దాస్ కా ధమ్కీ

Tap to expand
మూవీ రివ్యూ : 'దాస్ కా ధమ్కీ'

నటీనటులు: విశ్వక్సేన్-నివేథా పెతురాజ్-రావు రమేష్-రోహిణి మొల్లేటి-హైపర్ ఆది-తరుణ్ భాస్కర్-అక్షర గౌడ్ తదితరులు

సంగీతం: లియోన్ జేమ్స్
ఛాయాగ్రహణం: దినేష్ బాబు
కథ: ప్రసన్నకుమార్ బెజవాడ
నిర్మాత: కరాటె రాజు
స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: విశ్వక్సేన్

టాలీవుడ్లో ఉన్న మల్టీ టాలెంటెడ్ హీరోల్లో విశ్వక్సేన్ ఒకడు. నటుడిగా మంచి పేరు సంపాదించిన అతడిలో రచయిత.. దర్శకుడు కూడా ఉన్నారు. ఇంతకుముందు ‘ఫలక్‌ నుమా దాస్’ అనే రీమేక్ మూవీ తీసిన అతను.. ఈసారి ‘దాస్ కా ధమ్కీ’తో మళ్లీ మెగా ఫోన్ పట్టాడు. ఇది అతడి సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కడం విశేషం. ఈ రోజే మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ:

కృష్ణదాస్ (విశ్వక్సేన్) ఒక అనాథ. చిన్నప్నట్నుంచి తనతో కలిసి పెరిగిన ఇద్దరు స్నేహితులతో కలిసి అతను ఒక ఫైవ్ స్టార్ హోటల్లో వెయిటర్ గా పని చేస్తుంటాడు. అతడికి ఆ హోటల్లోనే అనుకోకుండా కీర్తి (నివేథా పెతురాజ్) అనే అమ్మాయితో పరిచయం అవుతుంది. ఆమెతో ప్రేమలో పడిపోయిన కృష్ణ.. తాను ఒక డబ్బున్న వాడిలా నటిస్తూ ఆమెను మెప్పించే ప్రయత్నం చేస్తుంటాడు. కొన్ని రోజులకు ఆమె కూడా అతడి ప్రేమలో పడుతుంది. అప్పుడే కృష్ణ గురించి అసలు నిజం తెలుసుకున్న కీర్తి అతణ్ని అసహ్యించుకుని వెళ్లిపోతుంది.

మరోవైపు కృష్ణ ఉద్యోగం కూడా కోల్పోయి రోడ్డు మీదికి వచ్చేస్తాడు. అదే సమయంలో ఒక పెద్ద ఫార్మా కంపెనీని నడిపిస్తున్న ఓ వ్యక్తి వచ్చి ఆ కంపెనీ సీఈవో అయిన డాక్టర్ సంజయ్ లాగా కృష్ణను నటించమంటాడు. మరి ఆయనలా ఎందుకు అడిగాడు.. ఇంతకీ సంజయ్ ఎవరు.. అతడి స్థానంలోకి వెళ్లిన కృష్ణ ఎలా నెట్టుకొచ్చాడు.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెర మీదే చూసి తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:

‘పోకిరి’ సినిమా చాలా వరకు యావరేజ్ గానే అనిపిస్తుంది. కానీ ఆ సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయిపోయిందంటే.. చివర్లో మైండ్ బ్లోయింగ్ ట్విస్టు ఇచ్చిన ‘కిక్కు’ ప్రధాన కారణం. ఆ ట్విస్టులో ఒక్కసారిగా ఉలిక్కిపడే ప్రేక్షకులు.. ఒక్కసారిగా లాజిక్కులన్నీ పక్కన పెట్టేసి మెస్మరైజ్ అయిపోవడంతో ఆ సినిమా ఇరగాడేసింది. ఇక అక్కడి నుంచి మొదలు. మొదట అల్లా టప్పా సీన్లతో కథను నడిపించడం.. చివర్లో ఒక షాకింగ్ ట్విస్టు ఇచ్చి ఇప్పటిదాకా మీరు చూసిందంతా తూచ్ అనేయడం.. ఇదీ వరస.

ఐతే ప్రతిసారీ ఇలాంటి ట్విస్టులకు ఫిదా అయిపోయి సినిమాను హిట్ చేసేయడానికి ప్రేక్షకులు పిచ్చోళ్లు కాదు. ఈ ట్విస్టులు మరీ వెటకారంగా తయారై లాజిక్ ను కొండెక్కించేస్తుండటం...  కేవలం ఈ ట్విస్టుల్ని మాత్రమే నమ్ముకుని సినిమాలు లాగించేస్తుండటంతో ఆడియన్స్ షాకవ్వడం మాని రివర్సులో షాకులిస్తున్నారు. ఇప్పుడు ‘దాస్ కా ధమ్కీ’ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. ప్రేక్షకులను ట్విస్టులతో ఉక్కిరి బిక్కిరి చేసేయాలనే తపనలో విశ్వక్సేన్.. నేల విడిచి సాము చేశాడు ‘దాస్ కా ధమ్కీ’లో. ఒక దశ వరకు వినోదం పంచుతూ సాఫీగానే నడిచే ‘దాస్ కా ధమ్కీ’.. ఆ తర్వాత ఏమాత్రం కన్విన్సింగ్ గా అనిపించని ట్విస్టులు.. పాత్రలతో ప్రేక్షకులను చికాకు పెడుతుంది. చివరికొచ్చేసరికి ఇదేం సినిమారా బాబూ అని తల పట్టుకునేలా చేస్తుంది.

