నటీనటులు: కిరణ్ అబ్బవరం-కాశ్మీరా పరదేశి-మురళీ శర్మ-ప్రవీణ్-శుభలేఖ సుధాకర్-భరత్-ఆమని తదితరులు
సంగీతం: చేతన్ భరద్వాజ్
ఛాయాగ్రహణం: డేనియల్ విశ్వాస్
నిర్మాత: బన్నీ వాసు
రచన-దర్శకత్వం: మురళీ కిషోర్ అబ్బూరు
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్లోకి అడుగుపెట్టి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న యువ నటుడు కిరణ్ అబ్బవరం.. గత ఏడాది వరుసగా ఎదురు దెబ్బలు తిన్నాడు. అయితే గీతా ఆర్ట్స్ లాంటి పేరున్న సంస్థలో అతను చేసిన 'వినరో భాగ్యము విష్ణు కథ' ప్రామిసింగ్ మూవీలా కనిపించింది. మురళీ కిషోర్ అబ్బూరు అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం చక్కటి ప్రోమోలతో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. మహా శివరాత్రి కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.
కథ:
విష్ణు (కిరణ్ అబ్బవరం) తిరుపతికి చెందిన కుర్రాడు. చిన్నపుడే తల్లిదండ్రుల్ని కోల్పోయిన అతను తాత సంరక్షణలో పెరుగుతూ.. హైదరాబాద్ లో లైబ్రేరియన్ గా సెటిలవుతాడు. అతనికి దర్శన (కాశ్మీరా పరదేశి)తో అనుకోకుండా ఫోన్ ద్వారా పరిచయం అవుతుంది. యూట్యూబర్ అయిన కాశ్మీరా.. నెయిబర్ నంబర్ (మన ఫోన్ నంబర్ కు అటు ఇటు ఇటు ఉండే ఫోన్ నంబర్లు) కాన్సెప్ట్ మీద వీడియోలు చేసి ఫేమస్ అవ్వాలనుకుంటుంది. అలా విష్ణుతో పాటు శర్మ (మురళీ శర్మ)కు ఫోన్ చేసి పరిచయం చేసుకుంటుంది. ఇలా ఈ ఇద్దరినీ కలిసి వీడియోలు చేసే క్రమంలో దర్శన.. శర్మ హత్య కేసులో చిక్కుకుంటుంది. ఇంతకీ శర్మ ఎవరు.. తన నేపథ్యమేంటి.. అతణ్ని చంపిందెవరు.. ఈ కేసు నుంచి దర్శనను విష్ణు ఎలా బయటికి తీసుకొచ్చాడు అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
''కాన్సెప్ట్ తో మొదలై.. లవ్వూ కామెడీ మిక్సయి.. క్రైమ్ నుంచి సస్పెన్స్ వైపు సాగే ఇంటెన్స్ యాక్షన్ డ్రామా అనుకోండి''.. వినరో భాగ్యము విష్ణు కథ టీజర్లో హీరో కిరణ్ అబ్బవరం నోటి నుంచి వినిపించిన డైలాగ్ ఇది. టీజర్లో సందర్భానుసారం వాడుకున్నప్పటికీ.. తమ సినిమా ఎలా ఉండబోతోందో పరోక్షంగా ఈ డైలాగ్ ద్వారా చెప్పింది చిత్ర బృందం. ఈ డైలాగ్ వింటే ఇదొక మల్టీ జానర్ మూవీ అనే విషయం అర్థమైపోతుంది. ఐతే కొత్త దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తన తొలి చిత్రంలో అనేక జానర్లను మిక్స్ చేసి.. చాలా చెప్పేయాలని.. చేసేయాలని తాపత్రయపడిపోయాడు కానీ.. అందులో కొంతమేరే విజయవంతం అయ్యాడు. థ్రిల్లర్ అంశం వరకు బాగా డీల్ చేసిన అతను.. డ్రామాను అనుకున్నంతగా పండించలేకపోయాడు. లవ్.. కామెడీ విషయంలోనూ తడబడ్డాడు. కానీ కథలో చెప్పుకోదగ్గ మలుపులు ఉండడం.. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో రేకెత్తించడం వల్ల 'వినరో భాగ్యము విష్ణు కథ' ఎంగేజింగ్ గానే అనిపిస్తుంది. 'హై' ఇచ్చే అంశాలు లేకపోయినా.. సినిమా బోర్ అయితే కొట్టించదు.
