నిండు బాలింతకు భూతవైద్యం.. ప్రాణం పోయింది

Tap to expand
భూత వైద్యానికి ఓ బాలింత నిండు ప్రాణం బలి అయిపోయింది. బాలింతకు దెయ్యం పట్టిందని ఓ భూతవైద్యుడికి చూపించగా.. అతడు చిత్రహింసలుకు గురిచేయడంతో సృహ తప్పింది. వారం రోజులుగా ప్రాణాలతో పోరాడిన ఆమె తాజాగా ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది.

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాకకు చెందిన రజిత అనే యువతి ఏడాదిన్నర క్రితం మంచిర్యాల జిల్లా కుందారంకు చెందిన మల్లేష్ ను ప్రేమ వివాహం చేసుకుంది. రతితకు తల్లిదండ్రులు లేరు. వీరికి నాలుగు నెలల పాప ఉంది. పెళ్లయిన కొద్దిరోజుల నుంచి అనారోగ్యం పాలైన రజితకు దెయ్యం పట్టిందని భూతవైద్యుడితో వైద్యం చేయించారు. చేతబడికి గురైందన్న నెపంతో అతడు చిత్రహింసలు పెట్టాడు.

అత్తగారింట వద్ద కుందారంలో కుటుంబ సభ్యులు భూత వైద్యుడు శ్యామ్ ను రప్పించారు. అతడు తలవెంట్రుకలు లాగుతూ విచక్షణ రహితంగా కొట్టి మంచంపై పడేయడంతో రజిత తలకు గాయమైంది. సృహతప్పి పడిపోవడంతో అత్తింటి వారు రజితను కరీంనగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఐదురోజులుగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి ప్రాణాలు కోల్పోయింది.

భూతవైద్యుడు శ్యామ్ తోపాటు అతడికి సహరించిన రజిత బాబాయి రవీందర్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
Show comments