కథాకథనాల పరంగా చూసుకుంటే ‘దాస్ కా ధమ్కీ’లో ప్రథమార్ధం చాలా వరకు రొటీన్ గా సాగిపోతుంది. అందులో ఏ కొత్తదనం లేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి రొటీన్ కు భిన్నంగా నడిపించాలని చూశాడు విశ్వక్సేన్. ఇక్కడి నుంచి ట్విస్టుల మీద ట్విస్టులతో ప్రేక్షకుల అంచనాలకు అందని విధంగా సినిమా నడుస్తుంది. అలాంటపుడు ప్రథమార్ధంలో ప్రేక్షకులు బోర్ ఫీలవ్వాలి. ఇంటర్వెల్ దగ్గర్నుంచి సినిమా క్రేజీ రైడ్ లాగా అనిపించాలి.

కానీ సినిమా చూస్తుండగా దీనికి పూర్తి భిన్నమైన ఫీలింగ్ కలుగుతుంది. హీరో ఒక పేద కుర్రాడు.. హీరోయిన్ని ముగ్గులో దించడానికి ఆమె దగ్గర డబ్బున్న వాడిలా నటిస్తాడు.. కానీ ఇలా నటిస్తూ కూడా హీరోయిన్ని అనుభవించడానికి అవకాశం వస్తే ఉపయోగించుకోడు.. ఈ లక్షణాలు చూసి హీరోయిన్ ప్రేమలో పడిపోతుంది. ఆమె తన ప్రేమను చెప్పాలనుకున్నపుడు అతడి గురించి నిజం తెలిసిపోతుంది.. ఈ లైన్లో సాగే ట్రాక్స్ తెలుగు సినిమాల్లో బోలెడన్ని చూసుంటాం. అచ్చం అలాగే ఇందులో లవ్ ట్రాక్ నడిపించాడు విశ్వక్.

కానీ బోర్ ఫీలింగ్ రాకుండా ఈ సన్నివేశాలను సరదాగా నడిపించేశాడు. మీమ్ లాంగ్వేజ్ ను బాగా వంటబట్టించుకున్న విశ్వక్.. హైపర్ ఆది-రంగస్థలం మహేష్ లాంటి ట్రెండుకు తగ్గ ఆర్టిస్టులను పక్కన పెట్టుకుని కామెడీ డోస్ తగ్గకుండా చూసుకున్నాడు. దీంతో తొలిగంట చకచకా సాగిపోతుంది. ఈ మధ్యలో వచ్చే రెండు పాటలు కూడా ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ దగ్గర ట్విస్ట్ సైతం ఆకట్టుకుంటుంది. ద్వితీయార్ధం మీద ఆసక్తి రేకెత్తిస్తుంది.

కానీ రెండో అర్ధం మొదలయ్యాకే వస్తుంది అసలు సమస్య. ఎంతసేపూ కథను ఎలా ట్విస్ట్ చేద్దాం.. ప్రేక్షకులను ఎలా సర్ప్రైజ్ చేద్దాం.. అన్నట్లే సాగింది రచయిత-దర్శకుల ఆలోచన. ఈ క్రమంలో లాజిక్ పూర్తిగా పక్కన పెట్టేశారు. ఓ సన్నివేశం తీస్తూ ఇది ఎంతమాత్రం కన్విన్సింగ్ గా అనిపిస్తుంది అన్నది ఆలోచించలేదు. ఎలా పడితే అలా రాసేశారు.. తీసేశారు. లాజిక్ కొండెక్కేసి.. ట్విస్టులు కాస్తా వెటకారంగా తయారయ్యాయి. ఓవర్ ద టాప్ అనిపించే సీన్లు ప్రేక్షకులకు చికాకు పుట్టిస్తాయి.

దర్శకుడిగా విశ్వక్ అనుభవ లేమిని చాటే సీన్లు ద్వితీయార్ధంలో చాలా ఉన్నాయి. పూర్తిగా గాడి తప్పిన కథనం సినిమా మీద రాను రాను ఆసక్తిని చంపేస్తుంది. చివరి వరకు ట్విస్టులు కొనసాగుతూనే ఉన్నా.. ఇదేం మ్యాడ్నెస్ అనిపిస్తుందే తప్ప థ్రిల్ ఫీలయ్యే స్కోప్ లేకపోయింది. ఈ మ్యాడ్నెస్ ఎంజాయ్ చేయగలం అనుకున్న వాళ్లు.. ‘దాస్ కా ధమ్కీ’ని చూడొచ్చు. కొన్ని ఆకర్షణలు ఉన్నప్పటికీ.. ఓవరాల్ గా అయితే ‘దాస్ ధమ్కీ’తో సగటు ప్రేక్షకులు కనెక్ట్ కావడం కష్టమే.