నెయిబర్ నంబర్.. 'వినరో భాగ్యము విష్ణు కథ' ట్రైలర్లో హైలైట్ అయిన కాన్సెప్ట్. ఒక ఫోన్ నంబరుకి ఇటు అటు ఉండే నంబర్లకు ఫోన్ చేసి స్నేహం చేయడం అనే పాయింట్ తో ట్రైలర్లో బాగానే ఆసక్తి రేకెత్తించగలిగారు కానీ.. సినిమాలో ఈ కాన్సెప్ట్ చాలా సాధారణంగా అనిపిస్తుంది. కథ మొదలుపెట్టడానికి.. అలాగే ఒక కీలక మలుపు దగ్గర ఈ పాయింట్ వాడుకున్నారు కానీ.. అదేమంత ఎఫెక్టివ్ గా అనిపించదు. ఈ కాన్సెప్ట్ ను చాలా త్వరగా లైట్ తీసుకుంటారు. ఇక లవ్ ట్రాక్ సైతం సాధారణమే. హీరోయిన్ పాత్రను మరీ సిల్లీగా డిజైన్ చేయడంతో ప్రేమకథ పట్ల ఏ దశలోనూ ఆసక్తి రేకెత్తదు. హీరో హీరోయిన్లు-మురళీ శర్మ మధ్య వచ్చే కామెడీ సీన్లు ఓ మోస్తరుగా అనిపిస్తాయి. ప్రేక్షకులు నెమ్మదిగా ఆసక్తి కోల్పోతున్న దశలో వచ్చే క్రైమ్ ఎలిమెంటే సినిమాను ముందుకు నడిపిస్తుంది. మురళీ శర్మ పాత్రలోని నిగూఢత్వం క్యూరియాసిటీని పెంచుతుంది. ఇంటర్వెల్ ట్విస్టు బాగానే పేలింది. అది ద్వితీయార్ధం మీద ఆసక్తిని రేకెత్తిస్తుంది.
ముందు హీరోయిన్ దృష్టి కోణంలో క్రైమ్ సీన్ ను చూపించడం.. ఆ తర్వాత హీరో తన కోణంలో పరిశోధన చేయడం.. ఈ క్రమంలో ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చే ట్విస్టులు క్యూరియాసిటీని పెంచుతాయి. మురళీ శర్మ పాత్ర తాలూకు గుట్టంతా బయటికి వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్. మంచి క్రైమ్ థ్రిల్లర్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది ఇక్కడ. కానీ అంత కన్నింగ్ క్యారెక్టర్ని హీరో సింపుల్ గా పట్టేసుకోవడం కాకుండా కొంచెం హడావుడి జరిగి ఉంటే ఒక 'హై' వచ్చేది. సినిమాకు సెకండ్ పార్ట్ ఉన్నట్లుగా హింట్ ఇస్తూ పతాక సన్నివేశాలను కూడా మామూలుగా లాగించేశారు. క్లైమాక్సులో మెరుపులు ఉండేలా చూసుకుని ఉంటే.. 'విష్ణు కథ'కు ఇంకొంచెం ఎలివేషన్ వచ్చేది. అయితే ఇంటర్వెల్ ముందు వరకు సినిమా సాగిన తీరుతో పోలిస్తే.. అక్కడ్నుంచి మెరుగ్గానే అనిపిస్తుంది. మరీ అంచనాలు పెట్టుకోకుండా చూస్తే టైంపాస్ కు ఢోకా లేని సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ'. అంతకుమించి ఆశిస్తే కష్టమే.
నటీనటులు:
కిరణ్ అబ్బవరంలో మంచి ఈజ్ ఉంది. ఒక టిపికల్ స్టయిల్లో సాగే అతడి నటన.. డైలాగ్ డెలివరీ కుర్రకారుకు నచ్చుతాయి. తనకు నప్పే బాడీ లాంగ్వేజ్ చూపిస్తూ.. చిత్తూరు-కడప యాసలో డైలాగులు చెబుతూ ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నించాడు కిరణ్. తన పాత్ర అయితే అంత ప్రత్యేకంగా అనిపించదు. ఒక మామూలు కుర్రాడిలా కనిపిస్తాడు. తనకంటే మురళీ శర్మ క్యారెక్టర్ హైలైట్ అయింది. ఆయన బాగా చేశారు కూడా. హీరోయిన్ కాశ్మీరా పరదేశి చూడ్డానికి క్యూట్ గా.. బబ్లీగా అనిపిస్తుంది. నటన పరంగా తను ప్రత్యేకంగా చేయడానికి ఏమీ స్కోప్ లేకపోయింది. తన పాత్రను తేల్చిపడేశారు. సహాయ పాత్రల్లో శుభలేఖ సుధాకర్.. ఆమని.. ప్రవీణ్.. దేవీ ప్రసాద్.. వీళ్లంతా ఓకే.
సాంకేతిక వర్గం:
చేతన్ భరద్వాజ్ పాటలు బాగున్నాయి. 'ఓ బంగారం' పాట వినసొంపుగా ఉంది. మిగతా పాటలు కూడా ఓకే. నేపథ్య సంగీతంతోనూ చేతన్ ఆకట్టుకున్నాడు. బిట్ సాంగ్స్.. హమ్మింగ్స్ ను బాగా ఉపయోగించుకున్నాడు. డేనియల్ విశ్వాస్ ఛాయాగ్రహణం ప్లెజెంట్ గా అనిపిస్తుంది. గీతా ఆర్ట్స్-2 నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. కొత్త దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరులో విషయం ఉంది. తొలి సినిమాకు అతను కాంప్లికేటెడ్ కథను ఎంచుకున్నాడు. దాని వల్ల తెరపై కొంచెం గందరగోళం కనిపిస్తుంది. కానీ క్రైమ్ ఎలిమెంట్.. ట్విస్టుల వరకు అతను బాగా డీల్ చేశాడు. లవ్ ట్రాక్.. కామెడీ విషయంలో ఇంకొంచెం కసరత్తు చేసి ఉంటే బాగుండేది.
చివరగా: వినరో భాగ్యము విష్ణు కథ.. చూడదగ్గదే
రేటింగ్-2.75/5