ఏపీ అసెంబ్లీలో జగన్ సెల్ఫ్ గోల్.. అమరావతి గ్రాఫిక్స్ కాదా?

Tap to expand
ఒక వాదాన్ని బలంగా వినిపించి.. దాన్ని కోట్లాది మంది నమ్మేలా చేయటం వరకు ఒకే. అందుకు భిన్నంగా సమయానికి తగ్గట్లుగా చెప్పే మాటలతో కొత్త కన్ఫ్యూజన్ కావటమే కాదు.. ఇంతకాలం చెప్పిన మాటలు తప్పా? అన్న భావన కలిగేలా చేయటం అంత మంచిది కాదు. తాజాగా అలాంటి పనే చేసినట్లుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఏపీ రాజధానిగా అమరావతి అంటూ బిల్డప్ ఇచ్చారే తప్పించి.. ఇంకేం చేయలేదని.. ఉత్తుత్తి గ్రాఫిక్స్ తోజనాల్ని మోసం చేసినట్లుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో సహా పలువురు పేర్కొన్నారు.


2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు కాస్త ముందుగా మొదలుపెట్టిన.. గ్రాఫిక్స్ అమరావతి అంశం చాలామందిలో నాటుకుపోయేలా చేసింది. ఉత్తుత్తి ఫోటోలు తప్పించి.. వాస్తవంగా అక్కడ ఏమీ జరగలేదన్న వైసీపీ వర్గాల వాదనను పలువురు నమ్మటమే కాదు.. అందుకు తగ్గట్లే తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటుతో తీర్పు చెప్పారు. 2019లో జరిగిన ఎన్నికల్లో దారుణ ఓటమిని ఎదుర్కొన్న చంద్రబాబు.. అలాంటి పరిస్థితికి కీలక కారణాల్లో ఒకటి రాజధాని అమరావతిలో ఏమీ జరగలేదని.. కేవలం గ్రాఫిక్స్ తో మేనేజ్ చేసిన విమర్శల్ని బలంగా నమ్మినట్లే ప్రజాతీర్పు కనిపించింది.

కట్ చేస్తే.. దగ్గర దగ్గర నాలుగేళ్లకు అమరావతి ఉత్తుత్తి గ్రాఫిక్స్ కాదనే కాదని.. అక్కడ డెవలప్ మెంట్ పనులు భారీగా జరిగిన విషయం తాజాగా సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలతో అర్థం కాక మానదు. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో మాట్లాడిన సీఎం జగన్.. అమరావతిలో రూ.7 వేల కోట్ల డెవలప్ మెంట్ పనులు చేసిన షాపూర్ జీ పల్లోంజీ నుంచి చంద్రబాబుకు కమిషన్ల రూపంలో రూ.143 కోట్లు అందినట్లుగా తాజాగా ఆరోపించారు.

ఈ ఆరోపణ ఒక ఎత్తు అయితే.. మరోవైపు అమరాతిలో ఒక కంపెనీ చేసిన పనులే రూ.7వేల కోట్లు అన్న విషయాన్ని జగన్ సర్కారు కన్ఫర్మ్ చేసిన నేపథ్యంలో.. మొత్తంగా రాజధాని అమరావతి కోసం చంద్రబాబు ఎంత ఖర్చు పెట్టి ఉంటారన్నది ఇప్పుడు చర్చగా మారింది.

ఉత్తుత్తి గ్రాఫిక్స్ కోసమే రూ.7వేల కోట్లు ఖర్చు పెట్టి ఉంటే.. జగన్ నోటి నుంచి వచ్చే మాటల్లో తీవ్రత మరో స్థాయిలో ఉండేదన్నది మర్చిపోకూడదు. ఇలాంటి వేళలో.. ఇంతకాలం అమరావతిలో గ్రాఫిక్స్ మాత్రమే ఉన్నాయంటూ చేసిన ప్రచారం తప్పేనా?  ఇలాంటి వ్యాఖ్యలతో జగన్ సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారా? అన్నది ఇప్పుడు చర్చగా మారింది.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Show comments
More