హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్ ఉదంతం

Tap to expand
హైదరాబాద్ లో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు అదుపు తప్పి భరత్ నగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై నుండి కింద పడిపోయింది. ఈ ఘటనలో సోహెల్ అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మంగళవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో కూకట్ పల్లి నుంచి సనత్ నగర్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ఘటన జరిగిన వెంటనే ..స్థానికులు పోలీసులకి సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ వారిని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమం గా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు దాదాపు 30 అడుగుల మీది నుంచి కింద పడింది. దీనితో కారు పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కారు కింద పడిన సమయంలో సంఘటనాస్థలంలో పెద్దగా ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పి పోయింది. మృతుడు సోహెల్ బోరబండలోని పండిట్ నెహ్రూ నగర్ కు చెందిన నివాసిగా పోలీసులు గుర్తించారు.

ఇకపోతే గత రెండు నెలల క్రితం గచ్చిబౌలిలోని బయో డైవర్సిటీ ఫ్లైఓవర్పై అతివేగం వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి బోల్తా కొట్టి ఫ్లైఓవర్ నుంచి కిందపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఇదే తరహా లో మరోసారి భరత్ నగర్ వద్ద ప్రమాదం జరగడంతో నగరవాసులు ఫ్లై ఓవర్ అంటేనే భయాందోళనకు గురౌతున్నారు.
Show comments