తిరుమల కొండపైకి గంజాయి.. టీటీడీ ఉద్యోగి అరెస్ట్!

Tap to expand
తిరుమలలో గంజాయి అక్రమ రవాణా కలకలం రేపుతోంది. పవిత్ర హిందూ పుణ్యక్షేత్రమైన తిరుమలకు నిషేధిత వస్తువులు తరలిస్తున్నారని సమాచారం రావడంతో తిరుమలలో విజిలెన్స్ సిబ్బంది పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.

ఈ క్రమంలో లక్ష్మీ శ్రీనివాసం కార్పొరేషన్ సంస్థ తరుఫున వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న గంగాధరం అనే వ్యక్తిని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. తిరుపతిలోని అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద బ్యాగుతో అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఎస్ఈబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.


తనిఖీ చేయగా.. అతడి వద్ద 15 ప్యాకెట్లలో నింపిన 150 గ్రాముల గంజాయి పట్టుబడింది.  ఈ సందర్భంగా వాటిని చూసి అధికారులు అవాక్కయ్యారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు.

సాయంత్రం విడుదలైన ఓ వీడియోలో నిందితుడు గంజాయిని ప్లాస్టిక్ కవర్ లో చిన్న ప్యాకెట్లుగా ఉంచి వాటిని కాలికి కట్టుకొని తిరుమలకు వచ్చినట్టుగా ఉంది.

తిరుపతి తిరుమలకు తరచూ అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్నట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేసిన విజిలెన్స్ అధికారులు విచారణ నిమిత్తం తిరుమల ఎస్.ఈబీ పోలీసులకు అప్పగించారు. ఈ ఇష్యూ ఇప్పుడు తిరుమలలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొంతకాలంగా తిరుమలకు నిషేధిత వస్తువులు తరలిస్తున్న సమాచారంతో పలు ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. జీఎన్సీ టోల్ గేట్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టగా.. టీటీడీ క్వార్టర్స్ వద్ద కూలీల దగ్గర మద్యం సీసాలు లభించాయి. ఆ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.   


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Show comments
More