ప్రభాస్ లైనప్ లో మార్పులు ఉండబోతున్నాయని తెలుస్తోంది.

కాగా జెట్ స్పీడ్ తో ప్రాజెక్ట్స్ కి ఓకే చెప్తూ వస్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. తాజాగా 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇండస్ట్రీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. ఇటీవల ప్రభాస్ ని కలిసి ప్రశాంత్ నీల్ ఓ యాక్షన్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ చెప్పాడని.. వెంటనే ఈ ప్రాజెక్ట్ కి ప్రభాస్ ఓకే చెప్పేసాడని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని 'కేజీఎఫ్' మేకర్స్ మరియు ప్రభాస్ హోమ్ ప్రొడక్షన్ గోపికృష్ణ బ్యానర్ పై నిర్మిస్తారట. అంతేకాకుండా ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ని ప్రభాస్ కెరీర్లో 21వ చిత్రంగా రాబోతోందంట. అంటే 'రాధే శ్యామ్' కంప్లీట్ అయిన వెంటనే ప్రభాస్ 'కేజీఎఫ్' డైరెక్టర్ తో జత కట్టనున్నాడట. ఆ తర్వాత 'ఆదిపురుష్' షూటింగ్ స్టార్ట్ చేస్తాడని తెలుస్తోంది. ఇక ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తైన తర్వాత నాగ్ అశ్విన్ సినిమాని పట్టాలెక్కిస్తాడని తెలుస్తోంది. దీనిని బట్టి చూసుకుంటే నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ ప్రభాస్ కెరీర్లో 23వ చిత్రంగా రానుందని తెలుస్తోంది.
Show comments