చిలుక సాక్ష్యంతో హంతకుడికి జీవిత ఖైదు

Tap to expand
ఆగ్రాకు చెందిన నీలమ్ శర్మ 2014 సంవత్సరంలో హత్యకు గురయ్యింది. ఆ రోజు నీలమ్ శర్మ భర్త విజయ్ శర్మ మరియు ఆమె తనయుడు ఒక ఫంక్షన్ కు వెళ్లారు. ఇంట్లో నీలమ్ శర్మ ఒంటరిగా పెంపుడు కుక్కతో ఉంది. అప్పుడు హంతకులు ఇంట్లోకి దూరి నీలమ్ శర్మను కత్తితో పొడిచి చంపేశారు. అడ్డు వచ్చిన పెంపుడు కుక్కను కూడా కత్తితో అత్యంత దారుణంగా చంపేశారు.

విజయ్ శర్మ మరియు ఆయన తనయుడు ఇంటికి వచ్చేప్పటికి రక్తపు మడుగులో నీలమ్ శర్మ మరియు పెంపుడు కుక్క పడి ఉండటాన్ని చూసి షాక్ అయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటన స్థలంలో ఏ ఒక్క క్లూ కూడా కనిపెట్టలేకపోయారు. వారికి ఏ ఒక్కరిపై కూడా అనుమానంగా లేదు. దాంతో పోలీసులు ఏం చేయాలో పాలుపోక జుట్టు పీక్కుంటున్న సమయంలో నీలమ్ శర్మ పెంపుడు చిలుక ఇచ్చిన వాంగ్మూలం హత్య కేసును ఒక కొలిక్కి తీసుకు వచ్చింది.


నీలమ్ హత్య జరిగినప్పటి నుండి పెంపుడు చిలుక సరిగా తినక పోవడంతో పాటు పదే పదే అరుస్తూ ఉందట. ముఖ్యంగా నీలమ్ మేనకోడలు అషు ఇంటికి వచ్చిన సమయంలో చిలుక కంటిన్యూ గా అరుస్తూనే ఉందట. దాంతో అనుమానం వచ్చిన విజయ్ శర్మ పోలీసులకు చిలుక విషయాన్ని చెప్పడంతో ఆ కోణంలో ఎంక్వౌరీ మొదలు పెట్టారట.

అనుమానితులుగా భావిస్తున్న వారిని చిలుక ముందు ఉంచిన పోలీసులు అషు ఉన్న సమయంలో ఎక్కువగా చిలుక అరుస్తూ ఉండటాన్ని గమనించారు. దాంతో అషును అదుపులోకి తీసుకుని ఎంక్వరీ చేయగా అసలు విషయం బయట పడింది. అయితే చిలుక సాక్ష్యం తో కేసును ముందుకు తీసుకు వెళ్లడం సాధ్యం కాదు.. కానీ చిలుక ఇచ్చిన లీడ్ తో కేసు ముందుకు సాగింది.

నీలమ్ ను హత్య చేసిన సమయంలో అషు మరియు ఆమె వెంట వెళ్లిన వ్యక్తిని కుక్క కరిచినట్లు పోలీసులు గుర్తించారు. అలా కేసు లో 9 ఏళ్ల తర్వాత నిందితులకు జీవిత ఖైదు శిక్ష పడింది. ఆ రోజు చిలుక కనుక అషు ను పట్టించుకుంటే కేసు ఇంకా ఒక కొలిక్కి వచ్చేది కాదంటూ పోలీసులు మాట్లాడుకుంటూ ఉన్నారు.
Show comments
More