నటీనటులు: వెంకటేష్ దగ్గుబాటి- రానా దగ్గుబాటి-సుర్వీన్ చావ్లా-ఆశిష్ విద్యార్థి-ఆదిత్య మీనన్ తదితరులు
సంగీతం: సంగీత్-సిద్దార్థ్
ఛాయాగ్రహణం: జయకృష్ణ గుమ్మడి
కథ: అనన్య మోడీ
మాటలు: బీవీఎస్ రవి
దర్శకత్వం: సుపర్ణ్ వర్మ-కరణ్ అన్షుమన్
ఇండియాలో కొంచెం లేటుగా ఊపందుకున్న వెబ్ సిరీస్ ట్రెండును బాలీవుడ్ ముందుగా అందిపుచ్చుకుంది. అక్కడ సైఫ్ అలీ ఖాన్.. అజయ్ దేవగణ్.. షాహిద్ కపూర్ లాంటి పెద్ద పెద్ద స్టార్లు టీవీ షోలు చేశారు. కానీ సౌత్ ఇండియాలో ఇప్పటిదాకా ఏ స్టారూ ఒరిజినల్స్ చేసింది లేదు. తొలిసారి విక్టరీ వెంకటేష్ లాంటి పెద్ద హీరో తన అన్న కొడుకు రానా దగ్గుబాటితో కలిసి చేసిన వెబ్ సిరీస్.. రానా నాయుడు. ఐతే లీడ్ రోల్స్ చేసింది మనవాళ్లే అయినా ఇది తీసింది మాత్రం బాలీవుడ్ దర్శక నిర్మాతలే. అమెరికన్ టీవీ సిరీస్ 'రే డొనోవన్' ఆధారంగా తెరకెక్కిన ఈ షో నెట్ ఫ్లిక్స్ ద్వారా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
ముందుగా కథ విషయానికి వస్తే.. రానా నాయుడు (రానా దగ్గుబాటి) సెలబ్రెటీల లొసుగులను కప్పిపుచ్చుతూ.. వాళ్లకు ఏ సమస్య వచ్చినా తన నెట్వర్క్ సాయంతో పరిష్కరించే ఒక కన్సల్టంట్. ఇందుకోసం డబ్బు.. అధికారం.. క్రిమినల్స్.. ఇలా అవసరమైన ప్రతి మార్గాన్నీ వాడుతుంటాడు. ముంబయిలో ఎప్పటికప్పుపడు కొత్త సెలబ్రెటీ క్లయింట్లను తన లిస్టులో చేర్చుకుంటూ ఎదుగుతున్న అతడికి తన తండ్రి నాగ నాయుడు (వెంకటేష్ దగ్గుబాటి)తోనే సమస్య మొదలవుతుంది. తాను చేయని హత్యకు 15 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన నాగ జైలు నుంచి బయటికి రాగానే తన కుటుంబ సభ్యులను కలవడానికి ప్రయత్నిస్తాడు. కానీ తమ కుటుంబం విచ్ఛిన్నం కావడానికి నాగనే కారణమని భావించే రానా.. తన ఇద్దరు సోదరులే కాక తన భార్యా పిల్లలు నాగతో కలవడానికి ఏమాత్రం ఇష్టపడడు. అయినా నాగ వాళ్లకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తాడు. ఈలోపు రానాకు వేరే సమస్యలు తలెత్తుతాయి. అతణ్ని ఒక సీబీఐ ఏజెంట్ టార్గెట్ చేస్తాడు. రానా క్లయింట్లకు కూడా ఇబ్బందులు మొదలవుతాయి. మరోవైపు తాను జైలుకి వెళ్లడానికి కారణమెవరో తెలుసుకునే పనిలో నాగ ఉంటాడు. మరి తనకు వ్యతిరేకంగా కుట్ర చేసిందెవరో నాగ కనిపెట్టాడా.. మరోవైపు రానా తన సమస్యల్ని ఎలా పరిష్కరించుకున్నాడు.. వీళ్లిద్దరి మధ్య గొడవ ఎక్కడిదాకా వెళ్లింది.. ఈ విషయాలన్నీ తెరమీదే చూసి తెలుసుకోవాలి.
