వచ్చే ఎన్నికల్లో వైసీపీ శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోతుంది!

Tap to expand
ఏపీ అసెంబ్లీ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేశారని.. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రాంనారాయణరెడ్డి మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఉండవల్లి శ్రీదేవిలను వైసీపీ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి మేకపాటి చంద్రశేఖరరెడ్డి వేర్వేరుగా మీడియా సమావేశాలు నిర్వహించి వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు.తన సస్పెన్షన్ను స్వాగతిస్తున్నానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. తాను రెండు నెలల ముందే వైసీపీకి దూరంగా ఉన్నానని గుర్తు చేశారు. కానీ.. ఎలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా సస్పెండ్ చేయడం సరికాదన్నారు. వైఎస్ కుటుంబానికి వీర విధేయులుగా ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలను వైసీపీ నుండి సస్పెండ్ చేయడంపై ముఖ్యమంత్రి జగనే సమాధానం చెప్పాలని కోటంరెడ్డి డిమాండ్ చేశారు.



ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తాము టీడీపీ నుంచి కోట్ల రూపాయలు తీసుకున్నామని ప్రభుత్వ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ఆరోపణలను కోటంరెడ్డి ఖండించారు. తాము అమ్ముడుబోయామంటున్న సజ్జల మరి టీడీపీ నుంచి వైసీపీలో చేర్చుకున్న నలుగురు ఎమ్మెల్యేలను ఎంతపెట్టి కొనుగోలు చేశారని సంచలన విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలకు ఎన్ని కోట్లు ఇచ్చారో సజ్జల చెప్పాలన్నారు.

పార్టీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ తుడిచిపెట్టుకుపోతుందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ఈ క్రమంలో కొందరు తనకు లాగా బహిరంగంగానే బయటకు వస్తున్నారన్నారు.

చాలా మంది వైసీపీలో ఉండి ఉడికిపోతున్నారని కోటంరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మరో పార్టీ కోసం వైసీపీ ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు 2024 ఎన్నికల కోసం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారన్నారు. రాష్ట్ర రాజకీయాల నుంచి వైసీపీ శాశ్వతంగా డిస్మిస్ అవుతుందన్నారు. రాజకీయ ప్రజా సునామీ రాబోతోందన్నారు. పట్టభద్రుల  ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే వచ్చే ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయన్నారు.

ప్రజా సమస్యలు పరిష్కరించాలని అడిగి అడిగి విసొగొచ్చి గట్టిగా మాట్లాడానని తనను లక్ష్యంగా చేసుకున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. పార్టీకి విధేయుడిగా ఉన్న తనపై నిఘా పెట్టారని విమర్శించారు. ప్రజాసమస్యలు ప్రస్తావిస్తే అనుమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాను అని తెలిపారు.

అలాగే మరో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. 2012లో తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి జగన్ కోసం ఎమ్మెల్యే పదవిని వదులుకుని వైసీపీలోకి వచ్చానని గుర్తు చేశారు. అప్పుడు తనకు జగన్ సీఎం అవుతాడో లేదో కూడా తెలియదన్నారు. అయినా ఆయనను నమ్మి కాంగ్రెస్ ను వదిలి వైసీపీలోకి వెళ్లామన్నారు. డబ్బులు కూడా పోగొట్టుకున్నానన్నారు. ఇంత చేసినా తనకు మంచి సత్కారం చేశారని మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పైగా తనతో అమర్యాదగా ప్రవర్తించారన్నారు.

తన గురించి వైసీపీ తక్కువగా అంచనా వేసిందన్నారు. తన నియోజకవర్గంలోకి తన వ్యతిరేకులను పంపి అవమానాలపాలు చేశారని మేకపాటి మండిపడ్డారు. ఈ పార్టీలో ఇక వేగడం కష్టమే అని భావిస్తున్న తరుణంలో తనను సస్పెండ్ చేశారన్నారు. ఇప్పుడు తనకు చాలా హ్యాపీగా ఉందని మేకపాటి వ్యాఖ్యానించారు.

వైసీపీలో 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కవని అసంతృప్తిగా ఉన్నారని మేకపాటి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో నమస్కారానికి ప్రతి నమస్కారం చేసే సంస్కారం కూడా లేదన్నారు. తాను వైసీపీకే ఓటేశానని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేశానని అసత్య ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఉదయగిరి నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర తనకు మాత్రమే ఉందన్నారు. వచ్చే ఎన్నికలు చాలా సీరియస్ గా జరుగుతాయన్నారు తనకు టికెట్ ఇవ్వనని మూడు నెలల క్రితమే జగన్ చెప్పారని మేకపాటి చంద్రశేఖరరెడ్డి అంగీకరించారు. టికెట్ ఇవ్వకపోయినా పదవి లేకపోయినా తన పని తాను చేసుకుంటానన్నారు. ఎమ్మెల్యేలకు గౌరవం ఇచ్చిన చరిత్ర రాజశేఖరరెడ్డిదనేని తెలిపారు. సీఎం జగన్ కు తన మీద వ్యతిరేకంగా చెబుతున్నారని మేకపాటి మండిపడ్డారు.
Show comments
More