ప్రేమాయాణం న‌డిపాం..ఇప్పుడు తాళి అంతేన‌న్న జేసీ!

Tap to expand

కొన్నిసార్లు అంతే..రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల ముందు సిగ్గు.. మొహ‌మాటాల‌న్ని బ‌లాదూర్ గా క‌నిపిస్తాయి. ప‌వ‌ర్ చేతిలో లేని బ‌తుకు ఒక బ‌తుకేనా? అన్న‌ట్లుగా రాజ‌కీయ నేత‌లు మారిపోయిన వేళ‌.. వారి నోటి నుంచి ఎలాంటి మాట‌లు వ‌స్తాయ‌న‌టానికి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి మాట‌ల్ని చెప్పొచ్చు.

తాజాగా ఆయ‌నో మీడియా సంస్థ‌కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. త్వ‌ర‌లో బీజేపీలోకి టీడీపీ విలీనం అవుతుంద‌న్న అంచ‌నాను చెప్పిన ఆయ‌న‌.. ఊహించ‌ని రీతిలో మ‌రో వ్యాఖ్య‌ను చేశారు. తామే బీజేపీతో తాళి క‌ట్టించుకుంటున్నామ‌ని.. బీజేపీతో క‌లిసి మ‌ళ్లీ ప‌ని చేస్తామ‌న్నారు.

బీజేపీతో త్వ‌ర‌లోనే పార్టీ విలీనం అవుతుంద‌న్న ఆయ‌న‌.. ఇప్పుడేదో కొత్త‌గా తాము బీజేపీతో జ‌త క‌ట్ట‌టం లేద‌న్నారు. అదెలా అంటే? గ‌డిచిన ఐదేళ్ల టీడీపీ పాల‌న‌లో బీజేపీతోనే ప్రేమాయ‌ణం సాగించామ‌ని.. కాకుంటే ఇప్పుడు తాళి క‌ట్టించుకొని సంసారం చేస్తామ‌న్న వ్యాఖ్య చేయ‌టం గ‌మ‌నార్హం.

ఏపీలో అసెంబ్లీ కాదు.. ఏకంగా టీడీపీ మొత్తం బీజేపీలో విలీనం కావ‌టం ఖాయ‌మ‌న్న జేసీ బ్ర‌ద‌ర్ వ్యాఖ్య ఇప్పుడు పెను దుమారంగా మారింది. రాజ‌కీయంలో శాశ్విత మిత్రులు.. శ‌త్రువులు ఉండ‌ర‌ని.. మోడీకి బాబు స‌ల‌హాలు చాలా అవ‌స‌ర‌మ‌న్నారు. జేసీ నోటి నుంచి ఈ మాట‌ల‌న్ని వ‌చ్చిన టైమింగ్ తెలుసా? చంద్ర‌బాబు తాడిప‌త్రిలో ప‌ర్య‌టించిన సంద‌ర్భంలోనే కావ‌టం గ‌మ‌నార్హం.

ఇటీవ‌ల ధ‌ర్మ‌వ‌రం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్య‌నారాయ‌ణ ఢిల్లీకి వెళ్లి బీజేపీలో చేరిన నేప‌థ్యంలో జేసీ బ‌ద్రర్స్ కూడా పార్టీ మార‌తార‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. బాబు రాజ‌కీయ నాయ‌కుడు కాద‌ని.. ఆయ‌నో గొప్ప ఆర్థిక‌వేత్త‌గా జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి అభివ‌ర్ణించ‌టం విశేషం. ఇప్ప‌టివ‌ర‌కూ పార్టీని వీడిపోయే నేత‌ల్నే చూశాం..జేసీ సోద‌రుడి వ్య‌వ‌హారం చూస్తుంటే.. తాము మార‌ట‌మేకాదు.. పార్టీ మొత్తాన్ని బీజేపీలో క‌లిపే వ‌ర‌కూ వ‌దిలేలా క‌నిపించ‌ట్లేద‌ని చెప్ప‌క‌తప్ప‌దు.

 

Show comments
More