విక్టరీ వెంకటేష్ అంటే కుటుంబ సమేతంగా చూసే సినిమాలకు కేరాఫ్ అడ్రస్. యాక్షన్ టచ్ ఉన్న సినిమాలు చేసినా సరే.. అవి 'క్లీన్'గా ఉండేలా జాగ్రత్త పడతాడు వెంకీ. ఆయన సంభాషణలు ఎక్కడా హద్దులు దాటవు. హింస కూడా మరీ మోతాదు మించకుండా చూసుకుంటాడు. తన ప్రతి సినిమా కుటుంబ సమేతంగా చూసి ఆనందించాలని కోరుకునే హీరో.. 'రానా నాయుడు' ప్రెస్ మీట్లో మాత్రం తన అరంగేట్ర టీవీ షోను మాత్రం ఫ్యామిలీతో కలిసి చూడొద్దని చెప్పడం గమనార్హం. 'రానా నాయుడు' ట్రైలర్లో 'మడిచి జీలో పెట్టుకో' లాంటి డైలాగులకే వెంకీ ఫ్యాన్స్ షాకైపోయారు. ఇక ఈ సిరీస్ ఆరంభమయ్యాక పది నిమిషాలు తిరిగేసరికే.. వెంకీ ఎందుకలా హెచ్చరించాడో అర్థమైపోతుంది. ఇందులోని సన్నివేశాల గురించి ఇక్కడ రాతల్లో పైపైన చెప్పాలన్నా సరే చాలా రోతగా అనిపిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. నాగ పాత్రతో వెంకీతో చెప్పించిన డైలాగులు.. ఇప్పించిన హావభావాలు.. తెరపై దాంతో చేయించిన పనులు చూస్తే... దశాబ్దాల కెరీర్లో వెంకీ ఎంతో కష్టపడి సంపాదించుకున్న 'ఫ్యామిలీ హీరో' ఇమేజ్ ను పనిగట్టుకుని చెడగొట్టడానికి ఏదో కుట్ర జరిగిందేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. హీరోలు ఒక ఇమేజ్ కు పరిమితం కాకుండా.. ఒక ఛట్రంలో ఇరుక్కుపోకుండా మేకోవర్ కోసం ప్రయత్నించడం.. భిన్నమైన క్యారెక్టర్లు చేయడం అవసరమే కానీ.. నాగ పాత్రతో దారుణమైన బూతులు మాట్లాడించి.. వల్గర్ పనులు చేయించడం తప్పితే అందులో విషయం లేకపోవడమే విచారకరం. వెంకీని ఏ రకంగా ఇష్టపడ్డవాళ్లయినా సరే.. 'రానా నాయుడు' చూశాక తీవ్రంగా చింతించేలా ఆయన పాత్ర.. ఈ సిరీస్ తయారయ్యాయి.
క్రైమ్ కథల్ని.. అందులోని పాత్రలను సహజంగా తెరమీద ప్రెజెంట్ చేయాలంటే.. రా అండ్ రస్టిక్ ఫీల్ తీసుకురావాలంటే కొన్ని బూతు మాటలు అనివార్యం కావచ్చు. కొన్ని సన్నివేశాలు కూడా కాస్త పచ్చిగా చూపించాల్సి రావచ్చు. సినిమాలకు సెన్సార్ అడ్డంకులుంటాయి.. టీవీ షోలకు ఆ ఇబ్బంది లేదు కాబట్టి ఫిలిం మేకర్లకు ఇక్కడ స్వేచ్ఛ లభిస్తుంది. అంతమాత్రాన ప్రతి డైలాగులో పచ్చి బూతులు.. ప్రతి పది నిమిషాలకో నాటు శృంగార సన్నివేశం.. అందులోని వైల్డ్ యాంగిల్సూ చూపించాలా? అసలు తెరపై కనిపించే ప్రతి పాత్రకూ జీవితంలో 'సెక్స్' తప్ప ఇంకో ప్రయారిటీనే లేనట్లు ప్రెజెంట్ చేయాలా? ఇంటర్నేషనల్ సిరీస్ లు చూసి 'గ్రో అప్' అయిన ప్రేక్షకులకు సైతం 'రానా నాయుడు' చూస్తున్నపుడు నిజంగా అవసరమై ఈ డైలాగులు.. సన్నివేశాలు పెట్టారా అనే సందేహం కలగక మానదు. డైలాగులు.. సీన్లు అంత పచ్చిగా.. చాలా చోట్ల జుగుప్స కలిగించేలా ఉన్నాయి. Bold... Dark.. Raw.. Rustic.. ఇలాంటి మాటల్ని అడ్డు పెట్టుకుని చాలా సన్నివేశాల్లో హద్దులు దాటిపోయారు. పోనీ కథాకథనాలకు అవసరమైన అవన్నీ పెట్టారని అనిపించినా సమాధాన పడొచ్చు కానీ... ఏ దశలోనూ అలా అనిపించదు.
