తనను జైల్లో పెట్టినా.. ప్రధాని ప్రశ్నలు వేస్తూనే ఉంటానని రాహుల్ గాంధీ తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తన పోరాటం కొనసాగుతుందని చెప్పారు. మన దేశ ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని తాను ఇప్పటికే చాలాసార్లు చెప్పానని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. అందుకు ఉదాహరణలే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలని రాహుల్ తెలిపారు.
అదానీ వ్యవహారంపై ప్రధాని మోడీని ప్రశ్నించినందుకు తనకేం జరిగిందో ప్రజలంతా చూశారన్నారు. లోక్ సభలో మాట్లాడే అవకాశం తనకు ఇవ్వలేదని రాహుల్ ఆరోపించారు. అంతేకాకుండా లోక్ సభలో తన ప్రసంగాన్ని కూడా తొలగించారని విమర్శించారు.
బ్రిటన్లో తాను అనని మాటలను అన్నట్లు ప్రచారం చేశారని బీజేపీ నేతలపై రాహుల్ మండిపడ్డారు. ఈ విషయంలో సాక్షాత్తు కేంద్ర మంత్రే పార్లమెంట్లో అసత్యాలు వల్లించారని విమర్శించారు. ఇప్పుడు చివరకు తనపై అనర్హత వేటు వేశారన్నారు. అయినా తాను ప్రశ్నించడం ఆపబోనన్నారు.
ఈ దేశం తనకు ప్రేమ ఆప్యాయత అన్నీ ఇచ్చిందన్నారు. అందుకే ఈ దేశ ప్రజల కోసం తాను ఏదైనా చేయడానికి వెనుకాడబోనని రాహుల్ తెలిపారు. నిజం మాట్లాడటం తప్ప తనకు మరో మార్గం లేదన్నారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. తన పేరు సావర్కర్ కాదని.. గాంధీ అని హాట్ కామెంట్స్ చేశారు. క్షమాపణలు చెప్పే కుటుంబం తనది కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అదానీ వ్యవహారంపై తాను లోక్ సభ స్పీకర్ కు అన్ని ఆధారాలతో రెండు లేఖలు రాశానని రాహుల్ గాంధీ తెలిపారు. అయినా తనకు సమాధానం రాలేదన్నారు. దీని గురించి స్పీకర్ ఛాంబర్కు వెళ్లి అడిగిన సరైన స్పందన లేదన్నారు. స్పీకర్ ఒక నవ్వు నవ్వి తనను టీ తాగడానికి మాత్రమే ఆహ్వానించారని రాహుల్ మండిపడ్డారు.
అదానీ మోదీకి చాలా ఏళ్లుగా స్నేహబంధం ఉందని రాహుల్ గాంధీ విమర్శించారు. గుజరాత్ సీఎంగా మోదీ ఉన్నప్పటి నుంచే వారి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని ఆరోపించారు. అదానీ డొల్ల కంపెనీల్లో రూ.20వేల కోట్లు పెట్టుబడి పెట్టిందెవరో తేలాలన్నారు. అందులో కొన్ని రక్షణ రంగానికి చెందినవి కూడా ఉన్నాయని.. అయినా రక్షణ శాఖ ఎందుకు అభ్యంతరం చెప్పలేదని నిలదీశారు. అత్యంత అవినీతి వ్యక్తికి ప్రధాని ఎందుకు మద్దతుగా నిలుస్తున్నారని రాహుల్ ప్రశ్నించారు. దీనికి మోదీ సమాధానం చెపాల్సిందేనన్నారు. అదానీ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు బీజేపీ అనర్హత పేరుతో నాటకాలాడుతోంది అని రాహుల్ నిప్పులు చెరిగారు.
ప్రస్తుతం దేశంలో ప్రతిపక్షాలకు వ్యవస్థల మద్దతు లేదని రాహుల్ అన్నారు. కేవలం ప్రజల మద్దతుతోనే విపక్షాలు పోరాటం చేస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా అనర్హత విషయంలో తనకు అండగా నిలిచిన విపక్షాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.