నటీనటులు:

విశ్వక్సేన్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న రెండు పాత్రలు చేశాడిందులో. హోటల్ వెయిటర్ పాత్రలో అతడి స్క్రీన్ ప్రెజెన్స్.. నటన బాగున్నాయి. ఈ పాత్రలో అమాయకంగా కనిపిస్తూ అతను ప్రేక్షకుల మనసు దోస్తాడు. సంజయ్ గా మరో పాత్రలో మాత్రం విశ్వక్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. అతణ్ని సైకో తరహా పాత్రలో చూడటం ఇబ్బందిగానే అనిపిస్తుంది. అతడి కన్నింగ్ యాక్ట్స్ కామెడీ అయిపోయాయి కొన్ని చోట్ల. విశ్వక్ చాలా కష్టపడ్డాడనే ఫీలింగ్ కలుగుతుంది తప్ప.. నటన మాత్రం కన్విన్సింగ్ గా అనిపించదు.

నివేథా పెతురాజ్ కూడా వేరియేషన్ ఉన్న పాత్ర చేసింది. తన పెర్ఫామెన్స్ ఓకే. తెలుగులో ఇప్పటిదాకా ఎన్నడూ లేనంత సెక్సీగా కనిపించిందామె. రావు రమేష్ తనకు అలవాటైన పాత్రలో బాగానే చేశాడు. ఆయన పాత్ర రంగప్రవేశంతోనే తర్వాత అందులోని ట్విస్టును ఊహించేయొచ్చు. హీరో స్నేహితుల పాత్రల్లో హైపర్ ఆది, రంగస్థలం మహేష్ ఆకట్టుకున్నారు. ప్రథమార్ధంలో వీరి పంచ్ కామెడీ పెద్ద రిలీఫ్. రోహిణి ప్రతిభకు తగ్గ పాత్ర ఇవ్వలేదిందులో. ఆమె నటించడానికి అవకాశమే లేకుండా చేశారు. మిగతా నటీనటులంతా మామూలే.

సాంకేతిక వర్గం:

‘దాస్ కా ధమ్కీ’కి సాంకేతిక హంగులు బాగానే కుదిరాయి. విశ్వక్ సొంత నిర్మాణ సంస్థ రాజీ లేకుండా అతడి మార్కెట్ స్థాయికి మించి రిచ్ గా సినిమాను తీర్చిదిద్దింది. లియోన్ జేమ్స్ పడిపోయానే పిల్లా.. మామా బ్రో.. లాంటి క్యాచీ సాంగ్స్ ఇచ్చాడు. వీటి చిత్రీకరణ కూడా ఆకట్టుకుంటుంది. మిగతా పాటలు పర్వాలేదు. దినేష్ బాబు సినిమాటోగ్రఫీ కూడా మెప్పిస్తుంది. విజువల్స్ కలర్ ఫుల్ గా.. రిచ్ గా అనిపిస్తాయి.

ప్రసన్నకుమార్ బెజవాడ అల్లిన కథ బాలేదని చెప్పలేం. అలా అని బాగుందనీ అనలేం. కథలో డ్రామా అనుకున్నంతగా పండలేదు. ప్రేక్షకులకు షాకులు ఇవ్వాలని.. వాళ్లను సర్ప్రైజ్ చేయాలని ఓవర్ డోస్ ట్విస్టులు పెట్టడంతో అంతా గందరగోళంగా అనిపిస్తుంది. ప్రథమార్ధం వరకు సినిమాను బాగానే డీల్ చేసిన విశ్వక్.. రెండో అర్ధంలో బౌండరీలు దాటేశాడు. అతడి అనుభవ లేమి స్పష్టంగా కనిపిస్తుంది.

సినిమాలో ఏ రసమైనా ఎంత పాళ్లలో ఉండాలో సరిగ్గా చూసుకోవడంలో.. సన్నివేశాలను కన్విన్సింగ్ గా తీర్చిదిద్దడంలో దర్శకుడి ప్రతిభ తెలుస్తుంది. ఇక్కడే విశ్వక్ ఫెయిలయ్యాడు. లీడ్ రోల్ చేస్తూ.. ప్రొడక్షన్ చూసుకుంటూ సినిమా తీయడం అంటే మాటలు కాదు. అతడి కష్టాన్ని తక్కువ చేయలేం కానీ.. దర్శకుడిగా అతను అంచనాలను అందుకోలేకపోయాడన్నది వాస్తవం.

చివరగా: దాస్ గారి ధమ్కీలు ఓవర్ డోస్

రేటింగ్ - 2.25/5
Show comments
More