ఆ రోజు ఊహించారా.. ఇంతటి ప్రభంజనమవుతుందని?

Tap to expand
సరిగ్గా ఏడాది కిందట ఇదే రోజు 'ఆర్ఆర్ఆర్' సినిమా రిలీజైంది. 'బాహుబలి' తర్వాత రాజమౌళి రూపొందించిన చిత్రమిది.. పైగా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లాంటి టాప్ స్టార్లు కలిసి చేసిన మల్టీస్టారర్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆకర్షణలున్న సినిమా ఇది. 'బాహుబలి' స్థాయిలో కాదు కానీ.. దీనికి కూడా హైప్ మామూలుగా లేదు.

యుఎస్లో ప్రిమియర్స్ నుంచి టాక్ బయటికి వచ్చింది. హీరోల ఇంట్రో సీన్లు.. ఇంటర్వెల్ బ్యాంగ్.. కొమరం భీముడో పాట.. ఇలా ఏ ఎపిసోడ్కు ఆ ఎపిసోడ్ అదరహో.. కానీ ఓవరాల్గా సినిమా 'బాహుబలి' స్థాయిలో లేదన్నది ముందుగా వచ్చిన టాక్.


తర్వాత కూడా మెజారిటీ జనాలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కొన్ని వెబ్ సైట్లు తక్కువ రేటింగ్ ఇచ్చాయి. సినిమాలో అది లేదు ఇది లేదు అంటూ కామెంట్లు కూడా చేశాయి. కట్ చేస్తే.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం 'ఆర్ఆర్ఆర్' అద్భుత విజయమే సాధించింది.

'బాహుబలి'ని అందుకోలేదు కానీ.. దీని స్థాయిలో ఇది బ్రహ్మాండంగా ఆడింది. వరల్డ్ వైడ్ రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయింది. అంతటితో 'ఆర్ఆర్ఆర్' కథ ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ అసలు కథ ఆ తర్వాతే మొదలైంది. నెట్ఫ్లిక్స్ ద్వారా డిజిటల్ వెర్షన్ రిలీజయ్యాక ఇంటర్నేషనల్ ఆడియన్స్ ఈ సినిమాకు కనెక్టయిన విధానం ఒక చరిత్ర.

హాలీవుడ్ సెలబ్రెటీలు చాలామంది ఈ సినిమా చూసి ఫిదా అయిపోయారు. అమెరికాలో ఆన్ డిమాండ్ మళ్లీ స్పెషల్ థియేట్రికల్ షోలు వేయాల్సిన పరిస్థితి. అలా మొదలైన 'ఆర్ఆర్ఆర్' సెకండ్ ఇన్నింగ్స్.. 'నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డు దక్కే వరకు సాగింది. మధ్యలో మరెన్నో అంతర్జాతీయ పురస్కారాలు 'ఆర్ఆర్ఆర్'ను వరించాయి.

జేమ్స్ కామెరూన్ స్టీఫెన్ స్పీల్బర్గ్ లాంటి లెజెండరీ డైరెక్టర్లు ఒక ఉద్వేగంతో 'ఆర్ఆర్ఆర్'ను రాజమౌళిని కొనియాడటం మొత్తం కథలో మేజర్ హైలైట్. ఏడాది ముందు 'ఆర్ఆర్ఆర్' రిలీజైనపుడు ఈ సినిమా ఈ స్థాయికి వెళ్తుందని రాజమౌళి సహా ఎవ్వరూ ఊహించి ఉండరన్నది స్పష్టం.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Show comments
More