పెద్ద సాములోరు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు

Tap to expand
రెండు తెలుగు రాష్ట్రాల్లో పీఠాధిపతులు తక్కువే. మనతో పోలిస్తే కర్ణాటక రాష్ట్రంలో పీఠాధిపతుల పవర్ చాలా ఎక్కువ. ప్రజల్లో వారికుండే పలుకుబడి.. అభిమానం ఎక్కువ. ఇప్పటికి వారు ప్రజల్ని ప్రభావితం చేయగలుగుతారు. ఆ మాటకు వస్తే కర్ణాటక ఎన్నికల్లో పీఠాధిపతుల కీలకభూమికగా చెబుతారు. కర్ణాటకలోని ఉడిపి అష్ట మఠాల్లో కీలకమైన పెజావర మఠాధిపతి విశ్వేశ తీర్థ స్వామీజీ అనంత లోకాలకు పయనమయ్యారు. గడిచిన కొద్ది రోజులుగా అస్వస్థతో ఉన్న ఆయన ఈ రోజు తుది శ్వాస విడిచారు.

88 ఏళ్ల పెజావర మఠాధిపతి అస్వస్థత కారణంగా కేఎంసీ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో చేరిన తర్వాత ఆయన స్పృహలోకి రాలేదు. అయితే.. గతంలోనే ఆయన కోరిక మేరకు ఆదివారం ఉదయం ఉడిపి శ్రీకృష్ణ మఠానికి  తరలించారు. మఠంలోనే వెంటిలేటర్స్.. ఐసీయూ యూనిట్ ను ఏర్పాటు చేసి చికిత్సను అందించారు.

అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. లక్షలాది మంది భక్తుల్ని శోకసంద్రంలోకి ముంచెత్తుతూ ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. తొలుత న్యూమోనియా ఇబ్బందితో ఆసుపత్రిలో చేరిన ఆయనకు వైద్యులు చికిత్సను అందించారు. అనంతరం ఆయన ఆరోగ్యం మరింత విషమంగా మారింది. బ్రెయిన్ లో సమస్యలు రావటంతో ఆయన స్పృహ కోల్పోయారు. ఊహించని రీతిలో విషాదం ముంచుకొచ్చింది. స్వామీజీ తుదిశ్వాస విడిచిన సమాచారం తెలిసినంతనే కేంద్ర మాజీమంత్రి ఉమాభారతి ఉడిపి మఠానికి చేరుకున్నారు.  దీనిపై స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ..అశేష భక్తులు కోలుకునేలా మానసిక స్థైర్యం కలిగించాలని కృష్ణ భగవాణుడ్ని కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నారు.


Show comments