కాగా విజయం సాధించి అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముఖ్య నేతలంతా ఎన్నికల బరిలో దిగుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య ఈసారి తన కుమారుడి స్థానమైన వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో సిద్ధరామయ్య ప్రముఖ చారిత్రక ప్రదేశం.. బాదామి నుంచి గెలుపొందారు. అయితే కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ సూచన మేరకు ఈసారి సిద్ధరామయ్య వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమయ్యారు.
మరోవైపు గత ఎన్నికల్లో వరుణ నుంచి పోటీ చేసిన సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు తొలి జాబితాలో సీటు దక్కలేదు. యతీంద్రను అసెంబ్లీ బరిలో కాకుండా లోక్ సభ ఎన్నికల బరిలో నిలుపుతారని తెలుస్తోంది. వాస్తవానికి కోలారు నుంచి సిద్ధరామయ్య పోటీ చేయాలని భావించారు. ఈ మేరకు పార్టీ అధిష్టానంతోనూ సంప్రదింపులు జరిపారు. గతంలో వరుణ చాముండేశ్వరిల నుంచి పలుమార్లు సిద్ధరామయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018 ఎన్నికల్లో సిద్ధరామయ్య బాదామి నుంచి పోటీ చేసి గెలిచారు.
ఇక మరో ముఖ్య నేత కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు శివకుమార్.. కనకపుర నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే.. చీతాపూర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మరో ముఖ్య నేత మాజీ ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర కోరటగెరె అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలను వారి వారసులను బరిలోకి దించుతోంది. ఆర్థిక అంగ బలాలు ఉన్న నేతలకే టికెట్లు ఇచ్చింది. బీజేపీ దూకుడును తట్టుకోవాలంటే ఆర్థిక అంగ బలాలు ఉన్న అభ్యర్థులే ముఖ్యమని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందుకే తొలి జాబితాలో ఉన్నవారిలో ఎక్కువ మంది సీనియర్ నేతలు వారి వారసులేనని అంటున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 124 మందితో కాంగ్రెస్ అధిష్టానం పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది.
కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సం«ఘం (ఈసీ) ఇంకా షెడ్యూల్ ప్రకటించలేదు. ఈ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన తొలి పార్టీ కాంగ్రెస్సే. బీజేపీ ఇంకా అభ్యర్థుల జాబితాను విడుదల చేయాల్సి ఉంది.