సైరాపై వెంకయ్య కామెంట్ ఏంటంటే?

Tap to expand

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రంపై ప్రముఖుల ప్రశంసల వర్షం కురుస్తోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రగా తెరకెక్కిన ఈ చిత్రంలో టైటిల్ రోల్ చిరు నటించగా.. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఈ క్రమంలో ఈ చిత్రాన్ని చూడాలంటూ పలువురు రాజకీయ ప్రముఖులను కలుస్తున్న చిరు... బుధవారం ఢిల్లీ వెళ్లి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిశారు. తన వద్దకు వచ్చిన చిరుతో కలిసి వెంకయ్య కుటుంబసభ్యులు... అక్కడికక్కడే సైరా చిత్రాన్ని వీక్షించారు. అనంతరం సైరా చిత్రం భలే బాగుందంటూ వెంకయ్య వ్యాఖ్యానించారు. అంతేకాకుండా చిత్రంలో చిరు యాక్షన్ ఓ రేంజిలో ఉందంటూ వెంకయ్య ఆసక్తికర కామెంట్లు చేశారు.


సైరా చూసిన తర్వాత వెంకయ్య ఏమన్నారన్న విషయానికి వస్తే..  ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రపై సినిమా తీయడం చాలా గొప్ప నిర్ణయం. భారతదేశం స్వరూపాన్ని వలస పాలకుల నియంతృత్వ పాలన గురించి ఈ సినిమాలో చక్కగా చూపించారు. ఈ సినిమా వల్ల ప్రజల్లో దేశం మీద ప్రేమ మరింత పెరుగుతోంది. ఈ చిత్రంలో చిరంజీవి నటన చాలా బాగుంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నయనతార తమన్నా చాలా బాగా నటించారు. ఇలాంటి సినిమాలు ఇంకా రావాల్సిన అవసరం ఉంది. మేమిద్దరం(చిరంజీవి నేను) ఇప్పుడు రాజకీయాలను వదిలేశాం. మరిన్ని సినిమాలతో చిరంజీవి ప్రజలను రంజింప చేయాల’ని వెంకయ్య పేర్కొన్నారు. అలాగే చిత్ర నిర్మాత రామ్ చరణ్ - దర్శకుడు సురేందర్ రెడ్డి అభినందలు తెలిపారు.

ఇక తన కోరికను మన్నించి తన చిత్రాన్ని చూసిన వెంకయ్య నాయుడుపై చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన విలువైన సమయం వెచ్చించి మరీ వెంకయ్య ‘సైరా’ చిత్రాన్ని చూడటం చాలా సంతోషంగా ఉందని చిరంజీవి అన్నారు. వెంకయ్య రాజకీయ ప్రస్థానాన్ని కూడా గుర్తు చేసిన చిరు.. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెంకయ్య రాజకీయాల్లో ఎదిగారని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ కూడా అడిగానని చిరు తెలిపారు.

Show comments