బాబు పవన్ ల మధ్య ఎంఓయూ కుదిరిపోయిందా...?

Tap to expand
చంద్రబాబు తెలుగుదేశం అధినేత. పవన్ కళ్యాణ్ జనసేనాని. ఇద్దరి మధ్య ఎంఓయూ ఏనాడో కుదిరిపోయిందని ప్రచారం సాగుతోంది. ఎంఓయూ అంటే తెలుసు కదా అవగాహన ఒప్పందం. ఈ ఇద్దరూ వ్యాపారం చేయడం లేదు రాజకీయంలో ఉన్నారు కాబట్టి దాన్ని పొత్తుగా అర్ధం చేసుకోవాలి. ఈ పొత్తులు కుదిరిపోతే ఇక హంగామా ఎందుకు. పొత్తుల మీద మాటలు ఎందుకు అంటే అది అంతా ఒక రకమైన బయటకు కనిపించే ప్రచారం మాత్రమే అని అంటున్నారు.

ఇక పవన్ బాబుల మధ్య ఎంఓయూలు  కుదిరిపోయాయని చెప్పింది ఎవరంటే వైసీపీ ఎమ్మెల్సీ సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు అయిన సి రామచంద్రయ్య. ఆయన ఒక తెలుగు పత్రికలో రాసిన రాజకీయ వ్యాసంలో పవన్ మీద చాలా విమర్శలు చేశారు. ప్రత్యేకించి ఆయన దశాబ్ద కాలంగా నడుపుతున్న జనసేన మీద ఎన్నో కామెంట్స్ చేశారు.


పవన్ బయటకు చెప్పేవి అన్నీ ఉత్త మాటలే అని ఎపుడో బాబు పవన్ ల మధ్యన పొత్తుల ఒప్పందం కుదిరిందని సి రామచంద్రయ్య అంటున్నారు. ఇక సీట్ల విషయం వస్తే పదిహేను నుంచి ఇరవై సీట్ల దాకా తీసుకుని పొత్తుకు సిద్ధపడాలని పవన్ భావిస్తున్నారు అని లోగుట్టు విప్పారు. అందుకోసమే జనసేన పార్టీలో ఒక్క నాదెండ్ల మనోహర్ తప్ప ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని పవన్ ప్రోత్సహించలేదని అన్నారు.

ద్వితీయ శ్రేణి నాయకత్వం కనుక బిల్డప్ అయితే వారు సీట్ల కోసం లొల్లి చేస్తారని తెలివిగానే పవన్ పార్టీని విస్తరించడంలేదన్న డౌట్ ని సి రామచంద్రయ్య వ్యక్తం చేశారు. ఈ లోగుట్టు తెలియక కాపు సేన నేత మాజీ మంత్రి చేగొండి హరి రామజోగయ్య కాపు సీఎం కావాలని పవన్ సీఎం కావాలని కోరుకుంటున్నారని అంటున్నారు.

ఇదిలా ఉంటే సి రామచంద్రయ్య మాటలనే తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ పొత్తు ఖాయమైపోయినట్లుగా భావించవచ్చునా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అనే అంటున్నాయి మరి. పవన్ కళ్యాణ్ నిజానికి ఒంటరిగా పోటీ చేయను అని తెగేసి చెప్పేశారు. ప్రయోగాలు తాను 2024 ఎన్నికల్లో చేయదలచుకోలేదని కూడా స్పష్టం చేశారు. పైగా మచిలీపట్నం సభలో పవన్ మీ మనసులో ఏముందో అదే జరుగుతుందని క్యాడర్ ని ఉద్దేశించి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

ఇక పవన్ పొత్తులతో వెళ్తామని పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. గౌరవప్రదమైన సీట్లు ఇస్తే పొత్తులు ఉంటాయని ఆయన అంటున్నారు. మరి పవన్ గౌరవప్రదమైన సీట్లు అంటూంటే వైసీపీ నేత సి రామచంద్రయ్య ఇరవై సీట్లు జనసేనకు ఇస్తారని చెబుతున్నారు. ఈ రెండింటికీ పొంతన అయితే లేదు. పైగా ఒప్పందాలు అన్నీ కుదిరాయని ఆయన అంటున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం ఉంది. పవన్ తాను సీఎం అవుతాను అని గట్టిగా ఎక్కడా చెప్పడంలేదు.

అదే టైం లో ఆయన ధీమాగా చెబుతున్న మాట ఏంటి అంటే ఏపీలో వైసీపీ గెలవదు. ఆ విషయంలో నేను కచ్చితంగా చెప్పగలను అనే అంటున్నారు. అంటే వైసీపీ గద్దె దిగితే ఏ పార్టీ వస్తుంది అన్నదే చర్చగా ఉంది. జనసేన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని పవన్ కి గౌరవప్రదమైన హోదాను ఆ పార్టీలో ఇస్తారని అంటున్నారు.

కానీ కాపులు మాత్రం పవన్ని సీఎం గా చూడాలని భావిస్తున్నారు. ఇక కాపు నేతలు అంతా కూడా టీడీపీతో పొత్తు పెట్టుకున్నా పవన్ కే పెద్ద పీట వేయాలని కోరుతున్నారు. హరి రామ జోగయ్య లాంటి వారు అయితే చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ఏపీకి పవన్ని సీఎం గా చేయాలని డిమాండ్ వినిపిస్తున్నారు.

మరి ఇవన్నీ తెలుగుదేశం చేస్తుందా అన్నదే ఇపుడు మిలియన్ డాలర్ ప్రశ్న. ఇక చంద్రబాబులో ఏమి చూసి పవన్ మద్దతు ఇస్తున్నారు అని సి రామచంద్రయ్య ప్రశ్నిస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు కాపు నేత ముద్రగడ పద్మనాభాన్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టారని దానికి ఏమైనా బాబు క్షమాపణలు చెప్పారా అని ఆయన నిలదీస్తున్నారు.

అదే విధంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో తెలుగుదేశం మీడియా అసత్య రాతలు రాసిందని అయినా పవన్ టీడీపీకే మద్దతు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారని ఆయన అడుగుతున్నారు. మొత్తానికి వైసీపీ నేతగా రామచంద్రయ్య పవన్ని నిలదీయవచ్చు కానీ మరీ బొత్తిగా ఇరవై సీట్లకు జనసేన  పొత్తు   పెట్టుకుంటుంది అంటే నమ్మడం కష్టమే అంటున్నారు.

అయితే జనసేన కోరినట్లుగా యాభై సీట్లను తెలుగుదేశం ఇవ్వకపోయినా రెండు పార్టీలకు ఆమోదంగా ఉండే విధంగానే సీట్ల  ఒప్పందం కుదరవచ్చు అని అంటున్నారు. వయా మీడియాగానే అది ఉంటుందని అంటున్నారు. మొత్తానికి జనసేన టీడీపీ పొత్తు ఖాయమని వైసీపీ సహా ఏపీ రాజకీయాలను అవగాహన చేసుకున్న వారి అందరికీ తెలిసిన విషయమే అంటున్నారు. అయితే రామచంద్రయ్య మాత్రం అంతా అయిపోయిందని చెప్పడమే ఇపుడు ఒక సంచలన వార్తగా చూడాలి మరి.
Show comments
More