ఒక్కోటి 50-60 నిమిషాల పాటు సాగే పది ఎపిసోడ్లు ఉన్న'రానా నాయుడు'లో.. ఎంతో ఓఫిగ్గా చివరిదాకా చూసినా.. అసలు ఈ సిరీస్ తో ఏం చెప్పదలుచుకున్నారన్నది అర్థం కాదు. అసలు కథలో కాన్ఫ్లిక్ట్ పాయింటో ఏంటో కూడా అంతుచిక్కదు. అంతంత టైం తీసుకుని కూడా రానా చేసిన హీరో పాత్రకు.. వెంకీ చేసిన తండ్రి క్యారెక్టర్ కి మధ్యలో అసలు సంఘర్షణ ఎలా మొదలైందన్నది అర్థమయ్యేలా చెప్పలేకపోయారు. తన తండ్రిని ఒక కొడుకు విపరీతంగా అసహ్యించుకుని.. ఒక హత్యానేరాన్ని అతడి మీద మోపి 15 ఏళ్ల పాటు అకారణంగా జైలు శిక్ష అనుభవించేలా చేశాడు అంటే.. అందుకు బలమైన కారణం ఏదైనా ఉండాలి కదా? సన్నివేశాల రూపంలో చూపించకపోయినా కనీసం మాటల్లో అయినా ఆ కారణమేంటో చెప్పాలి కదా? కానీ ఈ కారణమేంటో తెలుసుకుందామని ఆరంభం నుంచి చివరి వరకు చూసి చూసి అలసిపోతాం తప్ప.. శుభం కార్డు పడ్డాక కూడా సమాధానం దొరకదు. ఇక ఇంత పెద్ద సిరీస్ తీసి ఏం సాధించినట్లు? ఈ కారణం తెలిసి దాంతో సమాధాన పడితే తప్ప అసలు కాన్ఫ్లిక్ట్ ను ఫీలయ్యేందుకు స్కోపే ఉండదు. ఇక్కడే 'రానా నాయుడు' గాడి తప్పేసింది. తెరపై బోలెడన్ని పాత్రలు కనిపిస్తాయి. చాలా వాటికి అసలు ఒక పర్పస్ అంటూ ఉండదు. లేడీ క్యారెక్టర్లు అయితే.. మగాళ్లను బెడ్ ఎక్కించి వాళ్లతో వైల్డ్ సెక్స్ చేయడానికి తప్ప ఇంకెందుకూ పనికి రానట్లుగా చూపించారు.
'రానా నాయుడు'లో కొంచెం విషయం ఉండి.. ఆసక్తికరంగా సాగే పాత్ర అంటే రానాది మాత్రమే. ఆ పాత్రలో అతడి పెర్ఫామెన్స్ కూడా ఆకట్టుకుంటుంది. ఈ పాత్రకు అతనే పర్ఫెక్ట్ అనిపించేలా పెర్ఫామ్ చేశాడు. దానికి మాత్రమే ఒక క్యారెక్టర్ గ్రాఫ్ కనిపిస్తుంది. కానీ మధ్యలో ఆ పాత్ర ఔచిత్యం కూడా దెబ్బ తినేలా ఒక 'సీన్' పెట్టారు. ఇక వెంకీ చేసిన నాగ నాయుడు పాత్ర గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఆరంభంలో ఈ క్యారెక్టర్ని చూసి ఏదో నిగూఢత్వం ఉందని ఫీలవుతాం. కానీ విషయం తక్కువ బిల్డప్ ఎక్కువ అన్నట్లుగా దాన్ని తేల్చిపడేశారు. అసలు ఈ పాత్ర మీద ఒక అంచనాకు రాలేని విధంగా గందరగోళంగా తయారు చేసి పెట్టారు. ''ఆ ఐస్ నా దగ్గరికి తీసుకురాకు నాలో ఉన్న వేడికి కరిగిపోతుంది''.. లాంటి తనకు ఏమాత్రం నప్పని డైలాగులను వెంకీ చాలా అయిష్టంగా చెప్పినట్లు.. ''ఈ మజిల్స్ పెరిగితేనే ఆ మసాజ్ బాగా చేస్తాం'' లాంటి డైలాగులు చెబుతూ హావభావాలు ఇచ్చే విషయంలో ఇబ్బంది పడ్డట్లు తెలిసిపోతుంది. సుర్వీన్ చావ్లా అందంగా.. ఆకర్షణీయంగా కనిపించింది. తన పాత్ర.. పెర్ఫామెన్స్ పర్వాలేదు. ఆదిత్య మీనన్.. ఆవిష్ విద్యార్థి.. రానా సోదరులుగా చేసిన ఇద్దరు నటులు.. మిగతా ఆర్టిస్టులు ఓకే. సంగీతం.. ఛాయాగ్రహణం.. నిర్మాణ విలువలు.. ఈ సిరీస్ కు అవసరమైన మేర ఉన్నాయి.
ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ లను ఎలా ఇండియనైజ్ చేయాలో తెలుసుకోవాలంటే 'ఫర్జీ' లాంటి షోలు ఉదాహరణ. 'బ్రేకింగ్ బ్యాడ్' స్ఫూర్తితో మన నేటివిటీతో ఆసక్తికరంగా ఆ సిరీస్ ను తీర్చిదిద్దారు రాజ్-డీకే. అందులోనూ బూతులుంటాయి. కానీ అవసరం మేరే. ఇండియన్ ఒరిజినల్స్ లో బెస్ట్ అనదగ్గ వాటిలో 'ఫ్యామిలీ మ్యాన్'.. 'సేక్రెడ్ గేమ్స్' లాంటి షోలను చెప్పొచ్చు. వాటిలోనూ కొన్ని శృంగార సన్నివేశాలుంటాయి. కానీ మరీ హద్దు దాటకుండా. ఇలాంటి షోల్లో కథాకథనాల మీదే ప్రధానంగా ఫోకస్ ఉంటుంది. కానీ 'రానా నాయుడు' అలా కాదు. ఇక్కడంతా పాత్రలతో ఎంత పచ్చి బూతులు మాట్లాడిద్దాం.. ఈ సన్నివేశంలో ఎవరిని బెడ్ ఎక్కించి ఏ వైల్డ్ యాంగిల్ ట్రై చేద్దాం.. ప్రేక్షకులకు ఇంకెంత జుగుప్స కలిగిద్దాం అన్నట్లే ఉంది తప్ప కథాకథనాల మీద దృష్టే ఉన్నట్లు అనిపించదు. 'రానా నాయుడు' లాంటి షోలు హాలీవుడ్ ఒరిజినల్స్ కు పేలవమైన అనుకరణల్లా అనిపిస్తాయి తప్ప.. ఇవి మన ప్రేక్షకులను ఏ రకంగానూ మెప్పించేవి కావు. అరచేతిలో పోర్న్ అందుబాటులో ఉన్న రోజుల్లో.. బోల్డ్ సీన్ల కోసం అయినా ఇలాంటి షోలు చూస్తారా అన్నది సందేహమే.
చివరగా: రానా నాయుడు.. బోల్తా కొట్టాడు
రేటింగ్-1.5/5